Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనకరంగా నిరుద్యోగం
- దయనీయ పరిస్థితుల్లో కార్మికులు
- కష్టానికి దక్కని ప్రతిఫలం
- పెరుగుతున్న అభద్రత, అసమానతలు
- పరిష్కరించటంలో మోడీ సర్కారు విఫలం
న్యూఢిల్లీ : భారత్ 75 ఏండ్ల స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకుంటున్నది. 'ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్' పేరుతో వేడుకలకు కేంద్రం పిలుపునిచ్చింది. అయితే, దేశంలో మాత్రం ఉద్యోగ, ఉపాధి కల్పన ఆందోళనకరంగా ఉన్నది. మోడీ పాలనలో ఇది తీవ్ర స్థాయికి చేరుకున్నది. ముఖ్యంగా, కరోనా మహమ్మారి కాలంలో ఇది అధికమైంది. ఆ సమయంలో మోడీ సర్కారు అనాలోచిత నిర్ణయాలు దేశంలోని చిన్న పరిశ్రమలు, కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ముఖ్యంగా, వలసకార్మికులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. దేశంలోని ఉద్యోగ, ఉపాధి పరిస్థితుల, కార్మికులు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను పలు దేశీయ, అంతర్జాతీయ నివేదికలు ఇప్పటికే హెచ్చరించాయి. నిరుద్యోగం, కార్మికుల సమస్యలను పరిష్కరించటంలో మోడీ సర్కారు తగిన శ్రద్ధ చూపటం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రం తీరుతో దేశంలో లక్షలాది మంది కార్మికుల పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయని నిపుణులు చెప్పారు. ధనిక, పేదల మధ్య అసమానతలు తీవ్రంగా పెరిగాయన్నారు. అభద్రత, అసమానతలు వంటివి దేశంలోని ఆర్థిక సంక్షోభానికి కనిపించే సంకేతాలు అని నిపుణులు తెలిపారు. బ్రిటీషు వారి నుంచి ప్రస్తుతం మోడీ పాలన వరకు దేశానికి ఇది అతి పెద్ద సవాలు అని వివరించారు. రోజువారి కూలీ మీద ఆధారపడి జీవించే కార్మిక కుటుంబాలు దేశంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ''మాకు వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే పని వస్తుంది. గత ఐదు నెలల్లో నేను రూ. 2000 లు సంపాదించాను. ఇంత తక్కువ జీతంతో మా కుటుంబం ఎలా గడుస్తుంది'' అని సుగ అనే కార్మికురాలు వాపోయింది.
ఉపాధి కోసం గ్రామాలను విడిచిపెట్టి నగరాలకు చేరుకొని అత్యంత దారుణ పరిస్థితుల్లో జీవితాలను గడుపుతున్న కుటుంబాలు దేశంలో లక్షల కొద్ది ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) సమాచారం ప్రకారం ఇటీవల నెలల్లో నిరుద్యోగ రేటు ఏడు శాతం నుంచి ఎనిమిది శాతంగా ఉన్నది. కేవలం 40 శాతం మంది భారతీయులు ఉపాధిని పొందుతున్నారు. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్తున్నప్పటికీ దానికి తగినంత ఉద్యోగాల కల్పన జరటం లేదని సీఎంఐఈ చీఫ్ ఎగ్జిక్యుటీవ్ మహేశ్ వ్యాస్ అన్నారు. భారత్లో కేవలం 20 శాతం ఉద్యోగాలు మాత్రమే సాధారణ వేతనాలు, భద్రతతో కూడిన అధికారిక రంగంలో ఉన్నాయి. దాదాపు 40 శాతం మంది కార్మికులు వ్యవసాయంలో నిమగమై ఉండటం గమనార్హం.
ఉద్యోగం, ఉపాధి కల్పన, నిరుద్యోగాన్ని పారదోలే విషయంలో కేంద్రం ఇప్పటికైనా క్రియాశీలకంగా వ్యవహరించాలని నిపుణులు సూచించారు. లేకపోతే ఈ ప్రభావం వచ్చే తరాలపై చూపెడుతుందన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికీ దారి తీస్తుందని హెచ్చరించారు.