Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ ప్రాంతాల్లో పర్వాలేదు.. వ్యవసాయం మద్దతు : సీఎంఐఈ
ముంబయి : పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. ప్రస్తుత ఏడాది జులైలో ఈ పట్టణాల్లో నిరుద్యోగ శాతం 8.21 శాతానికి ఎగిసినట్టు తెలిపింది. ఇంతక్రితం జూన్ మాసంలో ఇది 7.80 శాతంగా ఉందని పేర్కొంది. పరిశ్రమలు, సేవల రంగంలో ఉద్యోగాల కల్పన తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని సీఎంఐఈ రిపోర్ట్ విశ్లేషించింది. రిపోర్ట్ వివరాలు.. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి 6 లక్షలు తగ్గి 12.57 కోట్ల నుంచి 12.51 కోట్లకు పరిమితమయ్యింది. గడిచిన ఆరు మాసాల్లో మాత్రం దేశంలో నిరుద్యోగ శాతం 6.80 శాతానికి తగ్గింది. మెరుగైన వర్షాలతో వ్యవసాయ కార్యకలాపాలు పెరగడం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుదలకు దోహదం చేసింది. దేశ వ్యాప్తంగా గడిచిన జూన్‌లో 7.80 శాతంగా ఉన్న నిరుద్యోగ శాతం.. జులైలో 6.80 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.03 శాతం లేదా 27.21 కోట్ల నుంచి నుంచి 6.14 శాతానికి లేదా 26.52 కోట్లకు తగ్గింది. వ్యవసాయ రంగం ఆశా జనకంగా కనబడటంతో నిరుద్యోగం స్థూలంగా తగ్గిందని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మహేష్ వ్యాస్ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన రికవరీ కనబడిందన్నారు.
వ్యవసాయ రంగం జులైలో 94 లక్షల మందికి కొత్తగా అవకాశాలు కల్పించగా... జూన్‌లో 80 లక్షల మందికి ఉపాధి కల్పించిందన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఉత్తర ప్రదేశ్‌లో అతి తక్కువ వర్షాలు పడ్డాయన్నారు. యూపీ, బెంగాల్, బీహార్‌లో సాగు 13 శాతం తగ్గిందన్నారు. మిగితా ప్రాంతాల్లో ఖరీఫ్‌లో మెరుగుదల ఉందన్నారు. గడిచిన జూన్, జులై మాసాల్లో వ్యవసాయేతర రంగాల్లో 80 లక్షల మంది ఉపాధి దెబ్బతినింది. పరిశ్రమలు, సేవల రంగాల్లో సమానంగా ఉద్యోగాలు ఊడాయి. ఉద్యోగ అవకాశాలు పెరగడానికి భారీ పెట్టుబడులు అవసరమని వ్యాస్ పేర్కొన్నారు.
మందగించిన సర్వీస్ సెక్టార్
ప్రస్తుత ఏడాది జులైలో సేవల (సర్వీసు) రంగం కార్యకలాపాలు మందగించి.. నాలుగు నెలల కనిష్టానికి తగ్గాయి. సంస్థల మధ్య తీవ్రమైన పోటీ, ద్రవ్యోల్బణం, ప్రతికూల వాతావరణం సేవలపై ప్రభావం చూపిందని ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ సూచీ తెలిపింది. జూన్‌లో ఈ సూచీ 59.2 నుంచి జులైలో 55.5 పాయింట్లకు తగ్గింది. పిఎంఐ సూచీ 50కి కింద క్షీణతగా.. 50కి పైన వద్ధిగా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే.