Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగం తాండవిస్తోంది.!
- ఇబ్బందుల్లో యువత, మహిళలు
- ప్రభుత్వం పరిష్కారం చూపాలి
- ఆనంద్ మహీంద్రా ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : భారత్లో నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. ముఖ్యంగా యువత, మహిళలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. దేశంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారిలో కేవలం 40 శాతం మందికే పని లభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన కంపెనీ 76వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలు ఇంతకాలం చైనాపై ఆధారపడ్డాయన్నారు. తాజాగా భారత్ వైపు చూస్తున్నాయన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ''భారత్లో నిరుద్యోగ స్థాయి 7-8 శాతానికి చేరినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ (సిఎంఐఇ) గణంకాలు చెబుతున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) పెరిగినంత వేగంగా ఉద్యోగాల సృష్టి జరగడం లేదు. పని చేయగల సామర్థ్యం, పని చేయడానికి సిద్దంగా ఉన్న వారిలో కేవలం 40 శాతం మందికే ఉపాది దొరుకుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా పలు పరిస్థితులు భారత్కు అనుకూలంగా ఉన్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పలు లోపాలను సవరించుకోవాలి. అందులో ఒక్కటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకోవడం కీలకమైంది.
డెలివరీ బారు ఉద్యోగాలు సరిపోవు..
''ప్రపంచంలో అతి ఎక్కువ యువ జనాభా కలిగిన భారత్లో ఉద్యోగాభివద్ధి జరగకపోతే సామాజిక అశాంతికి దారి తీసే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులను ఊహించుకోలేము. ప్రభుత్వం కొంతమేర తన వంతు కషి చేస్తున్నా.. ఇంకా జరగాల్సింది చాలా ఉంది.'' అని మహీంద్రా పేర్కొన్నారు. 2023 నాటికి 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ సర్కార్ చేసిన ప్రకటనను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాబ్ డ్రైవర్లు, జొమాటో డెలివరీ బారుల రూపంలో గిగ్ ఎకనామీలో మాత్రమే ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ఇది ఎంత మాత్రం సరిపోదన్నారు.
ఎంఎస్ఎంఇలకు మద్దతివ్వాలి..
పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలంటే తయారీ, టెక్నలాజీ, ఎంఎస్ఎంఇ తదితర రంగాలను ప్రోత్సహించాలని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. దేశంలో స్థానికంగా ఎక్కువ ఉద్యోగాలు సృష్టిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను ప్రోత్సహించాలని సూచించారు.