Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతి లేకుండా గేట్లు తెరవద్దని ఈడీ ఆదేశాలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికి ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీల్ వేసింది. మనీలాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రాంగణం తెరవరాదని ఈడీ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికీ నేషనల్ హెరాల్డ్ కేసులో..సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను ఈడీ గంటల తరబడి ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా న్యూఢిల్లీలోనే హెరాల్డ్ హౌజ్‌లో సోదాలు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఆఫీస్‌కు ఈడీ సీల్ వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించిన అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ నుంచి యంగ్ ఇండియన్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులోనే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు గరిష్ట వాటాలున్నాయి.
ఇక నేషనల్ హెరాల్డ్ ఆఫీస్ సీల్‌కు సంబంధించి ఈడీ తరఫున స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. తాజాగా నేషనల్ హెరాల్డ్ హౌస్‌తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే..ప్రస్తుతం 10 జన్‌పథ్‌లోని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంటివద్ద అదనపు పోలీస్ బలగాలు మోహరించారు.
ఏఐసీసీ ప్రధాన కార్యాలయం, 10 జన్‌పథ్ వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారని తెలిసింది. నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌కు సీల్ వేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రతిపక్ష పార్టీలను రాజకీయంగా బలహీనపర్చడానికి కేంద్రం దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పుతోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరీ అన్నారు. పార్లమెంట్లో తమ గొంతు అణచివేస్తోందని ఆరోపించారు.