Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేసును అర్జెంట్ లిస్టింగ్ (వెంటనే విచారణ చేపట్టాలని) చేయాలంటూ తన ముందుకు వచ్చిన సీనియర్ న్యాయవాదుల విన్నపాల్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తిరస్కరించారు. సీనియర్లు అయినంత మాత్రాన వారి కేసులు అర్జెంట్ లిస్ట్ చేయడానికి అనుమతి ఇస్తున్నారనే ప్రశ్నే లేదు..అంటూ బుధవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తున్న ధర్మాసనం విచారించాల్సిన పలు కేసుల జాబితా ముందుగానే నిర్ధారణ అవుతుంది. అయితే హఠాత్తుగా కొంతమంది సీనియర్ న్యాయవాదులు అర్జెంట్ లిస్టింగ్ చేయాలంటూ సీజేఐ ముందుకు వస్తుంటారు. ఇది ఆనవాయితీగా మారిందని, దీనిని తాను అనుమతించనని జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.
అర్జెంట్‌గా లిస్టింగ్ చేయాలంటూ వచ్చే సీనియర్ న్యాయవాదుల్ని తాను ప్రోత్సహించలేదన్నారు. జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహించిన సీజేఐ తాజాగా ఈ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. '' కపిల్ సిబల్, ఎం.ఎం.సింఘ్వీ...మీకు కూడా ఇది వర్తిస్తుంది. మరుసటి రోజు కేసును లిస్ట్ చేయాలంటూ అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ (ఏవోఆర్)ను మీరు సంప్రదించాల్సింది. అర్జెంట్ లిస్టింగ్ అంటూ వచ్చే సీనియర్లను అనుమతించక పోవటమే మంచిది. దీనికి నేను ముగింపు పలకాలనుకున్నా'' అని సీనియర్ న్యాయవాదుల్ని ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్యానించారు. అర్జెంట్ లిస్టింగ్ చేయడానికి సీనియర్లను అనుమతించవద్దని కొద్ది రోజుల క్రితం జూనియర్ న్యాయవాదులు సీజేఐకి విన్నవించుకున్నారు. గత ఏడాది ఏప్రిల్ 24న సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్.వి.రమణ పదవీకాలం ఆగస్టు 26న ముగియనున్నది.