Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందులో ఎవరెవరు ఉండాలో మీరే చెప్పండి..
- కేంద్రం, రాజకీయ పార్టీలను కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఎన్నికల్లో గెలుపుకోసం రాజకీయ పార్టీలు ప్రకటించే అహేతుకమైన ఉచిత పథకాలకు అడ్డుకట్ట వేయటం ఎలా ? అన్నదానిపై బుధవారం సుప్రీంకోర్టులో వాదోపవాదనలు సుదీర్ఘంగా సాగాయి. అహేతుకమైన ఉచిత పథకాలు..అనే అంశం చర్చించడానికి పార్లమెంట్ సరైన వేదిక కాదని, ఈ అంశంతో ముడిపడిన వారందరితో అత్యున్నత స్థాయి నిపుణుల సంఘాన్ని (అపెక్స్ బాడీ) ఏర్పాటుచేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అహేతుకమైన ఉచితాలపై నిర్మోహమాటంగా పరిశీలన చేసే వ్యక్తులతో అపెక్స్ బాడీ ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ అపెక్స్ బాడీలో ఎవరెవరు ఉండాలో కేంద్రం, పిటిషనర్లు, రాజకీయ పార్టీలు తమ అభిప్రాయం చెప్పాలని సీజేఐ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అహేతుకమైన ఉచిత హామీలతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని కేంద్రం తరఫున తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సమస్యను పరిష్కరించటంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా చోటు కల్పించాలన్నారు. దీనిని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. పార్లమెంట్ చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
కపిల్ సిబల్ వాదనపై సీజేఐ స్పందిస్తూ..''ఈ అంశంపై పార్లమెంటు చర్చిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏ రాజకీయ పార్టీ ఇందుకు ఒప్పు కుంటుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఉచితాలు కావాలి. వాస్తవం అలా ఉంది. అంతిమంగా, పన్నులు చెల్లించేవారు, సామాన్య ప్రజలు ఏమి అనుకుంటున్నా రనేది ముఖ్యం'' అని అన్నారు. ఇవన్నీ విధానపరమైన అంశాలని, కోర్టులకు పరిమి తులుంటాయని చెప్పారు. ఈ అంశంతో ముడిపడి ఉన్న అందరూ చర్చించుకుని ప్రభుత్వానికి సిఫారసు చేస్తే, కేంద్ర ఎన్నికల సంఘం దానిని అమలు చేస్తుందన్నారు. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన వినిపిస్తూ, ప్రజాకర్షణ ప్రకటనలు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయని, ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని అన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, వీటివల్ల ధనవంతులే కాకుండా పేదలు కూడా లబ్ది పొందుతున్నారని, దీనిపై ఏమేరకు చెక్ చేయగలమనేదే అసలు ప్రశ్న అన్నారు.