Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే తిరస్కరించిన ఎస్కేఎం
న్యూఢిల్లీ:భవిష్యత్ వ్యూహాలపై చర్చించడానికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కమిటీ తన మొదటి సమావేశాన్ని ఈనెల 22న నిర్వహించ నుంది. ఢిల్లీలో నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ కాంప్లెక్స్ (ఎన్ఏఎస్సీ)లో ఉదయం 10.30 గంటలకు సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొదటి సమావేశంలో కమిటీ సభ్యులను పరిచయం చేస్తుందని, ''భవిష్యత్ వ్యూహాలపై నిబంధనలలో పేర్కొన్న విసృత అంశాలను కవర్ చేయడానికి ఉప ప్యానెళ్లను ఏర్పాటు చేయడం గురించి చర్చిస్తుందని ఆయా వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులు ఎంఎస్పీపై కమిటీ సమావేశాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్యానెల్ ఒక ''ప్రహసనం'' అని పేర్కొన్నారు. చర్చల నుంచి నిశ్చయాత్మకంగా ఏమీ రాదని పేర్కొన్నారు. 'రైతు వ్యతిరేక ప్యానెల్'ను ఇప్పటికే తిరస్కరించామని, ఆగస్టు 22న జరిగే సమావేశానికి హాజరు కావడం లేదని ఎస్కేఎం నేతలు తెలిపారు. ఎస్కేఎం నేత హన్నన్ మొల్లా మాట్లాడుతూ ప్రభుత్వ సూచనను తిరస్కరించారు. ఎస్కేఎం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ''మేము ఇప్పటికే ప్యానెల్‌ను తిరస్కరించాము. మేము చర్చలలో పాల్గొనబోమని స్పష్టంగా చెప్పాము. కాబట్టి రాబోయే సమావేశంలో పాల్గొనే ప్రశ్నే లేదు'' అని హన్నన్ మొల్లా స్పష్టం చేశారు. ''ఢిల్లీ సరిహద్దుల్లో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మేము చేస్తున్న ఆందోళనతో సంబంధం లేని కొంతమంది రైతు నాయకులను ప్రభుత్వం ప్యానెల్లో చేర్చుకుంది'' అని ఆయన పేర్కొన్నారు. ''మేము తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాము. మేము ఎలా ప్రదర్శనలు నిర్వహించాలో నిర్ణయిస్తాము'' అని ఆయన పేర్కొన్నారు. 2021 హింసా కాండకు వ్యతిరేకంగా యూపీలోని లఖింపూర్‌లో 75 గంటల నిరసన తరువాత ఎస్కేఎం భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తుందని మరో ఎస్కేఎం నేత దర్శన్ పాల్ అన్నారు. రైతు వ్యతిరేక కమిటీకి తాము ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని, కేంద్రం గత ఏడాది ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నందున తమ నిరసన కొనసాగుతోందని పేర్కొన్నారు. గత ఏడాది రైతు వ్యతిరేక చట్టాల నిరసన సందర్భంగా రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కూడా తాము డిమాండ్ చేస్తున్నామని దర్శన్ పాల్ చెప్పారు.