Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ తొలి ఆన్లైన్ ట్యాక్సీ సర్వీసు యాప్ ప్రారంభం
- ప్రయాణికులు, రవాణా కార్మికులకు ఊరట
- రాష్ట్ర సర్కారుకు సర్వత్రా ప్రశంసలు
తిరువనంతపురం : రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తొలి ఆన్లైన్ ట్యాక్సీ సర్వీసు యాప్ 'కేరళ సవారి' ప్రారంభమైంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిని తిరువనంతపురంలో ప్రారంభించారు. రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని మోటార్ వెహికిల్ వెల్ఫేర్ బోర్డు ఈ పథకాన్ని రూపొందించింది. కేరళ సవారిలో దాదాపు 500 ఆటోలు, ట్యాక్సీలు నమోదు చేయబడ్డాయి. ప్రయివేటు ఆపరేటర్లు విధించే 20-30 శాతం సర్వీసు చార్జీ స్థానంలో కేరళ సవారీలో ఎనిమిది శాతమే వసూలు చేస్తారు. ప్రయివేటు ఆపరేటర్లు అనుసరిస్తున్న 'పీక్ టైమ్' ఛార్జీలకు విరుద్ధంగా ప్రభుత్వం ధరలు నిర్ణయించినందున రద్దీ సమయాల్లో అధిక ఛార్జీల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే హామీ రాష్ట్రంలోని ప్రయాణికులకు లభించింది. కార్పొరేటు సర్వీసు ప్రొవైడర్లు అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రయాణికులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో తన సొంత ఆన్లైన్ ట్యాక్సీ సర్వీసు యాప్ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ యాప్ను ముందుకు తీసుకొచ్చింది. ప్రయాణికులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నిరోధించటానికి భద్రత, భద్రతా చర్యలను కేరళ సవారి యాప్ కల్పిస్తుంది. కాగా, ఈ పథకాన్ని వచ్చే నెలలోగా కొల్లాం, ఎర్నాకుళం, త్రిసూర్, కోజికోడ్, కన్నూర్ మునిసిపల్ కార్పొరేషన్లకు విస్తరించనున్నారు.
అయితే, కేరళ సర్కారు వినూత్న అడుగుపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. కార్పొరేటు దిగ్గజాలు మాత్రమే ఆధిపత్యం చెలాయించే రంగంలోకి ప్రవేశించటం అభినందనీయమని ప్రయాణికులు తెలిపారు. 'కేరళ సవారి' ప్రారంభించటం ఎల్డీఎఫ్ మైలురాయి పథకాలలో ఒకటిగా పలువురు అభినందించారు.పౌరులకు సరసమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించటానికి కార్పొరేట్ల ఆధిపత్యంలో ఉన్న ఈ రంగంలోకి ప్రవేశించాలని ప్రభుత్వం నిర్ణయించిందని యాప్ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వి శివన్కుట్టి అన్నారు. దీని ద్వారా ఇటు కార్మికులు, అటు ప్రయాణికులు లాభపడతారని చెప్పారు. ఆన్లైన్ ట్యాక్సీ సర్సీసు ప్రభుత్వం ఆమోదించిన ఛార్జీలు, వేతనాలు, సురక్షితమైన ప్రయాణాలు, న్యాయమైన వేతనాలు నిర్ధారిస్తాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్వీట్ చేశారు.