Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ పోలీసులను ఆదేశించిన హైకోర్టు
న్యూఢిల్లీ : లైంగికదాడి నేరారోపణల ఆధారంగా బీజేపీ నేత షహనాజ్ హుస్సేన్‌పై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఢిల్లీ హైకోర్టు నాడు ఆదేశించింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. లైంగికదాడి ఆరోపణల ఆధారంగా షహనాజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ పోలీసులను ట్రయల్ కోర్టు 2018లో ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ హహనాజ్ హైకోర్టులో పిటిషన్ వేయగా..దానిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆషా మీనన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయన పిటిషన్‌ను కొట్టిపారేసింది. ట్రయల్ కోర్టు తీర్పులో ఎలాంటి తప్పుడు సంకేతాలు లేవని ధర్మాసనం తెలిపింది. తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు రద్దు చేసింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేసి, సిఆర్పిసిఇ 173 సెక్షన్ కింద వివరణాత్మక నివేదికను మూడు నెలల్లోగా మెట్రో పాలిటన్ ముందు సమర్పించాలని తన తీర్పులో పేర్కొంది. ప్రాసిక్యూట్ స్టేట్మెంట్ రికార్డు చేయడంపై పోలీసు స్టేటస్ రిపోర్టులో ప్రస్తావించాల్సి ఉన్నప్పటికీ.. ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదనే దానిపై వివరణ లేదని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. షహనాజ్ తనపై లైంగికదాడికి పాల్పడ్డారంటూ ఢిల్లీకి చెందిన ఓ మహిళ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని 2018లో దిగువ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.