Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్తల ప్రమాణ స్వీకారం
భోపాల్ : రాజకీయ రంగంలో మహిళా సాధికారత నేతిబీరకాయలో నేతి చందంలా ఉందనటానికి మరో ఉదాహరణ ఈ ఘటన. గ్రామ పంచాయితీల్లో మహిళలకు సీట్లయితే కేటాయిస్తున్నారు గానీ... పెత్తనమంతా భర్తలేద నని ఇప్పటివరకూ విన్నాం.. చూశాం. కానీ, ప్రమాణ స్వీకారం కూడా భర్తలే చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఇటీవల మధ్యప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దామోహ్ జిల్లాలోని ఓ గ్రామపంచాయతీలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ స్థానంలో ఆమె భర్త ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దామోహ్ జిల్లాలోని గైసాబాద్ పంచాయతీ పరిధిలో షెడ్యూల్ తరగతికి చెందిన ఒక మహిళ సర్పంచుగా గెలుపొందింది. మరికొంతమంది మహిళలు కూడా విజయం సాధించారు. అయితే ప్రమాణ స్వీకారం సమయంలో మహిళలకు బదులుగా అంతా భర్తలే హాజరయ్యారు. భార్యల స్థానంలో భర్తలే ప్రమాణస్వీకారం చేశారు. ఇందుకు అధికారులు కూడా అనుమతించడం గమనార్హం. ఈ ఘటనపై దామోహ్ పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజరు శ్రీవాస్తవ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమం జరిగిందనీ, విచారణ చేపడతామని అన్నారు. పంచాయతీ కార్యదర్శి దోషిగా తేలితే శిక్షిస్తామని అన్నారు.