Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారతీయ నగరాల్లో తీవ్రస్థాయిలో కాలుష్యం పెరుగుతోంది. ప్రపంచంలో అత్యంత తీవ్రస్థాయిలో కాలుష్యం పెరుగుతున్న 20 నగరాల్లో 18 నగరాలు భారత్లోనే ఉన్నాయి. 2010 నుంచి 2019 వరకూ ప్రపంచవ్యాప్తంగా ఏడు వేలకు పైగా నగరాల్లో వాయుకాలుష్యం, ప్రపంచ ఆరోగ్య ప్రభావాలపై చేసిన సమగ్ర, వివరణాత్మక విశ్లేషణను బుధవారం విడుదల చేశారు. దీని ప్రకారం సూక్ష్మ కణ కాలుష్య కారకాలు (పిఎం 2.5) అత్యంత తీవ్రస్థాయిలో పెరుగుతున్న 20 నగరాల్లో 18 నగరాలు భారత్లోనే ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న నగరల్లో అత్యధిక పిఎం 2.5 సగటు ఉన్న నగరంగా ఢిల్లీ నిలిచింది. అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ (హెచ్ఇఐ) ఈ నివేదికను తయారు చేసింది. 7,239 నగరాల్లో 2010 నుంచి 2019 వరకూ నమోదైన ఫైన్ పార్టిక్యూలేట్ మ్యాటర్ (పిఎం2.5), నైట్రోజన్ డయాక్సైడ్ (ఎన్ఒ2) డేటాను ఉపయోగించి ఈ నివేదికను తయారు చేశారు. 'పట్టణాల్లో గాలి నాణ్యత, ఆరోగ్యం' అనే ఈ నివేదికను క్షేత్రస్థాయిలో గాలి నాణ్యతను ఉపగ్రహాలు పంపిన గాలినాణ్యత సమాచారంతో కలిపి ఈ నివేదికను రూపొందించారు. 2019లో గాలినాణ్యత కారణాలతో ఈ 7 వేలకు పైగా నగరాల్లో 17 లక్షల మరణాలు సంభవించాయని నివేదిక తెలిపింది. సర్వే చేసిన నగరాల్లో కేవలం నాలుగు మాత్రమే డబ్ల్యూహెచ్ఓ పిఎం 2.5 గాలినాణ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపింది. పిఎం 2.5 అత్యంత తీవ్రస్థాయిలో పెరుగుతున్న 20 నగరాల్లో 18 భారత్లో మిగిలిన రెండు ఇండోనేషియాలో ఉన్నాయి. అలాగే పిఎం2.5 తీవ్రస్థాయిలో పెరుగుతున్న 50 నగర్లాల్లో 41 భారత్లో ఉండగా, మిగిలిన 9 ఇండోనేషియాలో ఉన్నాయి. మరోవైపు పిఎం2.5 కాలుష్యం తీవ్రంగా తగ్గుతున్న 20 నగరాలు కూడా చైనాలో ఉండటం విశేషం. తక్కువ, మధ్యస్థాయి ఆదాయం ఉన్న దేశాల్లో కాలుష్యం పెరుగుదల ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతీ తొమ్మిది మరణాల్లో ఒకటి గాలి కాలుష్యం కారణంగానే సంభవిస్తుందని నివేదిక తెలిపింది. 2019లో మొత్తంగా సుమారు 60 లక్షల 70 వేల మరణాలు సంభవించాయని తెలిపింది. యువకులు, వృద్ధులు, దీర్ఘకాలిక శ్వాసకోశ, గుండె జబ్బులు ఉన్నవారిపై వాయుకాలుష్యం అధిక ప్రభావం చూపుతోందని నివేదిక తెలిపింది.