Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలెక్కడీ
- రైతుల ఆదాయం రెట్టింపు ఎక్కడికెళ్లింది?
- అందరికీ ఇండ్లు పూర్తి కాలేదు
- ప్రతి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు ఏమయ్యాయి?
- ప్రధాని మోడీ ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శలు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ తాను గతంలో ఇచ్చిన వాగ్దానాలపై స్పందించలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనీ, అందరికీ ఇండ్లు కట్టిస్తామని ప్రధాని మోడీ ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించాయి. అవినీతి, బంధుప్రీతిపై పోరాడాల్సిన అవసరంతో పాటు... నారీశక్తి (మహిళా శక్తి) సామర్థ్యాన్ని గురించి చారిత్రాత్మక ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన 82 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానం, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడంలో వెనకడుగే అందుకు కారణమని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.
అమిత్ షా కుమారుడి గురించి మాట్లాడారా? : కాంగ్రెస్
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోడీ గతంలో చేసిన వాగ్దానాలు ఏవీ అమలు చేయలేదని కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ పవన్ ఖేరా అన్నారు. వంశపారంపర్య రాజకీయాలను ప్రస్తావిస్తూ ఆటగాడు కాకుండా దేశంలో క్రికెట్ వ్యవహారాలకు సారథ్యం వహిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడిని ప్రధాని మోడీ ప్రస్తావిస్తున్నారా? లేదా రిలయన్స్‌కు అనుబంధంగా ఉన్న అంతర్జాతీయ థింక్ ట్యాంక్‌లో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కొడుకును ఉద్దేశించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ఆయన లక్ష్యం తన సొంత మంత్రులేనని తాను అనుకుంటున్నానన్నారు. ప్రధాన మంత్రి మనకు రిపోర్ట్ కార్డ్ ఇస్తారనీ, పరిణతి చెందిన ప్రసంగం చేస్తారని ఆశించామనీ, కానీ ఆయన ప్రసంగంలో ఏమీ చెప్పకపోవడం విచారకరమని పవన్ ఖేరా అన్నారు.
అవినీతిపై చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల బాండ్లను ఉపసంహరించుకోవాలి : సీతారాం ఏచూరి
అవినీతి, బంధుప్రీతిపై మోడీ చేస్తానన్న పోరాటం పట్ల చిత్తశుద్ధి ఉంటే రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసే ఎన్నికల బాండ్లను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బంధుప్రీతి గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. అలాంటప్పుడు మీరు పాలిస్టర్ త్రివర్ణాలను ఎందుకు అనుమతించారు? కోట్లాది రూపాయిలు ఎవరు ఆర్జిస్తున్నారో చెప్పండి? అని ప్రశ్నించారు. కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్లకు పైబడి మాఫీ చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. రాఫెల్ విమానాల కొనుగోలుతో సహా వివిధ రకాల అవినీతికి ఎవరు పాల్పడ్డారని ప్రశ్నించారు. 'మోడీ చేసిన వాగ్దానానికి అనుగుణంగా రైతుల ఆదాయాన్ని ఇప్పటికి రెట్టింపు చేసి, అందరికీ ఇండ్లు లభించాలి. కానీ ఏమీ జరగలేదు. హామీలు నిలబెట్టుకోలేదు. కాబట్టి అవే వాగ్దానాలు పునరావృతం అయ్యాయి' అని విమర్శించారు.
ప్రజా సమస్యలను ప్రస్తావన లేద్ణు : డి.రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ మోడీ ప్రసంగంలో ప్రజా సమస్యల ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. 'దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. కార్పొరేట్లు సంపదను కూడబెట్టుకుంటున్నారు. ప్రజల కష్టాల గురించి ప్రస్తావించలేదు. మహిళా శక్తి గురించి మాట్లాడారు. అలాంటప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు తీసుకురాలేదు' అని ప్రశ్నించారు. 'గత ఎనిమిదేండ్లలో ఏమీ జరగలేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల రెట్టింపు ఆదాయం, అందరికీ ఇండ్లు వంటి బూటకపు వాగ్దానాలే' అని తెలిపారు.
దేశం అమృత్‌కాల్‌లో ఉందని అధికార బీజేపీ చెబుతున్నది. అయితే రూపాయి విలువ రోజు రోజుకు ఎందుకు బలహీనపడుతుంది? ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెబుతున్న దశలో ఉందా అనే ప్రశ్న మిగిలి ఉందని అన్నారు.
ఆర్జేడీ సీనియర్ ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం, త్రివర్ణ పతాకానికి సంబంధించిన విలువలు ఉన్నాయనీ, ఆ విలువల ఆధారంగా 75 ఏండ్లలో ఇప్పటి వరకు చేసిన ప్రమాణాన్ని నిరంతరం విశ్లేషించుకోవాలని అన్నారు. ఈ రోజు ఎక్కడ ఉందో కూడా వివరించాలని సూచించారు.
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ పంచాయితీ నుంచి పార్లమెంటు స్థాయిల వరకు మహిళల ఓటింగ్ శాతం పెరుగుతున్నప్పటికీ, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నప్పటికీ, రాజ్యసభ, లోక్‌సభ రెండింటిలోనూ ప్రస్తుతం ఉన్న మొత్తం 764 మంది ఎంపిల్లో ఇప్పుడు కేవలం 102 మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉన్నారు. దీనిపై ప్రధాని మోడీ మాట్లాడితే బాగుండేదని ఎద్దేవా చేశారు.