Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల పరిష్కారానికి అన్ని విభాగాలు కలిసి పనిచేయాలి: సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ
- కోర్ట్స్ ఆఫ్ ఇండియా : పాస్ట్ టు ప్రెజెంట్ తెలుగు అనువాదం విడుదల..జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు నివాళి
న్యూఢిల్లీ : దేశంలోని న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలోని ప్రతి అవయవానికి సంబంధించిన పనులు రాజ్యాంగ స్ఫూర్తితో ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. దేశంలోని సమస్యల పరిష్కారానికి అన్ని అంగాలు కలిసి పనిచేయాలని సూచించారు. సుప్రీంకోర్టులో స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) నిర్వహించింది. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వి రమణ మాట్లాడుతూ ''రాజ్యాంగ చట్రంలో ప్రతి అవయవానికి ప్రత్యేకమైన బాధ్యత ఇవ్వబడింది. కార్యనిర్వాహక, శాసనసభ, న్యాయవ్యవస్థ రాజ్యాంగ విశ్వాసానికి సమాన భాండాగారాలు'' అన్నారు. 'న్యాయమనేది కోర్టు బాధ్యతనే భావనను ఆర్టికల్ 38 ద్వారా తొలగించారు. రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి అవయవం చేసే ప్రతి పని రాజ్యాంగ స్ఫూర్తితో ఉండాలి' అన్నారు 'మన వైవిధ్యాన్ని మనం గౌరవించి, ఆదరించినప్పుడు మన వ్యవస్థ నిజంగా ప్రజలకు చెందుతుంది' అని చెప్పారు. న్యాయవ్యవస్థ భారతీయీకరణ కోసం తన ప్రయత్నాన్ని పునరుద్ఘాటించారు. ఈ ప్రయత్నంలో భాగంగా, సుప్రీం కోర్టు గత కొన్నేండ్లుగా ప్రాంతీయ భాషల్లో తన తీర్పుల కాపీలను అందించిందని తెలిపారు. దిగువ న్యాయవ్యవస్థలో 40 మిలియన్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయనీ, ఒక్క సుప్రీంకోర్టులోనే 70 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇది న్యాయవ్యవస్థలో ఉన్న సమస్య అని తెలిపారు.
లక్ష్మణ రేఖను దాటడానికి సాహసించను: కిరణ్ రిజిజు
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ కేసుల పెండింగ్ ఎందుకని పార్లమెంటు సభ్యులు తనను అడుగుతున్నారనీ, సామాజిక, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో న్యాయమూర్తుల గురించి పలు అంశాలపై చర్చించారని అన్నారు. ''సభలో నా ప్రత్యేకాధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నేను ఇతర సభ్యులు మాట్లాడే విధంగా కూడా మాట్లాడగలను. కానీ నేను న్యాయ వ్యవస్థకు తిరిగి రావాలి. నేను ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడాలి. న్యాయమూర్తులతో సంభాషించాలని నేను అర్థం చేసుకోవాలి. కాబట్టి, నా దగ్గర 'లక్ష్మణ రేఖ' ఉంది. దానిని దాటడానికి నేను ఎప్పటికీ సాహసించను'' అని అన్నారు. 'మా న్యాయమూర్తులు నిర్వహించే పనిభారం ఏ దేశంలోనూ లేదు' అని కిరణ్ రిజిజు అన్నారు. 'దేశంలో మీరు నిర్వహిస్తున్న ఈ పదవిని నిర్వహించడం అంత సులభం కాదనీ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సహకారం అవసరమని నొక్కి చెప్పారు. 'న్యాయ శాఖ మంత్రిగా న్యాయవ్యవస్థ, కార్యనిర్వహకవ్యవస్థ మధ్య వారధిగా నేను చాలా స్పష్టమైన పాత్ర పోషించాలనుకుంటున్నాను. ఆ పాత్రను నేను కొనసాగిస్తాను' అని అన్నారు.
పింగళి వెంకయ్యకు నివాళి
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యను సీజేఐ ఎన్వి రమణ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళుర్పించారు. 'ఈ రోజు మనపైన త్రివర్ణ పతాకం ఎగురుతున్నట్టు చూస్తున్నాను. జాతీయ జెండా రూపశిల్పి, జాతీయ జెండాను రూపొందించిన తెలుగు నేల నుంచి వచ్చిన పింగళి వెంకయ్యని స్మరించుకుంటూ గర్వించకుండా ఉండలేకపోతున్నాను' అన్నారు. దేశంలోని న్యాయవ్యవస్థ చరిత్రను తెలిపే 'కోర్ట్స్ ఆఫ్ ఇండియా:పాస్ట్ టు ప్రెజెంట్ (భారత న్యాయస్థానాలు నాటి నుంచి నేటి వరకు)' పేరుతో పుస్తక తెలుగు వెర్షన్ను విడుదల చేశారు. ఈ పుస్తకం మరో ఆరు ప్రాంతీయ భాషల్లోకి అనువదించారు. ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, డిజిగేట్ సీజేఐ జస్టిస్ యుయు లలిత్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వికాస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.