Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు
న్యూఢిల్లీ : క్యూబా విప్లవ నాయకుడు ఫిడెల్ కాస్ట్రో 96వ జయంతిని శనివారం ప్రపంచవ్యాప్తంగా విప్లవకారులు ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలో ఏ మూలకు అయినా సైనికులను పంపే జోక్యవాద విధానాన్ని ఎదుర్కొన్న ఫిడెల్ కాస్ట్రో అవసరమైన ప్రాంతాలకు వైద్యులను పంపారు. క్యూబా విప్లవం యొక్క చారిత్రాత్మక నాయకుడు, విముక్తి ఆలోచనలకు, వలసవాదం-సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి సార్వత్రిక చిహ్నం అయిన ఫిడెల్ కాస్ట్రో 96వ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా విప్లవకారులు ఘనంగా నిర్వహించుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కాస్ట్రోకు నివాళలర్పించారు.
క్యూబా చాలా చిన్న, పేద దేశమైనా..సామ్రాజ్యవాద చీకటి నీడలో ఒక జ్యోతిగా వెలిగింది. 1959లో క్యూబాలో రేగిన కార్మికుల, రైతుల, విద్యార్థుల విప్లవం చివరికి ప్రజా ఉద్యమంగా ఎదిగి విజయానికి దారి తీసిన వ్యక్తిగా అనేక మందికి కాస్ట్రో తెలుసు. కాస్ట్రో జీవితంలో ఇతర కోణాలు గురించి తక్కువగా తెలిసినా. అతనిలోని పరివర్తనా సామర్థ్యం అతన్ని ప్రజలకు దగ్గర చేసింది. హవానాలో కాస్ట్రో 1942 నుంచి 1945 వరకూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సాహిత్యం, క్రీడలు వంటి రంగాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. కాస్ట్రో తన పరిపాలనా కాలంలో విద్య, క్రీడలకు మధ్య సమిష్టితత్వం కలిగిఉండే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కారణంగానే అమెరికా విధించిన భయంకరమైన దిగ్బంధనానికి గురై కూడా 84 ఒలింపిక్స్ పతకాలను క్యూబా సాధించగలిగింది. స్పెయిన్, బ్రెజిల్, భారత్ వంటి దేశాలు సాధించిన పతకాల కంటే ఇది చాలా ఎక్కువ.
అలాగే ప్రపంచంలో ఏ మూలకైనా సైనికులు, ఫిరంగులను పంపే జోక్యవాదానికి వ్యతిరేకంగా వైద్యులను పంపడాన్ని క్యూబా ప్రారంభించింది. 1960 ప్రారంభం నుంచి 120కు పైగా దేశాలకు క్యూబా సుమారు 4,20,000 మంది వైద్య నిపుణులను పంపింది. 1986 ఏప్రిల్లో చెర్నోబిల్ అణుప్రమాదం తరువాత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రష్యా, బెలారస్, ఉక్రెయిన్లకు చెందిన 26 వేల మందికిపై చిన్నారుల సంరక్షణపై క్యూబా ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాగే కేవలం 2015 నుంచి 2018 మధ్య కాలంలోనే లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాల్లోని 68 దేశాలకు 50 వేల మంది వైద్యులు, నర్సులు, ఇతర సాంకేతిక నిపుణులను క్యూబా పంపింది.