Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తృణమూల్ కార్యకర్తల దుశ్చర్య
- తొమ్మిది మందికి గాయాలు
- పశ్చిమ బెంగాల్ మేడినిపూర్లో ఘటన
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల ఆగడాలకు అడ్డూ, అదుపు ఉండటం లేదు. రాష్ట్రంలో తృణమూల్ అవినీతికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) శాంతియుతంగా నిర్వహించిన శాంతియుత ర్యాలీపై దాడికి దిగారు. మేడినిపూర్లో చోటు చేసుకున్న ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జీ జరిపారు. పోలీసులు, సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా నిరసన తెలపాలనీ, జిల్లా మేజిస్ట్రేటుకు మెమోరాండంను సమర్పించాలని పశ్చిమ మేడినిపూర్ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఉదయం 11.30 గంటలకు మేడినిపూర్లోని విద్యాసాగర్ హాల్ మైదాన్ నుంచి జిల్లా మేజిస్ట్రేటు కార్యాలయం వరకు వేలాది మందితో భారీ ర్యాలీ ప్రారంభమైంది. రాష్ట్రంలో అవినీతి నేతలందరినీ అరెస్టు చేయాలనీ, అక్రమ ఆస్తులను జప్తు చేయాలని ఈ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా మేజిస్ట్రేటు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బారీకేడ్లను పెట్టారు. కేశ్పూర్లోని సూపా క్రాసింగ్ వద్ద మొదటి దాడి జరిగింది. తృణమూల్ కార్యకర్తలు రోడ్డును నిర్బంధించి సీపీఐ(ఎం) కార్యకర్తల బస్సుపై రాళ్లు రువ్వటం ప్రారంభించారు. తృణమూల్ కార్యకర్తల దాడి ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఇటు ర్యాలీ మేదినీపూర్లోకి ప్రవేశించగానే పోలీసులు అడ్డుకొని నిరసకారులపై లాఠీచార్జి చేశారు. అయినప్పటికీ, ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. తీవ్రంగా ప్రతిఘటించారు. చివరకు ఐదుగురు సభ్యుల సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం జిల్లా మేజిస్ట్రేటుకు మెమోరాండంను సమర్పించింది. బెంగాల్‌ను అవినీతి రహితం చేయాలనే ప్రచారం ప్రారంభమైందని డీఎం కార్యాలయం వెలుపల జరిగిన భారీ ర్యాలీలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం అన్నారు. అవినీతి విషయంలో బీజేపీ, తృణమూల్ పరస్పర అవగాహనతో కలిసి నడుస్తున్నాయని ఆరోపించారు.