Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11న ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఎన్నికయ్యారు. ఆయన ఈ నెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్‌లోని రూం నెంబర్ 63లో జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం, సీపీఐ నేత బినరు విశ్వం, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయ సాయి రెడ్డి, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావుతో పాటు సీపీఐ(ఎం), వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. అనంతరం పార్లమెంట్‌లోని రూం నెంబర్ 62లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రిటర్నింగ్ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఫలితాలను వెల్లడించారు. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఎన్నిక అయినట్టు వెల్లడించారు. మొత్తం 780 ఓట్లలో 725 (92.94 శాతం) ఓట్లు పోలైయ్యాయి. అందులో బిజెపి అభ్యర్థి జగదీప్ ధన్కర్కు 528 ఓట్లు రాగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు పోలైయ్యాయి. దీంతో మార్గరెట్ అల్వాపై జగదీప్ ధన్కర్ 346 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. టిఎంసి ఎన్నికలను బహిష్కరించినప్పటికీ, టిఎంసి ఎంపిలు శిశిర్ అధికారి, దివ్యేందు అధికారి (పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత, బిజెపి నేత సువేందు అధికారి తండ్రి, తమ్ముడు) ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కరోనా సోకడంతో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింగ్ పిపిఈ కిట్‌తో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధన్కర్కు ప్రధాని మోడీతో సహా పలువురు నేతలు శుభాకాంక్షులు తెలిపారు. ఈనెల 10తో ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుంది. ఆరోజే ఆయనకు వీడ్కోల్ పలక నున్నారు. ఆ మరుసటి రోజు నూతనంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జగదీప్ ధన్కర్ నేపథ్యం
1951 మే 18న రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లా కితానా గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సిహెచ్ గోకల్ చంద్, కేసరి దేవి. జాట్ సామాజిక వర్గానికి చెందిన ధంకర్, కితానా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్య అభ్యసించారు. ఆరో తరగతి ఘర్ధన ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల లో చేరారు. చిత్తోర్‌ఘర్‌లోని సైనిక్ స్కూల్లో ఆయన పాఠశాల విద్యను పూర్తి చేశారు. తరువాత జైపూర్‌లోని మహారాజా కళాశాలలో మూడేళ్లు బీఎస్సీ ఆనర్స్ ఫిజిక్స్‌లో పట్టభద్రుడయ్యారు. 1978-79లో రాజస్థాన్ యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేశారు. 1979 నవంబర్ 10న న్యాయవాదిగా రాజస్థాన్ బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నారు. 1990 మార్చి 27న నుండి సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. 1987లో అతిపిన్న వయస్సులో రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎన్నియ్యారు. 1989-91లో రాజస్థాన్‌లోని ఝుంఝును లోక్‌సభ నియో జకవర్గం నుంచి జనతాదళ్‌కు ప్రాతినిధ్యం వహిం చారు. 1990లో పార్లమెంటరీ కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రిగా పని చేశారు. 1993-18లో రాజస్థాన్‌లో ని అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నుండి ఎమ్మెల్యేగా పని చేశారు. రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ జైపూర్ అధ్యక్షుడుగా పని చేశారు. 20 జూలై 2019న పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితుల య్యారు. అంతకు ముందు బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడుగా పని చేశారు. అలాగే 1990 నుండి సుప్రీం కోర్టులో న్యాయవాది పని చేశారు. రాజస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్, రాజస్థాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.