Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాల ఐక్యతతోనే రాజ్యాంగ పరిరక్షణ
- విశాఖ సదస్సులో బివి రాఘవులు పిలుపు
విశాఖపట్నం : దేశ స్వాతంత్య్రం, రాజ్యాంగ పరిరక్షణ కోసం జాతీయోద్యమ స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో 'భారత స్వాతంత్య్రోద్యమం - కమ్యూనిస్టుల త్యాగాలు - నేటి పరిస్థితులు' అనే అంశంపై సదస్సు గురువారం జరిగింది. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పద్మ అధ్యక్షతన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ నేతృత్వంలో ఒకవైపు స్వాతంత్య్ర పోరాటం సాగుతుంటే మరోవైపు కమ్యూనిస్టులు వివిధ తరగతుల ప్రజలను ఆ పోరాటంలో భాగస్వాములు చేశారని గుర్తు చేశారు. కార్మికులు, కర్షకులు, విద్యార్థులను కమ్యూనిస్టులు సమీకరించారని, వీరితో పాటే రచయితలు, వివిధ రంగాలకు చెందిన మేధావులు కూడా కదిలారని చెప్పారు. వీరందరు చేసిన త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. ఆ స్వాతంత్య్ర పోరాట లక్ష్యాలపైనా, వాటి స్ఫూర్తితో రూపొందించుకున్న రాజ్యాంగంపైనా మోడీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున దాడి జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో వాటి పరిరక్షణ కోసం మరో పోరాటం చేయాల్సి ఉందన్నారు. కలిసివచ్చే శక్తులన్నింటిని కలుపుకోవాలని, జాతీయోద్యమం తరహాలో విశాల ఐక్యతను సాధించాలని చెప్పారు. 2014లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత భారత ప్రజాస్వామ్యంపై 75 ఏళ్లలో ఎన్నడూలేనంత దాడి జరుగుతోందన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచగలిగిన ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికవాదం, సమానత్వ సాధనను దెబ్బతీయాలని బిజెపి చూస్తోందన్నారు. దీనిలో భాగంగానే మతతత్వాన్ని, మెజార్టీ వాదాన్ని ముందుకు తెచ్చి ప్రజలను రెచ్చగొడుతోందన్నారు. రాష్ట్రాల హక్కులపై గతంలో ఎన్నడూ లేనివిధంగా దాడి జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ బిల్లును ఆయన ప్రస్తావించారు. ఆ బిల్లును కేంద్రం తీసుకువచ్చినప్పటికీ ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రమాదకరంగా మారుతుందని, అందుకే అనేక రాష్ట్రాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయన్నారు. అయినా మోడీ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకే పోవాలని ప్రయత్నిస్తోందని అన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాదానికి భిన్నంగా మతాల పేరుతో ప్రజలను విభజిస్తోందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం రాజ్యం మత వ్యవహారాలకు దూరంగా ఉండాలని, కానీ నరేంద్ర మోడీ ప్రధాని హోదాలోనే మత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. మరోవైపు సంఫ్‌ుపరివార్ శక్తులు మైనార్టీలను, ఇతర మతస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని, ఇది ప్రపంచ దేశాలకు ఎటువంటి సంకేతాలు ఇస్తుందని ప్రశ్నించారు. బిజెపి, అనుసరించే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేయాలని చెప్పారు. ఇవే విధానాలు కొనసాగితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యమనే పదం కూడా దేశంలో వినపడదేమోనన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. చట్టసభలను బలహీనం చేసే కుట్ర ఇప్పటికే ప్రారంభమైందని, రెగ్యులేటరీ కమిటీల పేరుతో నిర్ణయాలు తీసుకుంటున్నారని, భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత తీవ్రం కానుందని అన్నారు. రాజ్యాంగంపై ఒకవైపు దాడులు చేస్తూనే మరోవైపు స్వాతంత్య్ర పోరాటాన్ని సైతం తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. స్వాతంత్య్రోద్యమంలో అసలు పాల్గొనని బిజెపి తామే ఆ వారసత్వానికి నిజమైన వారసులమని ప్రజలను నమ్మించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ స్వాతంత్య్రోద్యమానికి ద్రోహం చేయడమే కాకుండా బ్రిటిష్ ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటామని ప్రకటించాయని గుర్తుచేశారు. వారు గాంధీ కన్నా గొప్ప నాయకుడిగా చెప్పుకుంటున్న సావర్కార్ అండమాన్ జైలు నుంచి తనను విడుదల చేస్తే, బ్రిటిష్ ప్రభుత్వ గొప్పతనాన్ని ప్రచారం చేస్తానని, జాతీయోద్యమంలో కమ్యూనిస్టుల శక్తి పెరగకుండా చూస్తానని లేఖలు రాసి బయటకు వచ్చారని, ఆ తరువాత మతతత్వ సంస్థను ఏర్పాటు చేసి ప్రజలను చీల్చడమే లక్ష్యంగా పని చేశాడని చెప్పారు. ఈ వాస్తవాలన్ని ప్రజలకు చెప్పడంతోపాటు విశాల పోరాటంలో వారిని ఐక్యం చేయాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా సిఎఎ వ్యతిరేక పోరాటం, వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం సాగించిన పోరాటాలను ఆయన ప్రస్తావించారు. 500 రోజులకు పైగా సాగుతున్న పోరాట ఫలితంగానే విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరించలేకపోతోందన్నారు. ఈ తరహాలోనే ప్రజలను సమీకరించి మరిన్ని విస్తృత పోరాటాలకు కృషి చేయాల్సి ఉందన్నారు. 'బిజెపి, సంఫ్‌ుపరివార్ శక్తులను ఎన్నికల్లో ఓడించాలి. ఎన్నికల్లో ఓడించడమే కాదు. వారు చెప్పే సిద్ధాంతాన్ని, దానిలో ఉన్న మోసాన్ని ప్రజలకు వివరించి వారి మనస్సుల నుండి కూడా తొలగించాలి.' అని ఆయన అన్నారు.