Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశాన్ని చెదపురుగుల్లా తింటున్న అవినీతిపరులు
- వచ్చే 25ఏండ్ల కోసం పంచప్రాణ్
- ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
న్యూఢిల్లీ : 'అవినీతి, బంధుప్రీతి అనే రెండు పెద్ద సవాళ్లను దేశం ఎదుర్కొంటున్నది. వీటిని సకాలంలో పరిష్కరించకపోతే, అవి బలీయంగా మారవచ్చు' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉదయం రాజ్‌ఘాట్‌కు చేరుకొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అక్కడ నుంచి ఎర్రకోటకు చేరుకొని అక్కడ హౌవిట్జర్ గన్, ఏటీఏజీఎస్తో 21 తుపాకుల గౌరవ వందనం మధ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి తన తొమ్మిదో ప్రసంగం చేశారు. టెలిప్రాంప్టర్ కాకుండా పేపర్ నోట్లను ఆయన ఉపయోగించారు. సాంప్రదాయిక మూడు రంగుల మోటిఫ్ సఫా (తలపాగా) ధరించి దాదాపు 1:22 గంటల పాటు సుదీర్ఘంగా ప్రసంగం చేశారు. కొత్త సంకల్పంతో, కొత్త బలంతో కొత్త మార్గంలో ముందడుగు వేయడానికి ఇది శుభ సందర్భమని అన్నారు. మహిళలను గౌరవించాలనే సంకల్పం తీసుకోవాలనీ, రాబోయే 25 ఏండ్లలో దేశ ప్రగతికి వారి సహకారాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. మన ముందు ఉన్న మార్గం కఠినమైందనీ, ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆకలికేకలు, యుద్ధాలు, తీవ్రవాదం సమస్యలకు ఎదురొడ్డి నిలిచామని వ్యాఖ్యానించారు.
'నిర్ణయాత్మక కాలం'లోకి....
అవినీతిపరులు దేశాన్ని చెదపురుగులా తింటున్నారని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటం 'నిర్ణయాత్మక కాలం'లోకి ప్రవేశిస్తున్నదని, పెద్ద వాళ్ళు కూడా తప్పించుకోలేరని ఆయన అన్నారు. 'నేను ఈ యుద్ధంలో పోరాడగలను. ఈ యుద్ధంలో దేశం గెలవడానికి మీ మద్దతు కోసం వచ్చాను' అని మోడీ తెలిపారు. నేడు దేశంలో అవినీతిపై ద్వేషం కనిపిస్తోందనీ, అయితే ఒక్కోసారి అవినీతిపరులపై ఉదారంగా వ్యవహరిస్తుండడం ఆందోళన కరమని అన్నారు. ''పేదరికానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్న దేశంలో ఒక వైపు, నివసించడానికి స్థలం లేని వారున్నారు. మరోవైపు తమ డబ్బును దాచడానికి స్థలం లేని వారూ ఉన్నారు'' అని మోడీ తెలిపారు. అవినీతి దేశాన్ని చెదపురుగులా పొడుస్తోందని, దీనిపై పోరాడాలని పిలుపునిచ్చారు. 'బ్యాంకులను కొల్లగొట్టి, దేశాన్ని దోచుకొని దేశం విడిచి పారిపోయిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకొని తిరిగి రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కొందరు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది' అని అన్నారు. అవినీతిపై దేశానికి అవగాహన అవసరమని తెలిపారు. గత ఎనిమిదేండ్లలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమలుతో తమ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల ఆదా చేసిందని గుర్తుచేశారు.
బంధుప్రీతి దేశాన్ని దెబ్బతీస్తుంది
'నేను బంధుప్రీతి గురించి మాట్లాడినప్పుడు, నేను రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నానని ప్రజలు అనుకుంటారు. కాదు, దురదృష్టవశాత్తూ, రాజకీయ రంగంలోని ఆ దుర్మార్గం దేశంలోని ప్రతి సంస్థలోనూ బంధుప్రీతిని పెంచింది. దేశంలోని అనేక సంస్థలను బంధుప్రీతి పట్టి పీడిస్తోంది. ఇది దేశ ప్రతిభను, సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. అవినీతికి ఇదీ ఒక కారణమే' అన్నారు. వంశపారంపర్య రాజకీయాలు కేవలం కుటుంబ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాయనీ, దేశ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని తెలిపారు. దేశాన్ని వంశపారంపర్య రాజకీయాల నుంచి విముక్తం చేయాలనీ, ప్రతిభ ఆధారంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.
రానున్న 25 ఏండ్ల కోసం పంచప్రాన్
రానున్న 25 ఏండ్లలో ప్రధానంగా ఐదు తీర్మానాల (పంచప్రాన్)పై దృష్టిపెట్టాలని ప్రధాని మోడీ సూచించారు. 'సంకల్పంతో ముందుకు సాగాలి. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి. మన వారసత్వం చూసి గర్వపడాలి. ఐక్యత, సంఘీభావానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి' అని సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రతి పౌ రుడి జీవన విధానం కావాలనీ, భిన్నత్వంలో ఏకత్వం మన బలమని తెలిపారు. ఈ దశాబ్దం ఖచ్చితంగా టెక్నాలజీదేనని, దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. జైజవాన్, జైకిసాన్, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్ అంటూ పిలుపునిచ్చారు.
పోటీ ఫెడరలిజం అవసరం
''దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో గొప్ప పాత్ర పోషించిన, అనేక రంగాలలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాలు ఉన్నాయి. ఇది మన ఫెడరలిజానికి బలాన్నిస్తుంది. కానీ నేడు మనకు సహకార సమాఖ్య, సహకార పోటీ ఫెడర లిజం అవసరం. అభివృద్ధికి పోటీ కావాలి' అని మోడీ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆశలు సాకారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. పేదల సంక్షేమం కోసం చేసే ఏ పని అయినా, దేశం పూర్తి శక్తితో ముందుకు సాగుతోందన్నారు. స్వచ్ఛ భారత్, ఇంటిం టికీ విద్యుత్ సాధన అంత తేలిక కాదని, లక్ష్యాలను వేగంగా చేరుకునేలా దేశం ముందడుగు వేస్తున్నదని తెలిపారు.
ప్రయివేట్ రంగం ముందుకు రావాలి
'ప్రయివేట్ రంగం కూడా ముందుకు రావాలని నేను పిలుపునిస్తున్నాను. మనం ప్రపంచాన్ని శాసించాలి. ప్రపంచ అవసరాలను తీర్చడంలో దేశం వెనుకబడి ఉండకూడదనేది స్వావలంబన, దేశం కలలలో ఒకటి. మన ఉత్పత్తులను 'జీరో డిఫెక్ట్ - జీరో ఎఫెక్ట్'తో ప్రపంచానికి తీసుకెళ్లాలి' అన్నారు. 'ఇంధన రంగంలో స్వావలంబన సాధించాలి. ఈ రంగంలో ఎంతకాలం ఇతరులపై ఆధారపడతాం? సౌరశక్తి, పవన శక్తి, మిషన్ హైడ్రోజన్, బయో ఫ్యూయల్, ఎలక్ట్రిక్ వాహనాల వంటి అనేక ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల రంగాలలో మనం స్వావలంబన కలిగి ఉండాలి'' అని పేర్కొన్నారు.
స్వాతంత్ర యోధులను గుర్తించుకోవాలి
మహనీయులు మనకు స్వాతంత్య్రాన్ని అందించారనీ, బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అసమానమని కొని యాడారు. మహాత్మా గాంధీ, సుభాస్ చంద్రబోస్, అంబేద్కర్ వంటివారు మార్గదర్శకులన్నారు. మంగళ్‌పాండేతో ప్రారంభమైన సమరంలో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వంటి ఎందరో సమిధలయ్యారన్నారు. అల్లూరి, గోవింద్ గురు వంటివారి తిరుగుబాట్లు మనకు ఆదర్శమన్నారు.