Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనుస్మృతి కాదు
- జస్టిస్ ప్రతిభాసింగ్ వ్యాఖ్యలకు బృందాకరత్ ఖండన
న్యూఢిల్లీ : దేశంలో మహిళలకు రక్షణగా దేశ రాజ్యాంగం ఉంటుందని, అంతేతప్ప మనుస్మృతి కాదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభాసింగ్ ఫిక్కీ ''దేశంలో మహిళలు ధన్యులు, మనుస్మృతి వంటి గ్రంథాలు మహిళలకు చాలా గౌరవప్రదమైన హౌదాను ఇస్తాయి'' అని వ్యాఖ్యానించడాన్ని బృందా కరత్ ఖండించారు. ఈ మేరకు ఆమె ప్రకటనను విడుదల చేశారు. ఒక హైకోర్టు న్యాయమూర్తిగా, ఆమె వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేకుండా, భారత రాజ్యాంగాన్ని సమర్థించడం ఆమె బాధ్యతని తెలిపారు. ఆమె ఉదహరించిన గ్రంథాలు అనేక విభాగాలలో నేరుగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, భారతదేశం లోని మహిళలకు, ముఖ్యంగా దళిత, ఆదివాసీ మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. ఆమె ప్రకటన కుల వ్యవస్థను సమర్థించే తిరోగమన దృక్పథాలను బలపరుస్తుందని చెప్పారు. తండ్రులు, భర్తలు, కొడుకులు వంటి పురుషుల అధీనం, నియంత్రణను స్త్రీలు అంగీకరిం చాలని ఆ గ్రంథం చెబుతుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లలో మనం స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ, ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్న ఒక మహిళా న్యాయమూర్తి మహిళలకు వ్యతిరేకంగా ఇలాంటి ఆలోచనలను వినిపించడం నిజంగా కలవరపెట్టే, దిగ్భ్రాంతికరమైనదని పేర్కొన్నారు.