Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బీసీ నేతలు వినతి
న్యూఢిల్లీ: బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక,సామాజికాభివృద్ధికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు గురువారం నాడిక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బీసీ నేతల బృందం కలిశారు. మండల కమిషన్ సిఫార్సుల ప్రకారం స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయంబర్స్మెంట్ స్కీములు ప్రారంభించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కీములకు 60 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వడ లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే స్కాలర్ ఫిప్, హాస్టల్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి గ్రాంట్ ఇవ్వాలని రాజ్యాంగం నిర్దేశిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంల్లో చదివే విద్యార్థులకు ఫీజులు, స్కాలర్ షిప్‌లు ఇవ్వడం లేదని, మరోవైపు క్రిమిలేయర్ వల్ల ఐఐటీ, ఐఐఎంల్లో చేరే పేద విద్యార్థులు లక్షల్లో ఫీజుల ఎలా కడతారని ప్రశ్నించారు. పాఠశాల కోర్సుల్లో చదివే విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీం, అలాగే విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ స్కీం, ఫీజు రీయంబర్స్ మెంట్ స్కీం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర మంత్రికి సూచించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా ప్రతి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. జాతీయ బీసీ కార్పొరేషన్ నియమ నిబంధనలు సడలించి కులవృత్తులు, చేతి వృత్తులు వారికి స్వయం ఉపాధి పథకాలు, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి రూ.10లక్షల మంజూరు చేయాలని కోరారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం దేశంలో ప్రతి జిల్లాకు ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బిసి సంఘం నేతలు గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, మోక్షిత్ ఉన్నారు.