Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు వారాల తరువాతే నితీష్ బల పరీక్ష
- మొదటి వేటే స్పీకర్‌పైనే..
పాట్నా : బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఏర్పాటైన జెడియు, ఆర్జెడి ప్రభుత్వం తన మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్ణయించుకోవడం వెనుక ఒక కారణం ఉంది. కొత్త ప్రభుత్వం తమ బల పరీక్ష కంటే ముందుగా ప్రస్తుత స్పీకర్‌ను మార్పు చేయాలని కోరుకుంటుంది. అయితే స్పీకర్‌ను మార్పు చేయడం అంత సులభం కాదు. ఇప్పటికే 55 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ విజరు కుమార్ సిన్హాకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కోసం విజ్ఞప్తి చేశారు. అయితే నిబంధనల ప్రకారం ఇలాంటి విజ్ఞప్తి చేసిన రెండు వారాల తరువాతే సభ చర్య తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయితే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కనీస మెజార్టీ 122 కంటే ఇది చాలా ఎక్కువ. ఈ నెల 24 అసెంబ్లీ సమావేశం తొలి రోజు స్పీకర్ సిన్హాపై అవిశ్వాస తీర్మానం పెట్టి అతన్ని తొలగించిన తరువాత ఈ నెల 25న బలపరీక్ష జరగాలని నితీష్ ప్రభుత్వం కోరుకుంటుంది.
కొత్త స్పీకర్ ఆర్జెడి నుంచి ఉంటారని భావిస్తున్నారు. కాగా, ఇంతకు ముందు నుంచే స్పీకర్ సిన్హా, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మధ్య సంబంధాలు లేవు. 'ఉత్తమ శాసనసభ్యుడు'పై చర్చించాలనే బీజేపీ విజ్ఞప్తిని జేడీయూ ఒక సెషన్లో తిరస్కరించింది. అలాగే అగ్నిపథ్ పథకంపై చర్చించడానికి స్పీకర్ తిరస్కరించడంతో ఆర్జెడి, కాంగ్రెస్ సభను బహిష్కరించాయి. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న సమయంలోనూ అగ్నిపథ్‌ను జెడియు వ్యతిరేకించింది.