Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టల్ ఉద్యోగుల పోరు బాట
- మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా 10న దేశవ్యాప్త ఆందోళన
- పాల్గొననున్న ఐదు లక్షల మంది ఉద్యోగులు
- సీఐటీయూతో పాటు వివిధ వర్గాల నుంచి మద్దతు
న్యూఢిల్లీ : భారత తపాలా వ్యవస్థపై మోడీ సర్కారు అవలంబిస్తున్న విధానాల పట్ల ఆ శాఖ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పోస్టల్ డి పార్ట్మెంట్ను కార్పొరేటు, ప్రయివేటు ప్రయోజనా లకు తాకట్టు పెట్టే చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరును నిరసిస్తూ ఈనెల 10న పోస్టల్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఇందులో దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. వీరికి సీఐటీయూతో పాటు పలు కార్మిక సంఘాలు, వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది.
ప్రభుత్వం నిర్వహించే తపాలా సేవలను '' కార్పొరేటీకరణ'' దిశలో ముందుకు సాగకుండా కేంద్రాన్ని ఒప్పించేందుకు పోస్టల్ యూనియన్ నాయకులు ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేశారు. ఇటు శుక్రవారం జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతీ లభించలేదు. దీంతో తపాలా ఉద్యోగులు సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామీణ డాక్ సేవక్స్ (జీడీఎస్)తో సహా దేశంలోని పోస్టల్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే పోస్టల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ (పీజేఏసీ) ఈనెల 10న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ఇటీవలి విధానాలపై పోస్టల్ ఉద్యోగుల ఆందోళన గురించి అనేక నెలల నుంచి తాము చేస్తున్న విజ్ఞప్తులు ఫలితం లేకుండా పోయాయని ఫెడరేషన్ నాయకులు చెప్పారు. చర్చలు సానుకూలంగా జరగలేదని నేషనల్ ఫెడరేషన్ ఆప్ పోస్టల్ ఎంప్లాయీస్ (ఎన్ఎప్పీఈ) సెక్రెటరీ జనరల్ జనార్ధ మజుందార్ తెలిపారు. కేంద్రం విధానాలపై సమ్మె కొనసాగుతుందనీ, దీనిపై వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.
భారత దేశ చరిత్రలో తపాలా సేవలు సాధారణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. దేశవ్యాప్తం గా విస్తృతమైన వ్యవస్థను కలిగి ఉండి స్వాతంత్య్రా నికి ముందు నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తు న్నది. అనేక ఆర్థిక సేవలతో పాటు ఇతర సర్వీసులైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) వేతనాల పంపిణీ, వృద్ధాప్య పింఛను చెల్లింపులు వంటివి ఇండియా పోస్ట్ ద్వారా జరుగుతున్నాయి. దేశంలో పోస్టల్ వ్యవస్థ చాలా చురుకుగా ఉన్నదనీ, ముఖ్యం గా గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే విషయం లో దీనిని గమనించవచ్చని ఆలిండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐపీఈయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి పి పాండురంగా రావు చెప్పారు.
కార్పొరేటీకరణ
డిసెంబర్ 2014లో దేశంలోని పోస్టాఫీసు నెట్వర్క్ను ప్రభావితం చేసే మార్గాలను సూచించే లక్ష్యంతో ప్రభుత్వ టాస్క్ఫోర్స్ అనేక సూచనలతో ముందుకు వచ్చింది. అయితే, టాస్క్ఫోర్సు చేసిన చర్యలను తపాలా ఉద్యోగుల సంఘం ఇండియా పోస్టును కార్పొరేటీకరించే కసరత్తుకు ఆరంభంగా భా వించింది. టాస్క్ఫోర్స్ తాను సూచించిన కార్యకలా పాలకు చట్టబద్ధమైన ప్రాతిపాదికను అందించటానికి 1898 నాటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం స్థానం లో కొత్త పోస్టల్ చట్టాన్ని కూడా ప్రతిపాదిం చటం గమనార్హం. 2018లో 650 శాఖలు, 3250 యాక్సె స్ పాయింట్లతో కూడిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మొదటి కార్పొరేటు సంస్థగా చేర్చబడిందని పోస్టల్ ఉద్యోగులు గుర్తు చేశారు.
గతనెలలో, పీజేఏసీ వారి ఒక రోజు సమ్మె నోటీసులో 20 పాయింట్లతో కూడిన డిమాండ్లను చేసింది. భారత పోస్టును కార్పొరేటీకరించే కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష చర్యలను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేసింది. ఇప్పటికీ మోడీ సర్కారు తీరులో ఎలాంటి చలనమూ రాలేదని పోస్టల్ ఉద్యోగులు అన్నారు. అప్పటి నుంచి ఆందోళనలు చేస్తున్న పోస్టల్ ఉద్యోగులకు సీఐటీయూతో పాటు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది.