Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకిచ్చే సంక్షేమాన్ని ఉచితమనగలమా?
న్యూఢిల్లీ : హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను అడ్డుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఉచితమంటే ఏంటి? దేన్ని ఉచితంగా పరిగణించాల్సి ఉంటుంది? అని పరిశీలించాల్సిన అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం, వినియోగదారులకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు అందుబాటులోకి తెచ్చే అంశాలు ఉచితంగా భావించాలా? లేక పౌరుల ప్రాథమిక హక్కుగా భావించాలా? అనేది ఆలోచించాల్సిన అంశమని తెలిపింది. రాజకీయ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలు నియత్రించడానికి చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఉచితాల అంశాన్ని తేల్చడానికి ఓ నిపుణుల కమిటీని నియమించాలన్న ప్రతిపాదన చేసింది.
ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు వాగ్ధానాలు చేయకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచనప్రాయంగా పేర్కొన్నారు. 'దేశంలోని రాజకీయ పార్టీలను వాగ్దానాలు చేయకుండా నిరోధించలేమని సూచిస్తున్నాం. అసలు ఉచితం అంటే ఎంటో నిర్వచించాల్సిన అవసరం ఉంది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉచితంగా పొందవచ్చా'' అని ఎన్వి రమణ తెలిపారు. ప్రజలు గౌరవంగా జీవించడానికి అవసరమైన పథకాలు కూడా ఉన్నాయని, వాగ్ధానాలే రాజకీయ పార్టీలకు ప్రాతిపదిక కాదని భావిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది వాగ్ధానాలు చేసినప్పటికీ విజయం వరించడం లేదుగా అని ప్రశ్నించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తరువాతే ఉచితాల మీద ఓ నిర్ణయానికి రాగలమని సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేశారు. తదుపరి విచారణ ఆగస్టు 23 (మంగళవారం)కు వాయిదా వేశారు.
''నిర్భందోచిత ప్రాథమిక విద్య'' వాగ్ధానాన్ని మనం ఉచితమని అభివర్ణించగలమా? వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి చిన్న, సన్నకారు విద్యుత్తు, విత్తనాలు, ఎరువుల సబ్సిడీ ఇస్తామన్న వాగ్ధానాల్ని ఉచితం అనగలమా?. ఉచిత, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను అందిస్తామంటే ఉచితమని చెప్పగలమా? నిరుపేదలకు అవసరమైన యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందజేస్తామంటే దాన్ని ఉచితమనగలమా? ఉచితంగా ఆభరణాలు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవ్వడం, వాస్తవమైన సంక్షేమ ఫలాలు అందించడం మధ్య వ్యత్యాసం ఉండాలి. ప్రొఫెషనల్ కోర్సులకు ఉచిత కోచింగ్ హామీని ఏదో ఇంటి అవసరానికి ఉచితంగా చేసినట్లుగా భావించగలమా?'' అని సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. ''ఓటర్లు ఉచితాల కోసం చూస్తున్నారని అనుకోవడం లేదు. అవకాశం ఉంటే గౌరవప్రదమైన ఆదాయం కోసమే చూస్తారు. ఉపాధి హామీ లాంటి పథకాలు ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తున్నాయి'' అని పేర్కొన్నారు. ''వాగ్దానాలే ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయని అనుకోవడం లేదు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన పార్టీలు కూడా ఎక్కువగా వాగ్దానాలు చేసిన సందర్భాలున్నాయి'' అని అన్నారు. అశ్విని ఉపాధ్యాయ పిటిషన్‌ను ఆప్, కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు వ్యతిరేకించాయి. ఉచితాలు, దేశ ఆర్థిక పరిస్థిల మధ్య సంబంధంపై చర్చ జరగాలంటే, రాజకీయ నేతలు, చట్టసభ సభ్యులకు ఏం ప్రయోజనం పొందుతున్నారో చర్చ జరగాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటర్వీనింగ్ పిటిషన్లో పేర్కొంది. అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ రాజకీయ ప్రయోజన వ్యాజ్యమని పేర్కొంది. సమాజంలో బడుగు బలహీన వర్గాలను అభ్యున్నతి ప్రభుత్వ కర్తవ్యమనీ, ప్రజలకు రాయితీలు ఇవ్వడాన్ని ఉచితంగా పరిగణించరాదని కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ తన అప్లికేషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగ ఆదేశాలకు అనుగణంగానే ప్రజలకు రాయితీలు ఇస్తున్నారనీ, వాటిని ఉచితాలుగా పేర్కొనలేమని తెలిపారు. దేశాన్ని ప్రజాస్వామ్య, సోషలిస్టు దేశం నుంచి పెట్టబడీదారీ దేశంగా మార్చాలని పిటిషనర్ ప్రయత్నిస్తున్నారని డీఎంకే తరపు సీనియర్ న్యాయవాది పి.విల్సన్ తన వాదన ధర్మాసనానికి వినిపించారు. అయితే కేంద్ర ప్రభుత్వం పిటిషనర్‌కు మద్దతు ఇచ్చింది. రాజకీయ పార్టీలు ఉచిత వాగ్ధానాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. చట్టసభల్లో చట్టాలు రూపొందే వరకూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది.