Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు..అది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం
- ఉచిత వాగ్దానాల అంశాన్ని పరిశీలిస్తాం
- ఖజానాకు జరిగే నష్టం, ప్రజల సంక్షేమం సమతుల్యంగా ఉండాలి : సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం
న్యూఢిల్లీ : ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలు చేస్తున్న విషయాన్ని పరిశీలిస్తామని, అయితే దాని కోసం రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలనే అభ్యర్థనలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం గురువారం స్పష్టం చేసింది. ప్రజల సంక్షేమం, ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక ఒత్తిడి మధ్య సమతుల్యత ఉండాలని నొక్కి చెప్పింది. రాజకీయ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని, అలాంటి మ్యానిఫెస్టోల్లోని వాగ్దానాలకు బాధ్యత వహించే పార్టీలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై కోర్టు విచారణ చేపట్టింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలనే అభ్యర్థనను స్వీకరించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని, అందుకే దానిని అనుమతించలేమని పేర్కొంది. ''రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు కోణాన్ని పరిశీలించాలనుకోవడం లేదు. ఎందుకంటే అది ప్రజాస్వామ్య విరుద్ధమైన విషయం. అన్నింటికంటే మనది ప్రజాస్వామ్యం దేశం'' అని సీజేఐ రమణ వ్యాఖ్యానించారు. ఈ అంశంలో కోర్టు ఏం మేరకు జోక్యం చేసుకోగలదనేది పరిశీలించాల్సిన మరో ప్రశ్న అని ధర్మాసనం పేర్కొంది. '' ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మనం ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చు, లేదా సమస్యలోకి వెళ్లవచ్చు? కారణం ఇది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోని అంశం. ఈసీఐ స్వతంత్ర సంస్థ. అక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందరూ ఉన్నారు. ఇది ఆ అందరి పరిజ్ఞానం. ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే అంశం. ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. కానీ భారతదేశం వంటి పేదరికం ఉన్న దేశంలో ఆ సమస్యను విస్మరించలేం'' అని సీజేఐ అన్నారు.
బుధవారం రాత్రి 10 గంటల వరకు కోర్టులో తన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) విఫలమవడంపై సీజేఐ ఎన్వి రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ''మేం అఫిడవిట్లను వార్తా పత్రికలలో చదువుకోవాల్సి వచ్చింది. బుధవారం రాత్రి 10 గంటల వరకు నా వద్దకు అఫిడవిట్ రాలేదు. కానీ ఈ రోజు (గురువారం) ఉదయం టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివాను'' అని సీజేఐ అన్నారు. ఈసీఐ తరపు సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపించారు. సీజేఐ జోక్యం చేసుకొని మీరు వార్తాపత్రికలకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అది వార్తా పత్రికల్లో వస్తే, కోర్టుకు ఎందుకు చేరకూడదు? అని ప్రశ్నించారు.
పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29డిని చేర్చాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల ఆర్థిక పరమైన చిక్కులపై రాజకీయ పార్టీలు ఒక మ్యానిఫెస్టోను దాని ఆమోదం కోసం ఈసీఐకి సమర్పించాల్సిన బాధ్యతను విధించాలని సూచించారు. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చాలా ఉచితాలు మ్యానిఫెస్టోలో భాగం కాదని, ఎన్నికల ర్యాలీలు, ప్రసంగాల సమయంలో ప్రకటిస్తారని అన్నారు. సీజేఐ ఎన్వి రమణ జోక్యం చేసుకొని హేతుబద్ధత లేని ఉచితాలు తీవ్రమైన సమస్యకు దారితీస్తుందని పునరుద్ఘాటించారు.
కేంద్ర ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ రాజకీయ పార్టీల ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని, దీనికి సంబంధించి శాసనసభ చట్టం రూపొందించే వరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవచ్చని అన్నారు. ''మేం (కేంద్రం) ఒక కమిటీని ప్రతిపాదిస్తున్నాం. కమిటీలో లబ్ధిదారులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శులు, ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులు, నిటి ఆయోగ్, ఆర్బీఐ, ఫైనాన్స్ కమిషన్, నేషనల్ టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధి, ఒకరు ఉచితాలకు మద్దతు ఇచ్చే వ్యక్తి, పరిశ్రమలు, ఉచితాల వల్ల ఒత్తిడి ఎదుర్కొంటున్న రంగాలను సభ్యులు ఉంటారు'' అని సొలిసిటర్ జనరల్ తెలిపారు.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ ఈ కేసులో సంక్లిష్టమైన సమస్య ఉంది. ఇది సరైనా గణాంకాల (సాలిడ్ డేటా) ఆధారంగా మాత్రమే నిర్ణయించబడుతుందని అన్నారు. ''ఇది సంక్లిష్టమైన సమస్య. మీ ముందు డేటా ఉండాలి. నావద్ద పని చేసే ఒక ఉద్యోగి ఉన్నారు. నిన్న ఆమె మెట్రోలో ప్రయాణించడానికి డబ్బు లేదు. నేను ఆమెకు డబ్బు ఇచ్చాను. ఆమె బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పింది. ఇది ఉచితమా?'' అని సిబల్ ప్రశ్నించారు.
సీజేఐ ఎన్వి రమణ మాట్లాడుతూ ఉచితాలు కూడా చట్టవిరుద్ధం కావడానికి ఎలా దారితీస్తాయో వివరించారు. '' మా మావయ్య వ్యవసాయదారుడు. వ్యవసాయదారునికి, భూమి యజమానికి (ఉచిత) విద్యుత్ కనెక్షన్ లేదని ప్రభుత్వం చెప్పింది. నేను రిట్ దాఖలు చేయవచ్చా అని అతను నన్ను అడిగాడు. కానీ నేను అతనికి ఇది విధాన నిర్ణయమని చెప్పాను.
ఒక రోజు సక్రమంగా లేని కనెక్షన్ రెగ్యులరైజ్ చేశారు. అయితే అతనిది కాదు. ప్రణాళిక అనుమతులు లేకుండా నేను మా ఇంట్లో ఒక ఇటుకను తాకలేను. ఎందుకంటే ఉల్లంఘన అవుతుంది. కానీ ఇతర బంగ్లాలు అంతస్తులపై అంతస్తులు నిర్మిస్తున్నారు. మరుసటి రోజు వాటికి అనుమతులు వస్తాయి. దీనిబట్టి తప్పు చేసిన వారిని ఆమోదించినట్లు అవుతుంది. చట్టాన్ని గౌరవించే వ్యక్తులు శిక్షించబడుతున్నారు'' అని సీజేఐ అన్నారు. ఖజానాకు జరిగే నష్టం, ప్రజల సంక్షేమం సమతుల్యంగా ఉండాలన్నారన్నారు. ''అందుకే ఈ చర్చ, వారి దృష్టి , ఆలోచనలను ఉంచగల ఎవరైనా ఉండాలి. దయచేసి నా పదవీ విరమణకు ముందు ఏదైనా సమర్పించండి'' అని సీజేఐ అన్నారు. ఆప్ తరపున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ఉచితాలు చాలా తప్పుడు అర్థంలో ఉపయోగించబడుతున్నాయని, సంక్షేమ చర్యలు భిన్నంగా ఉన్నాయని వాదించారు. సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్, విజరు హన్సారియా తదితరులు వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేశారు.