Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ పార్టీలతో సంప్రదించాలని సీఈసీకి ఏచూరి లేఖ
- లోపాలపై సమగ్రమైన నివేదిక వచ్చే వరకూ ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ : ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఆందోళన వ్యక్తంచేశారు. భద్రత, గోప్యత, ఓటరు తొలగింపులకు సంబంధించి ఈ అంశంపై భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ)కి లేఖ రాశారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. దీని ప్రకారం.. ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మళ్లీ ప్రారంభించింది. నేషనల్ ఎలక్టోరల్ రోల్స్ ప్యూరిఫికేషన్-అథెంటికేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2015లో ఈ ప్రక్రియ మొదలైంది. సుప్రీంకోర్టు నిలిపివేసే వరకు ఈ ప్రక్రియ జరిగింది. ఈ కసరత్తులో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రధాన ఎన్నికల అధికారులు, ఎన్పీఆర్, పీడీఎస్, స్టేట్ రెసిడెంట్ డేటా హబ్స్ (ఎస్ఆర్డీహెచ్) వంటి అనేక ఇతర డేటాబేస్‌ల నుంచి ఓటర్ల ఆధార్ సమాచారాన్ని పొందారు. ఈ ఎన్నికల కార్యాలయాలు ఓటర్లకు సమాచారం ఇవ్వకుండానే 31 కోట్ల మంది ఓటర్ల ఓటర్ ఐడీలతో ఆధార్‌ను లింక్చేశాయి. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఓటరు తొలగింపులకు దారి తీసింది. ఫలితంగా 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది అసలైన ఓటర్లపై ప్రభావం పడింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆధార్‌తో అనుసంధానించబడిన ఓటర్ ఐడీల సమాచార ఉల్లంఘనలు జరిగాయి.
ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాజకీయ పార్టీలతో సంప్రదింపులు లేకపోవటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం భారత్‌లో రక్షణ లేదా గోప్యత చట్టం కానీ, ఓటర్ల ఆధార్ డేటా నిర్వహణకు సంబంధించి భారత ఎన్నికల సంఘం గోప్యతా విధానాన్ని కూడా కలిగి లేదు. ఆధార్ అనుసంధాన ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం నకిలీ ఓటర్లను తొలగించటం. అయితే, యూఐడీఏఐపై కాగ్ తన నివేదికలో డూప్లికేట్ ఆధార్ గురించి లేవనెత్తినందున అనుసంధాన ప్రక్రియ తొందరపాటు చర్య అవుతుంది. భారత ఎన్నికల సంఘం నుంచి అన్ని విధి విధానాలు లేకపోవటం, ప్రతి ఓటరు ఆధార్‌నూ లింక్ చేయటానికి తొందరపాటు ప్రక్రియ కారణంగా గతంలో లాగే నిజమైన ఓటర్లను తొలగించటం వంటి సంఘటనలకు దారి తీస్తుంది.
సమాచార భద్రత లేకపోవటం, ఓటరు తొలగింపులు మరియు ఎన్నికల సంఘం డేటాతో కూడిన సమాచారాన్ని వివిధ రాష్ట్ర నిఘా డేటాబేస్లకు గురిచేయటం ప్రజా ప్రాతినిథ్య చట్టాన్ని ఉల్లంఘించటమే. ఓటరు తొలగింపులు, సమాచార ఉల్లంఘనలలో జరిగిన ఈ తీవ్రమైన లోపాలపై దర్యాప్తు చేయటం భారత ఎన్నికల సంఘం విధి. ఈ లోపాలపై దర్యాప్తు నివేదికను రూపొందించి, స్పష్టమైన సమాచారం బయటకు వచ్చే వరకు ఈ అనుసంధాన ప్రక్రియను నిలిపివేయాలి. అనుసంధాన ప్రక్రియకు అనుమతినిస్తూ 2021లో ప్రజాప్రాతినిథ్య చట్టానికి సవరణలు చేయటానికి ముందు సేకరించిన మొత్తం ఆధార్ సమాచారాన్ని ఎన్నికల సంఘం తప్పనిసరిగా తొలగించాలి. గతంలో అనుసంధాన ప్రక్రియను అధికారులు ఓటర్లకు సరైన సమాచారం లేకుండా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటికే ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేసిన ప్రతి ఓటరుకూ దీనిని తెలియజేయాలి. ఓటర్లకు తమ ఆధార్‌ను డి-లింక్ చేసే హక్కును వినియోగించుకోవటానికి అనుమతించాలి. మొత్తం సాంకేతిక ప్రక్రియ, గోప్యతా విధానాలు ప్రచురించాలి. దీనిని అన్ని రాజకీయ పార్టీలూ, ప్రజలకు తెలియజేయాలి. సమాచార రక్షణ చట్టం లేకపోవటంతో.. ఎన్ఏటీజీఆర్ఐడీ డేటా బేస్, నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజెన్స్, జనన, మరణాలకు సంబంధించి రాబోయే ఏదైనా డేటాబేస్‌ల కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో.. ఆధార్‌తో అనుసంధానించబడిన అన్ని ఓటర్ ఐడీలను షేర్ చేయటాన్ని మేము వ్యతిరేకిస్తాం. సేకరించిన ఈ డేటాను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనిపై ప్రయోజన పరిమితికి డిమాండ్ చేస్తాం. ఎన్నికల సంఘం గోప్యతా పద్ధతుల అవసరాన్ని నిర్ధారించాలి. డేటా సేకరణ నకిలీలను తొలగించటానికే పరిమితం చేయాలి. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018)లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది కూడా తప్పనిసరి కాదు. ఈ విషయంలో కమిషన్ అందరు ఎన్నికల అధికారులకు అన్ని డేటా పద్దతులు, అనుసరించాల్సిన గోప్యతా పద్ధతులను సూచించాలి. ఇందులోని ఏవైనా ఉల్లంఘనలు తప్పనిసరిగా ఈసీ ద్వారా కచ్చితంగా పరిష్కరించబడాలి.