Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేల్చిచెప్పిన నిజనిర్థారణ కమిటీ
గాంధీనగర్ : హిందూ కమ్యూనిటీ ఉద్దేశపూర్వకంగా ఘర్షణలు జరిగేలా పథకం రచించిందని నిజనిర్థారణ నివేదిక తేల్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 10 రామనవమి ఊరేగింపు సందర్భంగా గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్, ఖంబాట్లతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌లలో మత ఘర్షణలు తలెత్తిన సంగతి తెలిసిందే. హిందువుల ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ ఊరేగింపులను చేపట్టారనీ, పోలీసులు కూడా ఇందుకు సహకరించారని నివేదిక స్పష్టం చేసింది. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యూలరిజమ్ డిప్యూటీ డైరెక్టర్ నేహా దహాడే, సామాజిక కార్యకర్త, బునియాద్ ఎన్జీఓ డైరెక్టర్ హొజెఫా ఉజ్జయినిల నేతృత్వంలో నిజ నిర్థారణ కమిటీ బృందం జులై 25, 27 తేదీల మధ్య హిమ్మత్‌నగర్, ఖంబాట్లలో పర్యటించారు. పలువురు స్థానికులను ఇంటర్వ్యూలు చేశారు. జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 11 మధ్యాహ్నం హిమ్మత్‌నగర్‌లో కొంతమంది హిందువులు ఊరేగింపులో భాగంగా కత్తులతో వీరంగం సృష్టించారు. ఈ ఊరేగింపు అష్రఫ్నగర్ చేరుకోగానే స్థానిక ముస్లింలను రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. హిందువుల ప్రాంతాలైన శక్తినగర్, మహావీర్‌నగర్ మధ్యలో అష్రఫ్ నగర్ ఉండటంతో వారు ఉద్దేశపూర్వకంగా ప్రాంతాన్ని ఎంచుకున్నారు. యాదృచ్ఛికంగా జరిగినట్టు కనిపించినప్పటికీ.. ఊరేగింపులో హిందువులు హింసకు ప్రణాళిక రచించినట్టు నిజనిర్థారణ కమిటీ నివేదికలో తేలింది. అష్రఫ్ నగర్‌లోని స్థానిక ముస్లింలతో నిజ నిర్థారణ కమిటీ భేటీ అయింది. ఆ సమయంలో పలు విషయాలు వెల్లడయ్యాయి. మూడు దశాబ్దాలుగా రామనవమి ఊరేగింపు నిర్వహిస్తున్నారని, అయితే ఈ ఏడాది విభిన్నంగా జరిపేలా ప్రణాళిక రూపొందించారని అన్నారు. గడిచిన 28 ఏళ్లలో ఊరేగింపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యేదని, కానీ ఆరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభించారని అన్నారు. అదే సమయంలో ముస్లింలు నమాజ్ చేయడం గమనార్హం. ప్రతి ఏడాది స్థానిక హిందువులే ఊరేగింపు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది అంతర్ రాష్ట్రీయ హిందూ పరిషద్, భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషద్ కార్యకర్తలు కూడా పాల్గన్నారు. అలాగే గతంలో కంటే ఎక్కువ మంది స్థానికేతరులు ఊరేగింపులో పాల్గొన్నారు. నమాజ్ ప్రారంభమైన వెంటనే సుమారు 1200 నుండి 1500 మంది కార్యకర్తలు ట్రాక్టర్‌పై స్పీకర్లతో వీరంగం సృష్టించారు.మసీదు వద్దకు చేరుకోగానే 'భారత్ నివసించాలనుకుంటే జై శ్రీరామ్ అనాల్సిందే' అంటూ పెద్ద ఎత్తున నినాదాలుచేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఊరేగింపులో పాల్గొన్న కార్యకర్తలు చాలామంది కత్తులతో తిరిగారనీ, స్థానికులపై రాళ్లు రువ్వారని చెప్పారు. ఈ హింసాకాండలో ముస్లింలకు చెందిన 18 స్టాళ్లు, రెండు ఇండ్లకు నిప్పు పెట్టారని అన్నారు. పోలీసులు కూడా ప్రేక్షకుల్లా మారారనీ, హింసను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. ఈ ఘర్షణలు హిమ్మత్‌నగర్, హసన్నగర్లకు కూడా విస్తరించాయని చెప్పారు. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరగా.. వారు తిరిగి ముస్లింలపైనే టియర్‌గ్యాస్ ప్రయోగించారని, కొంతమంది ముస్లింలను అరెస్ట్ చేశారని స్థానిక వ్యక్తి ఖురేషి పేర్కొన్నారు. ఖంబాట్ ప్రాంతంపై ఏప్రిల్ 10న పోలీసులు విరుచుకుపడ్డారని నివేదికలో పేర్కొంది. పలువురు మహిళలను విపరీతంగా కొట్టారనీ, వారి తొడలు, ఛాతీ భాగాల్లో గాయాలయ్యాయని వెల్లడించింది. ముఖ్యంగా క్యాన్సర్ రోగి అయిన జాకీర్ భాయ్ షాబీర్ మీమన్ (50), ఆమె కుమారుడు గులామ్ సర్వర్(23) లను వారి నివాసం నుంచి బయటకు ఈడ్చుకురావడంతో పాటు తీవ్రంగా కొట్టారని తెలిపింది.
మరో వ్యక్తి అల్తాఫ్ గులామ్‌నబీ (36)తో పాటు మీమన్, ఆమె కుమారుడిని అరెస్ట్ చేసి, నాలుగురోజుల పాటు హింసించారని పేర్కొంది. కోర్టులో హాజరుపరిచే సమయంలో వారిని తాళ్లతో కట్టేసి లాక్కెళ్లారని తెలిపింది. వారిని నిర్బంధించినట్టు బయటకు వెల్లడిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్టు పేర్కొంది.ఈ అల్లర్లకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్ పై కూడా కమిటీ పలు సందేహాలను వెల్లడించింది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నప్పటికీ, ఊరేగింపులో సాయుధులైన హిందూ కార్యకర్తలు ఉన్నప్పటికీ హిమ్మత్ నగర్, అష్రఫ్ నగర్ పోలీస్ స్టేషన్లలోని ఏ, బీ విభాగాల్లో కేవలం ముస్లింలనే నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయిని తెలిపింది. ఈ అల్లర్లలో కేవలం ముస్లింల నివాసాలు మాత్రమే దగ్ధమైనప్పటికీ .. వారినే నిందితులుగా పేర్కొనడం గమనార్హం.