Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల ప్రాతిపదికన చెల్లింపులు ఆపాలి : 33 సిఫారసులు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
న్యూఢిల్లీ : ఉపాధి హామీ పని దినాలు పెంచాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఇటీవలి లోక్‌సభలో ' మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)పై కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సమర్పించింది. పథకం అమలులో లోపాలను ఎత్తి చూపింది. బడ్జెట్ కేటాయింపు, వేతనాల సవరణ, పని దినాల సంఖ్య, సామాజిక తనిఖీలు, అంబుడ్స్పర్సన్ల నియామకం నుంచి పథకంలోని వివిధ అంశాలను కవర్ చేస్తూ స్టాండింగ్ కమిటీ నివేదికలో మొత్తం 33 సిఫారసులు చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వ స్పందనలను కూడా అందులో పేర్కొంది. సిఫారసుల్లో కొన్నింటికి కేంద్రం ఆమోదించగా, కొన్ని సిఫారసులపై కేంద్ర ప్రభుత్వ స్పందనను కమిటీ అంగీకరించలేదు. ఇంకా, కమిటీ తుది చర్యలు తీసుకున్న నివేదికల కోసం గ్రామీణాభివృద్ధి శాఖకి 3 నెలల గడువు విధించింది.
పేరుకుపోయినా.. ఖర్చు చేయని ఉపాధి నిధులు
2022-23 బడ్జెట్ గ్రాంట్ల కోసం డిమాండ్ల పరిశీలన సమయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో దాదాపు అన్ని పథకాల్లో ఖర్చు చేయని నిధులు భారీగా పేరుకుపోవడంపై స్టాండింగ్ కమిటీ విస్తుపోయింది. 2021 డిసెంబర్ 31 నాటికి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం)లో రూ.2,524 కోట్లు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూజీకేవైై)లో రూ.2,504.98 కోట్లు, 2022 జనవరి 28 నాటికి ఉపాధి హామీకి సంబంధించిన రూ.491.28 కోట్లు, జవనరి 24 నాటికి ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) రూ.4,860.15 కోట్లు ఖర్చు చేయకపోవడం బాధాకరమని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉపాధి నిధులు రూ. 5,270.76 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2021 నవంబర్ 5 నాటికి రూ. 1,351.46 కోట్లు ఖర్చు చేయలేదు. ఒకవైపు వేతనాల చెల్లింపులో పెండింగ్‌లో ఉన్న నిధులు, మరోవైపు ఉపయోగించకుండా మిగిలిపోయిన నిధులు పథకం పనితీరుకు మంచివి కావని కమిటీ ఇప్పటికీ ఏకరీతి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఉపాధి హామీకి నిధులు పెండింగ్ పెరిగిందని, వేతనం, మెటీరియల్ కాంపోనెంట్ వాయిదాల విడుదలలో జాప్యం అవుతుందని పేర్కొంది. లబ్దిదారులు వేతనాల కోసం ఎదురుచూసే పరిస్థితిల్లో ఖర్చు చేయని నిల్వలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. అందువల్ల, వివిధ పథకాలలో ఖర్చు చేయని నిల్వలు పోగుపడకుండా, పథకాలకు కేటాయించిన ప్రతి పైసా గ్రామీణ జనాభాలోని పేద, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పూర్తిగా ఉపయోగించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ (డీఓఆర్డీ)ను కమిటీ కోరింది. గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం నిధులను పూర్తిగా ఉపయోగించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, కమిటీ వారి నివేదికలో ఖర్చు చేయని నిల్వలను త్వరితగతిన లిక్విడేషన్ చేయాలని ఆ శాఖకు సిఫారసు చేసింది. ఖర్చు చేయని నిల్వలను పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నాలను వేగవంతం చేయాలని కమిటీ కోరింది.
వేతనాల చెల్లింపుల్లో జాప్యం
ద్రవ్యోల్బణ సూచికతో అనుసంధానం చేసి, వేతనాల పెంపునకు కమిటీ సిఫారసు చేసింది. సకాలంలో వేతనాల చెల్లింపులు చేయాలని చట్టం చెబుతుందని కమిటీ పేర్కొంది. మస్టర్ రోల్స్ పూర్తి చేసిన తేదీ నుంచి పదిహేను రోజుల లోపు వేతనాలు చెల్లించాలని తెలిపింది. అయితే ఉపాధి హామీ లబ్దిదారులకు వేతనాల చెల్లింపులో జరిగిన విపరీతమైన జాప్యం పట్ల కమిటీ బాధాకారాన్ని వ్యక్తం చేసింది. వేతనాల చెల్లింపులో జాప్యానికి చాలా కారణాలు ఉన్నాయని, అయితే చట్టంలోని చట్టబద్ధమైన నిబంధనకు కట్టుబడి ఉండకపోవడాన్ని సమర్థించడానికి ఏ ఒక్క కారణం సరిపోదని కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిటీ 2021 నవంబర్ 5 నాటికి రూ. 2,763.78 కోట్లు వేతనాలు పెండింగ్‌లో ఉండటాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ స్కీమ్‌లోని 'స్టేట్ ఆఫ్ ఎఫైర్స్ (ప్రభుత్వ వ్యవహారాలు)' పట్ల చింతిస్తున్నామని కమిటీ పేర్కొంది. అటువంటి భారీ పెండింగ్‌లకు ఎటువంటి కారణం సరిపోదని, వీలైనంత త్వరగా వేతన చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనిపై కేంద్ర స్పందించినప్పటికీ, వేతనాల్లో పెండింగ్‌ను పూర్తిగా తొలగించడానికి సంబంధించి నిర్దిష్ట చర్యలు తీసుకోనందున సమాధానం సంతృప్తికరంగా లేదని కమిటీ గుర్తించింది. లబ్ధిదారులకు 15 రోజుల్లో ఒక్క పైసా కూడా చెల్లించలేదని కమిటీ పేర్కొంది.
ఏకీకృత వేతన రేటును నిర్ణయించాలి
ఉపాధి హామీ వేతనాలను వినియోగ ధరల సూచీ (సీపీఐ), వ్యవసాయ కార్మిక (ఎఎల్)కి అనుగుణంగా, నగేష్ సింగ్ కమిటీ సిఫారసు చేసిన ప్రకారం గ్రామీణ ప్రాంతాలకు ఇండెక్స్ చేయడం అమలు కాలేదని కమిటీ గమనించింది. ప్రభుత్వం వైఖరిని సమీక్షించి, వేతనాలను పెంచాలని మంత్రిత్వ శాఖకు సిఫార సుచేసింది. ఉపాధి హామీ లబ్ధిదారుల వేతనాల పట్ల తన ఆందోళనను వ్యక్తం చేస్తూ, దాని స్థితిని సమీక్షించాలని కోరింది. ఉపాధి హామీ కింద నోటిఫై చేయబడిన వేతన రేట్లు రూ. 193 నుంచి రూ. 318 వరకు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉన్నాయని, ఇది సమర్థనీయం కాదని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏకీకృత వేతన రేటు కోసం ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని కమిటీ సిఫారసు చేసింది. వేతన అసమానతలను అంతం చేయడానికి ఏకరూప వేతనాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
పని దినాలకు 150కి పెంచాలి
ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 150కి పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. అందుకనుగుణంగా అదనపు రోజులు పని కల్పించేందుకు స్టాండింగ్ కమిటీ చట్టాన్ని సవరించాలని కోరారు. ఆర్థిక స్వాతంత్య్రంతో మహిళలకు సాధికారత కల్పించేందుకు వ్యవసాయ పనులు, జంతువుల పెంపకం కార్యకలాపాలలో నిమగమై ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలను ఉపాధి హామీతో అనుసంధానం చేయాలనే కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుత మహిళా కేంద్రీకృత పనుల అనుసంధానానికి గల అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అలాగే ఉపాధి హామీ కింద మరిన్ని మహిళా కేంద్రీకృత కార్యక్రమాల ఆచరణాత్మకతను అన్వేషించాలని కమిటీ సూచించింది.
ఇంటి వద్దే వైద్య సదుపాయాలు కల్పించాలి
జాబ్ కార్డుదారులకు ఇంటి వద్దే వైద్య సదుపాయాలకు కమిటీ సిఫారసు చేసింది. మహమ్మారి తరువాత కార్మికుల కోసం కొత్త భద్రతా చర్యలను చేర్చాల్సిన అవసరాన్ని కమిటీ గమనించింది. ప్రత్యేకించి అటువంటి సామూహిక పథకంలో గ్రామస్తుల ఇంటి వద్ద సులభంగా అందుబాటులో ఉండే వైద్య సదుపాయాల కల్పించాలని సూచించింది.
గ్రామ పంచాయతీ స్థాయిలో మస్టర్ రోల్స్ నింపడం
ఉపాధి హామీ వర్క్ ఆర్డర్‌ను రూపొందించిన వెంటనే ఆన్లైన్ మస్టర్ రోల్ నింపడంలో విపరీతమైన జాప్యం సమస్య, దేశంలోని వివిధ గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయన సందర్శనల సందర్భంగా కమిటీ దృష్టికి వచ్చింది. వేతనాల చెల్లింపులో జాప్యాన్ని నివారించడానికి, పని దినాల సంఖ్య లేకుండా చూసేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలోనే మస్టర్ రోల్స్‌ను తప్పనిసరిగా, తక్షణమే నింపాలని కమిటీ కోరింది. ఇ-మస్టర్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం పేర్కొన్న విధానం పట్ల కమిటీ ఏమాత్రంసంతృప్తి చెందలేదు. ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను పాటించకపోవడం పట్ల తీవ్రంగా బాధను వ్యక్తం చేసింది.
ఉపాధి హామీ పెండింగ్ నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాలి
2017లో నుంచి రూ. 4,060 కోట్లు పెండింగ్ వేతనాలు ఉండగా, ఉపాధి హామీ సంక్షేమ ఆధారిత, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ. 9,060 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని కమిటీ పేర్కొంది. అటువంటి పెండింగ్ పెరిగిపోవడం గ్రామీణ కార్మికుల అభ్యున్నతిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వేతనాలు, మెటీరియల్ కాంపోనెంట్లలో భారీ పెండింగ్‌లు త్వరగా అధిగమించడానికి పరిపాలనలో లోపాలను పరిష్కరించడానికి దాని ఆర్థిక నిర్వహణను మెరుగుపరచాలని కమిటీ సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించింది.
పని ప్రదేశాల్లో మరణించిన బాధితులకు రెండు లక్షలు ఇవ్వాలి
వ్యవసాయ భూములకు కంచె వేయడం, వ్యవసాయ కార్మికులతో సహా వివిధ వ్యవసాయ కార్యకలాపాలు వంటి ఇతర ముఖ్యమైన పనులకు ఉపాధి హామీని విస్తరించాలని సూచించింది. ఉపాధి హామీ పని చేసే ప్రదేశంలో ప్రమాదానికి, మరణానికి గురైన కార్మికులకు రెండు లక్షలు పరిహారం అందించాలని సూచించింది. అలాగే పరిహారం చెల్లింపుల్లో, బాధితులను ఎంపిక చేయడంలో జాప్యం ఉందని కమిటీ గమనించిందని తెలిపారు.
కుల ప్రాతిపదికన చెల్లింపులు వద్దు
కుల ప్రాతిపదికన వేతనాలు చెల్లింపులు కమిటీ దృష్టికి వచ్చాయని, దీన్ని చూసి కమిటీ అవాక్కయిందని తెలిపింది. ఉపాధి హామీ చట్టంలో ఎక్కడా ఇలాంటి అసంబద్ధత అంశాన్ని ప్రస్తావించలేదని పేర్కొంది. ఇది లబ్ధిదారులందరినీ సమానంగా పరిగణించే ప్రాథమిక సిద్ధాంతాల నుండి తప్పుకోవడానికేననే విమర్శకు దారి తీసిందని పేర్కొంది. కుల ప్రాతిపదికన చెల్లింపు వ్యవస్థను సృష్టించడం వల్ల ఉపాధి హామీ లబ్ధిదారులలో ఆగ్రహానికి దారితీస్తుందని, చీలిక ఏర్పడుతుందని స్పష్టం చేసింది. దీన్ని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొంది. ఈ పథకం కింద పని చేసే ప్రతి కార్మికుడు, కులాలకతీతంగా నిర్దేశించిన గడువులోపు వేతనం పొందేలా చూడాలని సూచించింది. కుల ప్రాతిపదికన ఎలాంటి విభజన లేకుండా ఒకే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వంటి మునుపటి యంత్రాంగాన్ని పునరుద్ధరించాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫారసు చేసింది.
నిధుల జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయం కీలకం
నిధులను సకాలంలో విడుదల చేయడానికి, విధానపరమైన అంశాలను పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమర్థవంతమైన సమన్వయం కోసం కమిటీ పిలుపునిచ్చింది. ఈ నిబంధనలను అనుసరిస్తే, నిధుల జాప్యం సమస్య ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంది. నిధుల సకాలంలో విడుదల కోసం కేంద్ర-రాష్ట్ర సంబంధాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రక్రియను పునరుద్ధరించాలని కమిటీ సిఫారసు చేసింది.