Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్థలపై పరిమితులను ఎత్తేసిన కేంద్రం
న్యూఢిల్లీ : దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలపై పరిమితులను కేంద్రం తొలగించింది. ప్రయాణికుల ఛార్జీలపై విమానయాన సంస్థలే స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చని, ఈ నిబంధన ఆగస్టు 31 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. విమాన ఇంధన ధరలు, రోజువారీ ప్రయాణికుల డిమాండ్ వంటి అంశాలను విశ్లేషించిన అనంతరం విమాన చార్జీలపై పరిమితులను తొలగించాలని నిర్ణయించినట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. పౌరవిమానయాన రంగంలో స్థిరీకరణ మొదలైందని, రానున్న రోజుల్లో దేశీయంగా ఈ రంగం మరింత వృద్ధి సాధిస్తుందని అన్నారు. విమానయాన సంస్థలు, ఎయిర్పోర్టు యాజమాన్యాలు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రయాణికులు పాటించేలా చూసుకోవాలని ఆదేశించింది. విమాన ఇంధన ధరలు కూడా భారీగా పెరగడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. కరోనా లాక్డౌన్ అనంతరం 2020 మే నెలలో దేశీయ విమాన సేవలు తిరిగి ప్రారంభమైనప్పుడు దేశీయ మార్గాల్లో చార్జీల కనిష్ట, గరిష్ఠ పరిమితులను నిర్ణయించిన సంగతి తెలిసిందే. తక్కువ చార్జీల వల్ల విమానయాన సంస్థలు నష్టపోకుండా, భారీగా చార్జీలు పెంచకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణ సమయాన్ని అనుసరించి వీటిని నిర్ణయించారు.