Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గనున్న కోటి టన్నుల ఉత్పత్తి : ట్రేడర్స్
- ఈఏడాది ఖరీఫ్‌లో 15శాతం తగ్గిన వరి సాగు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ విధానాలకు తోడు తీవ్రమైన వాతావరణ పరిస్థితులూ దేశవ్యాప్తంగా ఆహార పంటల దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో గోధుమ దిగుబడి పడిపోగా, 2022-23లో దాదాపు కోటి టన్నులకుపైగా బియ్యం ఉత్పత్తి పడిపోతుందని ఆహారరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా వరి సాగు గణనీయంగా తగ్గిందని తెలిపారు. గత ఏడాది ఖరీఫ్‌తో పోల్చితే ఈ సీజన్లో వరి సాగు 13శాతం తగ్గుదల నమోదైంది. కేంద్ర వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం, గత ఖరీఫ్‌లో 3.14కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేయగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో అది 2.74 కోట్ల హెక్టార్లకు తగ్గింది. దీనిని బట్టి ఈ ఆర్థిక సంవత్సరం బియ్యం ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ''విత్తనాలు వేసే కాలం దాదాపు ముగిసింది. ఒకవేళ నాట్లు వేయటం ఇప్పుడు మొదలైనా, మనకున్న సమాచారం ప్రకారం వరి దిగుబడి నామమాత్రంగా ఉండనున్నది'' అని వ్యవసాయ పరిశోధన సంస్థ 'ఐగ్రెయిన్' డైరెక్టర్ రాహుల్ చౌహాన్ అన్నారు.
వరి అత్యధికంగా సాగుచేసే పశ్చిమ బెంగాల్, జార్ఖాండ్, బీహార్, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ..రాష్ట్రాల్లో సాగు తగ్గిందని సమాచారం. ఉత్తరప్రదేశ్‌లో వరి ప్రధాన పంటగా ఉన్న జిల్లాల్లో వర్షాభావం పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు 8నాటికి వాయువ్య యూపీలో సాధారణంగా కన్నా 36శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈశాన్య యూపీలో 43శాతం, బీహార్‌లో 38శాతం, జార్ఖాండ్‌లో 45శాతం తక్కువ వర్షపాతం కురిసింది. అలాగే పశ్చిమ బెంగాల్ సాధారణంగా 46శాతం తక్కువ వర్షం కురిసింది. బియ్యం ఉత్పత్తికి సంబంధించి 2021-22 ఖరీఫ్‌లో దాదాపు 13కోట్ల టన్నుల ఉత్పత్తి రాగా, ఇందులో 2.12కోట్ల టన్నులు ఆయా దేశాలకు ఎగుమతి అయ్యింది. ఈ ఏడాది జులై 1నాటికి ప్రభుత్వ గోడౌన్లలో 4.7కోట్ల టన్నుల బియ్యం నిల్వలున్నాయి.
మనదేశంలో ప్రధాన ఆహార పంటలైన గోధుమ, బియ్యం ఉత్పత్తి క్రమంగా దెబ్బతినటం ఆందోళన కలిగించే అంశం. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా గత కొన్నేండ్లుగా గోధమ సేకరణ గణనీయంగా తగ్గింది. క్రితం ఏడాదితో పోల్చితే 2021-22లో గోధుమ కొనుగోళ్లు 56శాతం తగ్గాయి. దీంతో ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో రేషన్ దుకాణాల్లో గోధుమ స్థానంలో బియ్యాన్ని పంపిణీ చేయాల్సి వచ్చింది. ఇది అణగారిన, పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కోట్లాది మంది కుటుంబాల్లో పిల్లలు, పెద్దలు పోషకాహారానికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. బియ్యం, గోధుమ దిగుబడి, సేకరణ..మనదేశ ఆహార భద్రతతో ముడిపడిన అంశం. వీటి సాగు పడిపోకుండా కేంద్రం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.