Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా ఎంతోమంది ఆదివాసీలు, గిరిజనులు ప్రాణాలు అర్పించారు. స్వాతంత్య్ర తర్వాత తమ బతుకులు బాగుపడతాయని ఆశించారు. తమ గోడు వినే ప్రభుత్వాలు ఏర్పడతాయని భావించారు. కానీ అందుకు విరుద్ధంగా నేడు పరిస్థితి మారింది. పాలకులు చెబుతున్న 'అభివృద్ధి' మాటలు..చేతలు గిరిజన, ఆదివాసీల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు, పోరాటాలు పెరిగాయి. అడవి..అక్కడి పర్యావరణంతో ముడిపడిన వారి బతుకులు..'అభివృద్ధి ప్రాజెక్టుల' పేరుతో జరుగుతున్న అక్రమాలకు మూల్యం చెల్లిస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- చట్టాలు...హక్కులు కాగితాలకు పరిమితం
- అభివృద్ధి పేరుతో 22లక్షల అటవీ భూములు స్వాధీనం
- జార్ఖండ్లో 150 కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్న బీజేపీ... 2014 తర్వాత మరింత వేగవంతం
న్యూఢిల్లీ : గత 75 ఏండ్లలో ఆదివాసీ సమాజం ఏం పొందింది, పోగొట్టుకుంది అనేది బేరీజు వేసుకోవాల్సిన సమయమిది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 22 లక్షల ఎకరాలకు పైగా అటవీ భూములను అభివృద్ధి పేరుతో వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు సేకరించాయి. పట్టణీకరణ కోసం గిరిజనుల నుంచి ఏటా లక్షల ఎకరాల భూమిని లాక్కుంటున్నాయి. దాంతో గిరిజనులు, ఆదివాసీలు అడవుల్లో బతలేక...మెట్రో నగరాల్లో దినసరి కూలీలుగా మారుతున్నారు. ఒక సర్వే ప్రకారం రెండు కోట్ల మందికి పైగా ఆదివాసీలు, దళితులు నిర్వాసితులై జీవనోపాధి లేకుండా పోయారు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి విషయంలో గిరిజన ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. గిరిజన ఉపప్రణాళిక కింద మంజూరైన వేల కోట్ల రూపాయల నిధులను జైళ్లు, రోడ్లు, విమానాశ్రయాల నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. 2014 తర్వాత ప్రజా హక్కులకు సంబంధించిన రాజ్యాంగ విధానాల్లో అనూహ్య మార్పులు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గిరిజన, ఆదివాసీ, దళిత హక్కులపై దాడి పెరిగింది. కేంద్రంలోని మోడీ సర్కార్కు గ్లోబల్ పాలసీ, గ్లోబల్ క్యాపిటల్, గ్లోబల్ మార్కెట్లు ముఖ్యమయ్యాయి. సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటూ కార్పొరేట్లకు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజా ఆందోళన, రాజ్యాంగ హక్కులు, మానవ హక్కులు, అడవులు, భూమి, విద్య, ఆరోగ్యంపై తమ గళం వినిపించే వారిని దేశద్రోహులుగా ముద్రవేసి అరెస్టులు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గిరిజన సంఘాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
గిరిజనులతోనే పర్యావరణ పరిరక్షణ..
నీరు, అడవులు, భూమిని సంరక్షించడంలో ఆదివాసీలు, గిరిజనులు అద్భుతమైన పాత్ర పోషించారని అనేక శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. క్రూరమైన జంతువులతో పోరాడుతూ, అటవీ ప్రాంతాల్లో గ్రామాలను ఏర్పాటు చేసి అనేక ఆదివాస, గిరిజన తెగలు నివసిస్తున్నాయి. అడవులు, నదులు, పర్వతాల మధ్య వారికి ఒక ప్రత్యేక భాష, సంస్కృతి ఏర్పడ్డాయి. గిరిజన, స్థానిక సమాజాల మధ్య సంబంధాన్ని వారి సహజ పర్యావరణ అనుకూల జీవన విలువలను పరిరక్షించడం, అభివృద్ధి చేయడం అనే ఏకైక లక్ష్యం కోసం..ఛోటానాగ్పూర్ టెనన్సీ (సీఎన్టీ) చట్టం-1908, సంతాల్ పరగణ అద్దె (ఎస్పీటీ) చట్టం-1949 అమల్లోకి వచ్చాయి. అదనంగా, భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, పెసా చట్టం..మొదలైనవి ఉన్నాయి. 1996 ఖుంట్కట్టి వ్యవస్థ కింద నీరు, అటవీపై గిరిజన సమాజానికి హక్కులు, అలాగే ఖతియన్తో సహా ఇతర సాంప్రదాయ హక్కులను అందిస్తోంది.
గిరిజనులు నివసించే అటవీ భూమితో పాటు వారి సామాజిక-సాంస్కృతిక, ఆర్థిక పునాదిని రక్షించడానికి , అభివృద్ధి చేయడానికి భారత రాజ్యాంగంలో ప్రత్యేక చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. గ్రామం లోపల, వెలుపల ఉన్న సహజ వనరులైన కంకర, నేల, ఇసుక, పొదలు, అడవి, భూమి, నది మరియు నీటి బుగ్గలు ఆ గ్రామానికి సమాజ ఆస్తి. దీనిపై గ్రామస్తులందరికీ కమ్యూనిటీ హక్కులు ఉన్నాయని చట్టాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే స్వతంత్రం వచ్చాక కూడా తమ భూమి, నీరు, అడవి, భాష, సంస్కృతితో పాటు గుర్తింపుపై ఆక్రమణలకు వ్యతిరేకంగా గిరిజనులు, ఆదివాసీలు నిరంతరం పోరాడాల్సి వస్తోంది.
జార్ఖండ్లో బీజేపీ వచ్చాక..
పాలము-గుమ్లా ప్రాంతంలోని 256 గ్రామాలు నిర్వాసిత ప్రాంతాలుగా మారకుండా కేంద్రీయ జన్ సంఘర్ష్ సమితి 45 ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేసింది. కోయెల్, కారో నదులపై డ్యామ్ నిర్మాణం కారణంగా 245 గ్రామాలు నిర్మూలనకు కారణమైన హైడల్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కోయెల్ కరో ప్రజల ఉద్యమం 40 సంవత్సరాలుగా కొనసాగుతోంది. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో, 2000లో ఆనాటి బీజేపీ ప్రభుత్వం నాలుగేండ్లలో 150కి పైగా కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకుంది. వీటికి వ్యతిరేకంగా ఆదివాసీలు సంఘటితమై ఉద్యమించాయి. ఖుంటి-గుమ్లా జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ సుమారు 40 గ్రామాలను తొలగించి ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పుడు, ఆ ప్రాంతపు స్థానిక రైతులు 'అంగుళం భూమిని కూడా విడిచిపెట్టము' అనే నినాదంతో ప్రతిఘటించారు. తూర్పు సింగ్భూమ్లో భూషణ్ స్టీల్ మరియు జిందాల్ స్టీల్లకు వ్యతిరేకంగా మరియు దుమ్కాలోని కతికుండ్ ప్రాంతంలో బొగ్గు కంపెనీ భూసేకరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు విజయవంతమయ్యాయి.