Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి
- రాజ్యాంగ విలువల పరిరక్షణకు విద్యార్థులు, యువత గొంతెత్తాలి
- ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న హక్కులనూ లాక్కున్నది :
త్రిపురలో ఎస్ఎఫ్ఐ ఈశాన్య జాతా ప్రారంభ సభలో మాణిక్ సర్కార్
న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో రాజ్యాంగ విలువలు ప్రమాదంలో పడ్డాయని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. 'మార్చ్ ఫర్ ఎడ్యుకేషన్'లో భాగంగా ఎస్ఎఫ్ఐ ఈశాన్య జాతా త్రిపుర రాజధాని అగర్తలలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ జాతాను మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత మాణిక్ సర్కార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అగర్తల నగరంలో విద్యార్థుల భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మాణిక్ సర్కార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో లౌకికవాదం, సమాఖ్య నిర్మాణం, ప్రజల హక్కులు ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. బీజేపీ చేతిలో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటైన సంస్థలు, ఎన్నికల ప్రక్రియ దాడికి గురవ్వడం ప్రహసనంగా మారిందని విమర్శించారు. ''భారత ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగం ద్వారా స్థాపించబడిన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది అన్ని రాజకీయ పార్టీలకు ఒకే విధమైన వేదికను సృష్టించాలి. ఏ రాజకీయ పార్టీ పట్ల (అది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ) అనే వివక్ష ఉండకూడదు. ఈ రోజుల్లో, అధికారంలో ఉన్న వ్యక్తులు డబ్బు, కండబలాన్ని ఉపయోగిస్తున్న ందున.. ఎన్నికలు బీజేపీ చేతిలో ఒక ప్రహసనంగా మారాయి'' అని విమర్శించారు. దేశంలో ప్రాంతీయ, చిన్న పార్టీల అవసరం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మాట్లాడటం... ఆ పార్టీ ఫాసిస్ట్ వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. లోక్సభ 'తోలుబొమ్మల ప్రదర్శన వేదిక'గా మారిందని విమర్శించారు. 'ఏం జరుగుతున్నది? ఈ బిల్లులపై చర్చకు అవకాశం లేదు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదిపై దాడి చేసే ప్రయత్నం' అని ధ్వజమెత్తారు. 'సేవ్ కాన్స్టిట్యూషన్' ర్యాలీని నిర్వహించినందుకు ఎస్ఎఫ్ఐ, టీఎస్ఎఫ్లను మాణిక్ సర్కార్ ప్రశంసించారు.
దేశంలో రాజ్యాంగ విలువలను కాపాడేందుకు విద్యార్థులు, యువత తమ గొంతులను పెంచాలని పిలుపునిచ్చారు. ''బ్రిటీష్ వారి నుండి దేశాన్ని విముక్తి చేయడమే కాకుండా, ఆర్థిక, రాజకీయ అసమానతలులేని దేశాన్ని ఏర్పాటు చేయడం స్వాతంత్య్ర సమరయోధుల లక్ష్యం. దురదృష్టవశాత్తు.. ఇది ఇంకా నెరవేరలేదు'' అని ఆయన అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న హక్కులను బీజేపీ లాక్కుందని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను బీజేపీ తొలగించిందని విమర్శించారు. గిరిజన, గిరిజనేతర ప్రజల మధ్య విభజన రాజకీయాలు చేయడంలో బిజీగా ఉందని విమర్శించారు.
ఎస్ఎఫ్ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిస్వాస్ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ చరిత్రలో తొలిసారిగా త్రిపురలోని అగర్తల వీధుల నుంచి ఎస్ఎఫ్ఐ ఈశాన్య అఖిల భారత జాతాను ప్రారంభించిందనీ, దేశంలోని ఈశాన్య భాగానికి కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉందని అన్నారు. దేశంలోని ఈ ప్రాంతంలో పారిశ్రామికీకరణ కూడా నిర్లక్ష్యం చేయబడిందని పేర్కొన్నారు. బీజేపీ తన విజన్ డాక్యుమెంట్లో పారిశ్రామికీకరణ కేంద్రం, ఈశాన్య ప్రాంతంలో కమ్యూనికేషన్ అభివృద్ధిని వాగ్దానం చేసిందనీ, కానీ వాటిని నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో అఖిల భారత స్థాయిలో విద్య, ఉపాధి సమస్యలపై దృష్టి సారించేందుకు ఎస్ఎఫ్ఐ ఈశాన్య ప్రాంతం నుంచి అఖిల భారత జాతాను ప్రారంభించిందని అన్నారు.