Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2024 ఎన్నికలపై ప్రభావం
- హిందీ రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాల పట్టు
- కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్లు మాఫీ ఉచితాలు కాదా?
- ఆకలితో అలమటిస్తున్నోడికి 5 కిలోల బియ్యమిస్తే ఉచితమా? : డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌తో సీతారాం ఏచూరి భేటీ
- బీహార్ మళ్లీ దేశానికి దిశానిర్దేశం: తేజస్వీ యాదవ్
- దేశవ్యాప్తంగా బీహార్ ప్రభావం : డి.రాజా
న్యూఢిల్లీ: బీహార్ పరిణామాలు యావత్తు దేశానికి సంకేతమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. 2014 ఎన్నికలపై ప్రభావం ఉటుందని అన్నారు. శుక్రవారం నాడిక్కడ బీహార్ భవన్లో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను సీతారాం ఏచూరి కలిశారు. అనంతరం సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. తాను సమస్యలపై మాట్లాడటానికి రాలేదనీ, శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మహాఘట్ బంధన్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపానని అన్నారు. అక్కడ విశ్వాస పరీక్ష, మంత్రివర్గం ఏర్పాటు తరువాత సమస్యలపై చర్చిస్తామని అన్నారు. బీహార్‌లో లౌకిక మహాకూటమి ప్రభుత్వం ఏర్పడిందనీ, ఆ ప్రభుత్వాన్ని అభినందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రభుత్వం బీహార్ ప్రజలకు, ముఖ్యంగా పేద, దోపిడీకి గురైన, అణగారిన వర్గాలకు అనుకూలంగా అన్ని నిర్ణయాలను తీసుకుంటుందని తాము కచ్చితంగా ఆశిస్తున్నామని అన్నారు. బీహార్ పరిణామాలు యావత్ దేశానికి ఒక సంకేతమని ఏచూరి అన్నారు. తాము మొత్తం హిందీ రాష్ట్రాల్లో ఉన్నామని చెప్పుకుంటున్న బీజేపీకి, బీహార్ పరిణామం ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు. హిందీ రాష్ట్రాలైన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీలో బీజేపీయే తర ప్రభుత్వాలు ఉన్నాయనీ, బీహార్ కూడా బీజేపీ నుంచి జారిపోయిందని అన్నారు. కాబట్టి బీజేపీ ప్రజల మద్దతుతో కాకుండా, ఇతర మార్గాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నదని స్పష్టమైందని అన్నారు. ఇప్పుడు దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, దేశాన్ని రక్షించడానికి 2024లో బీజేపీని అధికారం నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యంపై స్పందించిన ఏచూరి, ఇతర పార్టీలు ప్రభుత్వంలో చేరాల్సిన అవసరం లేదనీ, ఆ రెండు పార్టీల సంఖ్యే సరిపోతుందని చెప్పారు. తాము ప్రభుత్వంలో చేరమనీ, కాకపోతే బయట నుంచి మద్దతు ఇస్తామని అన్నారు. 2024 ప్రధానమంత్రిగా నితీశ్ కుమార్ అనే వార్తలపై స్పందించిన ఏచూరి, తాను చెప్పినట్టుగా విశ్వాస పరీక్ష పూర్తి అవ్వాలనీ, మంత్రివర్గం ఏర్పడాలన్నారు. బీహార్ ప్రభుత్వం పనిచేయడం ప్రారంభించాలనీ, అప్పుడు ఈ ఎజెండా ముందుకు వస్తుందని అన్నారు.
ఉచితాలపై జరుగుతున్న చర్చపై స్పందించిన ఏచూరి, గత ఐదేండ్లలో తన స్నేహితులైన పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తీసుకున్న లక్షల కోట్లు రుణాన్ని మాఫీ ప్రధాని మోడీ చేశారనీ, దీని గురించి ముందుగా ప్రధాని మోడీని అడగండని మీడియాకు బదులిచ్చారు. దీనిపై ఆయన ఏం చెప్పారని ప్రశ్నించారు. ఒకపక్క రూ. పది లక్షల కోట్ల రుణమాఫీ చేయడం ఉచితాలు కాదా?, మరోపక్క ఆకలితో చనిపోతున్న ప్రజలకు మనం ఐదు కిలోల బియ్యం అందజేస్తే ఉచితాలని ప్రచారం చేయడమా? అని ప్రశ్నించారు. దీనివల్ల ఆర్థిక నష్టం జరుగుతుందనీ, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుందని అనడం దేశాన్ని తప్పుదోవ పట్టించమేనని స్పష్టం చేశారు. నల్లటి దుస్తులు ధరించి నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌పై ప్రధాని బ్లాక్ మ్యాజిక్ (చేతబడి) వ్యాఖ్యపై స్పందించిన ఏచూరి, బ్లాక్ మ్యాజిక్ ఎవరు చేస్తున్నారని, దేశం చూస్తోందని అన్నారు.
అంతకు ముందు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా కలిసి శుభాకాంక్షులు తెలిపారు. ఈ సందర్భంగా డి.రాజా మాట్లాడుతూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలోపు ఆర్ఎస్ఎస్, బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య ఐక్యత, ప్రజానుకూల ప్రత్యామ్నాయాన్ని రూపొందించడానికి బీహార్ నుంచి పరిణామాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని తెలిపారు. బీహార్ నుంచి ప్రతిపక్షాల ఐక్యత ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని అన్నారు. తేజస్వీ యాదవ్ తన ట్విట్టర్లో సీపీఐ(ఎం), సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి. రాజాతో సమావేశమై, దేశ, రాష్ట్ర ప్రస్తుత సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సానుకూల చర్చ జరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి బీహార్ మళ్లీ దేశానికి దిశానిర్దేశం చేసిందని తెలిపారు.