Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారంతా కోటీశ్వరులే: ఏడీఆర్ వెల్లడి
- సగటు ఆస్తి రూ.47.45కోట్లు
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ప్రభుత్వంలోని 75శాతం మంత్రులకు నేర చరిత్ర ఉందని 'అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్' (ఏడీఆర్) తెలిపింది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన 41 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగింది. మొదట సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. మంత్రివర్గ కూర్పు కోసం నానా తంటాలు పడ్డ ఏక్నాథ్ షిండే, ఎట్టకేలకు ఆగస్టు 9న మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. కొత్తగా 18మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు ఈసీకి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ సమాచారం ఆధారంగా 'ఏడీఆర్', 'మహారాష్ట్ర ఎలక్షన్ వాచ్' ఒక నివేదిక విడుదల చేశాయి. దీని ప్రకారం, మంత్రివర్గంలో సీఎం ఏక్నాథ్ షిండే సహా 15మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో 13మంది (65శాతం) మంత్రులపై తీవ్రమైన క్రిమినల్ నేరారోపణలున్నాయి. మంత్రులంతా కరోడ్పతులే. వీరి సగటు ఆస్తి విలువ రూ.47.45కోట్లు. మలబార్ హిల్ నియోజికవర్గ ఎమ్మెల్యే మంగల్ ప్రభాత్ లోధా ఆస్తి విలువ రూ.441 కోట్లు. మంత్రివర్గంలో అత్యంత ఆస్తిపరుడు ఇతడే. అత్యల్ప ఆస్తులు కలిగిన మంత్రి భూమారే సందీపనరావ్ ఆశ్రం (పైథాన్ నియోజికవర్గం). తనకు రూ.2.92కోట్ల ఆస్తి ఉందని పేర్కొన్నాడు. ఏక్నాథ్ షిండే మంత్రివర్గంలో మహిళలెవరికీ చోటు దక్కలేదు. విద్యార్హతల విషయానికొస్తే, మంత్రివర్గంలో 8మంది మంత్రుల చదువు 10వ తరగతి లేదా ఇంటర్. డిగ్రీ పూర్తిచేసినవారు 11మంది ఉన్నారు. సీఎంగా ఏక్నాథ్ షిండే పదవీ బాధ్యతలు చేపట్టిన 41 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ మంత్రివర్గంలో షిండే వర్గానికి చెందిన 9మందికి, బీజేపీకి చెందిన 9మంది ఎమ్మెల్యేలకు చోటు దక్కింది.