Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా నేటి నుంచి 14 వరకు సమ్మేళనాలు
- ఎస్కేఎం, మాజీ సైనికులు, నిరుద్యోగ యువత పిలుపు
న్యూఢిల్లీ : సాయుధ బలగాల్లో కాంట్రాక్టీకరణ పేరుతో తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్-సర్వీస్‌మెన్, నిరుద్యోగ యువత సంయుక్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 7 నుంచి 14 వరకు జై జవాన్ జై కిసాన్ సమ్మేళనాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు శనివారం నాడిక్కడ ఉమెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్-సర్వీస్‌మెన్ తరపున మేజర్ జనరల్ సత్బీర్ సింగ్,(రిటైర్డ్), గ్రూప్ కెప్టెన్ వికె గాంధీ (రిటైర్డ్), సంయుక్త కిసాన్ మోర్చా తరపున హన్నన్ మొల్లా, రాకేష్ టికాయత్, యోగేంద్ర యాదవ్, యువజన సంఘాల తరపున ఐషీఘోష్, మనీష్ తదితరులు మాట్లాడారు. అగ్నిపథ్ పథకం జాతీయ భద్రత, సాయుధ బలగాలు, నిరుద్యోగ యువత, రైతు కుటుంబాలకు వినాశకరమైనదని విమర్శించారు. ఈ పథకాన్ని ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వినాశకరమైన 'అగ్నిపథ్ స్కీమ్'కి వ్యతిరేకంగా దేశంలోని రైతులు, మాజీ సైనికులు, యువకులు నిరంతర ప్రచారానికి ఉమ్మడిగా ఒకే వేదికపైకి వచ్చాయని తెలిపారు. ఈ పథకం సాయుధ దళాలకు రెగ్యులర్, శాశ్వత రిక్రూట్మెంట్ పద్ధతికి ముగింపు పలుకుతుందనీ, దీని అర్థం సాయుధ బలగాల పరిమాణాన్ని ప్రస్తుతం 14 లక్షల మంది నుంచి కేవలం 7 లక్షలకు తగ్గించడమేనని పేర్కొన్నారు. జాతీయ భద్రతకు బాహ్య బెదిరింపులు పెరుగుతున్న సమయంలో కాంట్రాక్టు అగ్నివీర్స్తో రెగ్యులర్ రిక్రూట్మెంట్లో ఎక్కువ భాగాన్ని భర్తీ చేయడం వలన సాయుధ దళాల కార్యాచరణ సామర్థ్యం, నైతికత తీవ్రంగా దెబ్బతింటుందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ ఉపాధి అవకాశాల తగ్గింపును ఎదుర్కొంటున్న నిరుద్యోగ యువతకు తీవ్రంగా నష్టం జరుగుతుందని అన్నారు. తమ యువతను సాయుధ దళాలకు పంపి దేశానికి అందించిన రైతు కుటుంబాలకు ఇది తీవ్రమైన ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. ప్రతిపాదిత 'ఆల్ ఇండియా ఆల్ క్లాస్ రిక్రూట్మెంట్' పంజాబ్, హర్యానా, హిమాచల్, ఉత్తరాఖండ్, పశ్చిమ యూపీ, తూర్పు రాజస్థాన్ వంటి ప్రాంతాల తమ వాటాను తీవ్రంగా తగ్గిస్తుందని తెలిపారు. ఈ రాష్ట్రాలు తరతరాలుగా సాయుధ దళాలకు దోహదపడతాయని, అంతేకాకుండా రెజిమెంట్ల నైతికతను ప్రభావితం చేస్తాయని విమర్శించారు.
వివాదాస్పద అగ్నిపథ్ పథకం వినాశకరమైన పర్యవసానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజాస్వామ్య, శాంతియుత, రాజ్యాంగ మార్గాలను ఉపయోగించి ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ ప్రచారం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రైతులు, జవాన్లు కష్టాల్లో ఉన్నందున, దేశ వెన్నుముక విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని విమర్శించారు. ప్రభుత్వం బుల్డోజ్ చేసి దేశాన్ని రక్షించేవారిని, ఉత్పత్తిదారులను నాశనం చేస్తుందని దుయ్యబట్టారు. కనుక అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారాందోళనను నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 7న నర్వానా (జిల్లా జింద్, హర్యానా), జాత్ ధర్మశాల, మధుర (ఉత్తరప్రదేశ్), మనగడి, కలకత్తా (పశ్చిమ బెంగాల్), ఆగస్టు 9: రేవారి (హర్యానా), యాదవ్ ధర్మశాల, ముజఫర్‌నగర్ (యుపి), బేతవాడ గ్రామం, ఆగస్టు 10న ఇండోర్ (మధ్యప్రదేశ్), మీరట్ (యుపి) చిడోరి గ్రామం, ఆగస్టు 11న పాట్నా (బీహార్), ఆగస్టు 12, 13ల్లో పంజాబ్‌లోని వివిధ ప్రదేశాలల్లో, ఆగస్టు 14న మీరట్ (యుపి) చుర్ గ్రామంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
డిమాండ్లు...
1) అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. దాని కింద జారీ చేయబడిన అన్ని నోటిఫికేషన్లను తప్పనిసరిగా ఉపసంహరించుకోవాలి. రెగ్యులర్, పర్మినెంట్ రిక్రూట్‌మెంట్‌ను టైమ్ టెస్టెడ్ పద్ధతిని కొనసాగించాలి.
2) పెండింగ్‌లో ఉన్న ఖాళీలు (సుమారు 1.25 లక్షలు), ప్రస్తుత సంవత్సరం ఖాళీలు (సుమారు 60,000) ముందుగా ఉన్న రెగ్యులర్, పర్మినెంట్ రిక్రూట్మెంట్ పద్ధతిని అనుసరించి వెంటనే భర్తీ చేయాలి.
3) ఇప్పటికే ప్రారంభించిన రిక్రూట్మెంట్ ప్రక్రియను గత రెండేళ్లుగా రిక్రూట్మెంట్ చేయని స్థానానికి బదులుగా రెండేళ్ల వయస్సు సడలింపుతో పూర్తి చేయాలి.
4) అగ్నిపథ్ వ్యతిరేక నిరసనకారులపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకోవాలి. అరెస్టు చేసిన యువకులను వెంటనే విడుదల చేయాలి.
5) రక్షణ రంగంలో ప్రయివేటీకరణ ఆపాలి. జాతీయ భద్రత, సాయుధ దళాల గౌరవం, నైతిక రక్షణ కోసం ప్రభుత్వం తన బాధ్యతను అంగీకరించాలి.