Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్‌లో దారుణం..దళిత బాలుడ్ని కొట్టిన టీచర్
- తీవ్రంగా గాయపడి..బాలుడు మృతి
న్యూఢిల్లీ : భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నవేళ, రాజస్థాన్‌లో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. దళితుల పట్ల వివక్షకు ఒక బాలుడు బలయ్యాడు. తాను తెచ్చుకున్న మంచినీరు తాగాడని పెత్తందారీ వర్గానికి చెందిన ఓ టీచర్ 9ఏండ్ల దళిత బాలుడ్ని విచక్షణా రహితంగా కొట్టాడు. పరుష పదజాలంతో దూషించాడు. శారీరకంగా, మానసికంగా తీవ్రంగా గాయపడ్డ ఆ బాలుడు చికిత్స పొందుతూ గత శనివారం మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో సంచలనం రేపింది. జైలోర్ జిల్లా, సయాలా గ్రామాంలో జులై 20న చోటుచేసుకున్న ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తన కొడుకును కొట్టారని, దళితుడు అయినందువల్లే తీవ్రంగా దూషించారని, ఈ ఘటన వల్లే తన కుమారుడు చనిపోయాడని బాలుడి తండ్రి దేవారాం మేఘవాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ''నా కుమారుడు ఇంద్ర కుమార్ జైలోర్లోని సరస్వతి విద్యామందిర్‌లో 3వ తరగతి చదువుతున్నాడు. టీచర్ చైల్ సింగ్‌కు కేటాయించిన మంచినీళ్లను ఇంద్రకుమార్ తాగాడనే కోపంతో ఇష్టమున్నట్టు కొట్టాడు'' అని అన్నారు. చెవి, కన్ను లోపలి భాగాలు దెబ్బతినటం వల్లే హాస్పిటల్పాలయ్యాడని, కనీసం తన శరీరాన్ని పక్కకు తిప్పలేకపోయాడని, తన కొడుకు మరణానికి కారణం కుల వివక్షేనని మేఘవాల్ పోలీసుల ముందు రోదిస్తున్నాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన టీచర్ చైల్ సింగ్‌ను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ అగర్వాల్ తెలిపారు. పోస్ట్‌మార్టం నిర్వహించి, తదుపరి విచారణ జరుపుతామని అన్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బాధిత కుటుంబానికి రూ.5లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, న్యాయ విచారణ జరిపి దోషుల్ని శిక్షిస్తామని ప్రకటించారు.