Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాంతీయ అసమానతలు తగ్గుతున్నాయి: జాతి నుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : ''మన దేశం వైవిధ్యంతో నిండి ఉన్నది. కానీ, అదే సమయంలో మనందరికీ ఉమ్మడిగా ఉంటుంది. ఈ ఉమ్మడి థ్రెడ్ మనందరినీ కలుపుతుంది. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ స్ఫూర్తితో కలిసి నడవడానికి మనల్ని ప్రేరేపిస్తుంది'' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశం కొత్త శిఖరాలను తాకేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. దేశం కొత్త ఆత్మవిశ్వాసానికి మూలం యువత, రైతులు, మహిళలేనని పేర్కొన్నారు. వృద్ధి మరింత సమ్మిళితం అవుతోందని, ప్రాంతీయ అసమానతలు కూడా తగ్గుతున్నాయని తెలిపారు. అయితే ఇది ప్రారంభం మాత్రమేనని, ఆర్థిక సంస్కరణలు, విధాన కార్యక్రమాల శ్రేణి దీర్ఘకాలానికి మైదానాన్ని సిద్ధం చేస్తోందని పేర్కొన్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 14ని విభజన-భయానక స్మారక దినంగా జరుపుకుంటున్నామని, ఈ స్మారక దినోత్సవాన్ని జరుపుకోవడంలో సామాజిక సామరస్యం, మానవ సాధికారత, ఐక్యతను ప్రోత్సహించడమనే ఉద్దేశం ఉందని తెలిపారు. 'జాతీయ విద్యా విధానం' భవిష్యత్ తరాన్ని మన వారసత్వంతో మళ్లీ అనుసంధానం చేస్తూనే, పారిశ్రామిక విప్లవం తదుపరి దశకు సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధులందరికీ అందరం వందనం చేస్తున్నామని, మనమందరం దేశంలో స్వేచ్ఛా ఊపిరి పీల్చుకోవడానికి వారు సర్వస్వం త్యాగం చేశారని గుర్తు చేశారు. చాలా ప్రజాస్వామ్య దేశాల్లో మహిళలు ఓటు హక్కును పొందేందుకు చాలా కాలం పాటు కష్టపడాల్సి వచ్చిందని, అయితే మన గణతంత్రం ప్రారంభం నుంచే దేశం సార్వత్రిక అడల్ట్ ఫ్రాంచైజీని స్వీకరించిందని ఆమె అన్నారు. దండి యాత్ర జ్ఞాపకాన్ని పునరుజ్జీవింపజేస్తూ 2021 మార్చిలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ప్రారంభించినట్లు తెలిపారు. ఆ యుగపు ఉద్యమం ప్రపంచ వేదికపై మన పోరాటాన్ని నిలబెట్టిందని, ఈ పండుగ దేశ ప్రజలకు అంకితం చేయబడిందని అన్నారు.
గతేడాది నుంచి ప్రతి నవంబరు 15న గిరిజనుల దినోత్సవంగా ''జనజాతీయ గౌరవ్ దివస్'' నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. గిరిజన వీరులు కేవలం స్థానిక, ప్రాంతీయ చిహ్నాలు మాత్రమే కాదని, వారు మొత్తం దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు. 2047 నాటికి మన స్వాతంత్య్ర సమరయోధుల కలలను పూర్తిగా సాకారం చేస్తామన్నది తమ సంకల్పమని అన్నారు. అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించిన వారి దార్శనికతకు ఒక నిర్దిష్టమైన రూపాన్ని అందిస్తామని, ఇప్పటికే ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశలో ఉన్నామని అన్నారు. దేశంలో కనిపించే వృద్ధి కోసం కష్టపడి పని చేసిన కార్మికులు, రైతులకు, వ్యాపార చతురతతో సంపదను సృష్టించిన పారిశ్రామిక వేత్తలకు కూడా క్రెడిట్ ఇవ్వాలని అన్నారు.
దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌తో మానవ చరిత్రలో అతిపెద్ద టీకా ప్రచారాన్ని ప్రారంభించామని చెప్పారు. గత నెలలో 200 కోట్ల వ్యాక్సిన్ మార్క్‌ను అధిగమించామని అన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో మన విజయాలు, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కరోనా మహమ్మారితో తీవ్ర ఆర్థిక సంక్షోభం పరిణామాలతో ప్రపంచం పెనుగులాడుతున్నప్పుడు, మనదేశం తనను తాను చూసుకుందని అన్నారు. ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతోందని ఆమె చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో మనదేశం ఒకటని పేర్కొన్నారు.
దేశంలో సున్నితత్వం, కరుణ వంటి జీవిత విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె అన్నారు. ఈ జీవన విలువల ప్రధాన లక్ష్యం సమాజంలోని అణగారిన, పేద, అట్టడుగు ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు తమ ప్రాథమిక విధుల గురించి తెలుసుకోవాలని, వాటిని అనుసరించాలని, తద్వారా మన దేశం కొత్త శిఖరాలను తాకేందుకు కృషి చేయాలని అన్నారు. దేశంలో ఆరోగ్యం, విద్య, ఆర్థిక వ్యవస్థ, ఇతర సంబంధిత రంగాలలో కనిపిస్తున్న మంచి మార్పులకు మూలమైన సుపరిపాలన ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. దేశం కొత్త ఆత్మవిశ్వాసానికి మూలం యువత, రైతులు, మహిళలని పేర్కొన్నారు. మహిళలు ఎన్నో మూస పద్ధతులను, అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతున్నారని తెలిపారు. సామాజిక, రాజకీయ ప్రక్రియలలో వారి పెరుగుతున్న భాగస్వామ్యం నిర్ణయాత్మకమైనదని అన్నారు. పంచాయతీరాజ్ సంస్థల్లో ఎన్నికైన మహిళా ప్రతినిధుల సంఖ్య పద్నాలుగు లక్షలకు పైగా ఉందని, దేశంలో అనేక ఆశలు మన కుమార్తెలపై ఉన్నాయని అన్నారు. సరైన అవకాశాలు లభిస్తే గొప్ప విజయాలు అందుకోవచ్చని, మన కూతుళ్లు ఫైటర్ పైలట్ నుంచి అంతరిక్ష శాస్త్రవేత్త వరకు ప్రతి రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారని తెలిపారు.
మన పర్యావరణం కొత్త సవాళ్లను ఎదుర్కొంటుందని, ప్రతిదాన్ని మనం రక్షించుకోవాలని ఆమె అన్నారు. నీరు, నేల, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం మన భవిష్యత్ తరాల పట్ల మన కర్తవ్యమని పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రగతి, శ్రేయస్సు కోసం సర్వస్వం కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. తమ మాతృభూమి గర్వపడేలా చేస్తున్న భారత సాయుధ బలగాలను, విదేశాల్లోని భారతీయ మిషన్లను, ప్రవాస భారతీయులను నేను అభినందిస్తున్నానని అన్నారు. దేశ ప్రజలందరికీ సంతోషకరమైన, సంపన్నమైన జీవితం కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు
76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన స్వాతంత్య్ర దినోత్సవ సంతోషకరమైన సందర్భంగా దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలని పేర్కొన్నారు. 75 ఏండ్లలో మనం సాధించిన అపారమైన పురోగతిని జరుపుకుంటున్నప్పుడు, మన స్వాతంత్య్రం ఎంత కష్టపడి సాధించబడిందో మనం మరచిపోకూడదని అన్నారు. అణచివేత వలస పాలన నుంచి మనకు స్వాతంత్య్రం తెచ్చిన వీర స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడానికి, వారికి నివాళులర్పించడానికి ఇదొక సందర్భమన్నారు. వారి ధైర్యం, త్యాగాలను గుర్తు చేసుకోవల్సిన అవసరం ఉందన్నారు. సార్వభౌమాధికారం, సుస్థిరమైన, బలమైన గణతంత్రానికి పునాది వేసిన ఆధునిక భారతదేశ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇదొక సందర్భమని పేర్కొన్నారు. దేశం సర్వతోముఖాభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్న సంభావ్యతతో నిండిన దేశమని తెలిపారు. దేశం ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్ను జరుపుకుంటున్నప్పుడు, మన గొప్ప విప్లవకారులు, స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిదాయకమైన కథలను గుర్తుకు తెచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తద్వారా యువత దేశభక్తి, త్యాగం, సేవ వంటి సద్గుణాలను అలవర్చుకునేలా ప్రోత్సహించడం అవసరమన్నారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు 'భారత్' నాగరికత, రాజ్యాంగ విలువలను నిలబెట్టేందుకు మన ప్రతిజ్ఞను చేయాలని అన్నారు. ప్రగతిశీల, సంపన్నమైన దేశాన్ని నిర్మించడానికి మరింత ముందుకు వెళ్లడానికి మనల్ని మనం పునరుద్దరించుకుందామని అన్నారు.