Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి
- సమకాలీన బానిసత్వానికి ప్రధాన కారణం : ఐక్యరాజ్య సమితి
- దళిత మహిళలపైనా తీవ్ర వివక్ష
న్యూఢిల్లీ : భారత్‌లో బాల కార్మికులు, కుల ఆధారిత వివక్ష, పేదరికంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మూడు అంశాలూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని పేర్కొన్నది. దళిత మహిళలపై తీవ్రమైన వివక్షతో సహా సమకాలీన బానిసత్వ రూపాలను ఇది ఎత్తి చూపింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ప్రత్యేక ప్రతినిధి టోమోయా ఒబోకటా సమకాలీన బానిసత్వ రూపాలు, దాని కారణాలు, పర్యవసనాలు తన నివేదికలో వివరించారు. వివక్ష లోతైన ఖండన రూపాలు, అనేక ఇతర అంశాలతో కలిపి మైనారిటీలను ప్రభావితం చేసే సమకాలీన బానిసత్వానికి ప్రధాన కారణాలను పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నదని వివరించారు. ఆయన తన నివేదికను రెండు రోజుల క్రితమే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి సమర్పించారు.
ఈ నివేదిక ప్రకారం.. ఆసియా, పసిఫిక్, మధ్యప్రాచ్యం, అమెరికా, యూరప్‌లలో నాలుగు నుంచి ఆరు శాతం మధ్య పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారు. ఆఫ్రికాలో అత్యధికంగా 21.6 శాతంగా ఉన్నది. సబ్‌సహారా ఆఫ్రికాలో ఇది 23.9 శాతంగా ఉన్నది. '' భారత్‌లో బాల కార్మికులు, కుల ఆధారిత వివక్ష, పేదరికం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అంగోలా, కోస్టారికా, హౌండురాస్, కజకిస్తాన్‌లలో వివిధ రంగాలలో మైనారిటీ, వలస వచ్చిన పిల్లల్లో కూడా బాల కార్మికులున్నట్టు నివేదించబడింది'' అని నివేదిక పేర్కొన్నది.
అట్టడుగు వర్గాలు తరచుగా ప్రభుత్వ విధానాలు, జాతీయ బడ్జెట్ కేటాయింపులలో నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. సమకాలీన బానిసత్వంతో సహా మానవ హక్కుల ఉల్లంఘన కేసులలో న్యాయం, నివారణ పరిమితంగా ఉన్నది. మీడియా, ఇంటర్నెట్లో ప్రతికూల మూస పద్ధతులతో కొన్ని వర్గాలకు కళంకం కలుగుతున్నది. ఇది వారి నిర్వీర్యానికి దారి తీస్తున్నది. వర్గం, లింగం, మతం వంటివి కుల వాస్తవాలతో ప్రభావితమవుతాయి. దళిత మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా వారికి అన్ని రంగాలలో అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మ్యాన్యువల్ స్కావెంజింగ్ ప్రధానంగా దళిత మహిళలు నిర్వహిస్తారు. ఇది బలవంతపు శ్రమగా, సమకాలిన బానిసత్వంగా పరిగణించబడుతున్నది. ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే కఠినమైన పని పరిస్థితులను కలిగి ఉంటుంది. ఆగేయ యూరప్‌లోని రోమా బాలికల వంటి అట్టడుగు వర్గాల్లో బాల్య వివాహాల పెరుగుదల రేటు నివేదికలో పొందుపరిచారు. ఇండియా సహా కంబోడియా, కజకిస్తాన్, శ్రీలంకతో పాటు ఇతర ఆసియా దేశాల్లో బలవంతపు వివాహాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. అలాగే, ప్రపంచవ్యాప్తంగా మైనారిటీల పట్ల ఆయా దేశాల్లో సాగుతున్న వివక్ష, ఈ విషయంలో అక్కడి ప్రభుత్వాలు తీసుకున్న శాసనపరమైన, ఇతర చర్యల గురించి నివేదిక చర్చించింది. ఇటు ట్రేడ్ యూనియన్ల పాత్రను ఐక్యరాజ్య సమితి నివేదిక కొనియాడింది. మైనారిటీలు, వలసకార్మికుల హక్కుల కోసం వాదించటంలో ట్రేడ్ యూనియన్లు ముఖ్యమైన సహకారాన్ని అందిస్తాయని వివరించింది. చిలీ, కొలంబియా, ఘనా, భారత్‌లోని కార్మిక సంఘాలు.. మహిళా కార్మికులకు అంకితమైన మద్దతు, సేవలను అందిస్తున్న విషయాన్ని పేర్కొన్నది.