Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టు కప్పన్ కుమార్తె ప్రసంగం వైరల్..!
న్యూఢిల్లీ : హత్రాస్ కేసు రిపోర్టింగ్ కోసం వెళ్తే.. ఉపా చట్టం కింద ఖైదు చేయబడ్డ కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్ కుమార్తె మెహనాజ్కు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆమె పాఠశాల్లో 'సాధారణ పౌరుల స్వేచ్ఛ, హక్కులు' అనే అంశంపై డిబేట్ నిర్వహించగా.. బాలిక ప్రసంగించింది. 'నేను భారత పౌరులందరికీ లభించే ప్రాథమిక పౌర హక్కులను తిరస్కరించడం ద్వారా కటకటాల వెనక్కు నెట్టిన జర్నలిస్టు కుమార్తెను' అంటూ తన ప్రసంగం ప్రారంభించింది. రెండు నిమిషాల నిడివి గల ప్రసంగంలో.. మెహనాజ్ మతం, రాజకీయాల ఆధారంగా జరుగుతున్న హింసను ప్రస్తావించింది. ప్రతి భారతీయుడికీ ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏ మతాన్ని ఆరాధించాలనే వ్యక్తిగత నిర్ణయం ఉంటుందని, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రు, భగత్‌సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాల వల్లే ఇదంతా సాధ్యమైందని చిన్నారి పేర్కొంది. ఆ స్వాతంత్య్ర సమరయోధులందరినీ గుర్తు చేసుకుంటూ.. సాధారణ పౌరుల స్వేచ్ఛ, హక్కులను హరించవద్దని తన అభ్యర్థన అంటూ వ్యాఖ్యానించింది. భారత దేశ గౌరవాన్ని ఎవ్వరికీ తాకట్టుపెట్టకూడదని తెలిపింది.
'మనమంతా ఒకే జీవితంగా జీవించాలి. భారత దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. ఎలాంటి విబేధాలు, వైరుద్ధ్యాలు లేని రేపటి గురించి కలలు కనాలి. భారత్ 76వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగిడుతున్నందున.. ఈ ప్రత్యేక సందర్భంలో భారతీయురాలిగా.. నేను భారత్ మాతాకీ జై అని చెప్పాలనుకుంటున్నా' అంటూ ప్రసంగించింది. 2020లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 19 ఏండ్ల యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డ ఘటనను రిపోర్టింగ్ చేసేందుకు ముగ్గురితో కలిసి అక్కడికి వెళుతుండగా.. కప్పన్‌ను అరెస్టు చేసిన సంగతి విదితమే. శాంతి భద్రలకు విఘాతం కలిగించేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని, నిందితులకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలున్నాయని పేర్కొంటూ పలు అభియోగాలు నమోదు చేసి.. జైలులో ఉంచారు. తనను ఈ కేసులో కావాలనే ఇరికించారని, బెయిల్ ఇప్పించాలని పలు కోర్టులకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఆయనకింకా బెయిల్ రాలేదు.