Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదివేల మందితో రైతు ఉద్యమం
- కేంద్రమంత్రి అజరు మిశ్రాను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి
- సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనకారులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఈ ఆందోళనలు చేపట్టేందుకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఆందోళనల్లో 10 వేల మంది రైతులు పాల్గొంటారని భారతి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు మంజిత్ సింగ్ రారు వెల్లడించారు. లఖింపుర్‌ఖేరీ హింసాత్మక ఘటనల్లో చనిపోయిన, గాయపడ్డ రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారం ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమం 72 గంటలపాటు (20వ తేదీ వరకూ) సాగనున్నది. ఈ ఆందోళనలో రైతు నేతలు రాకేష్ టికాయత్, దర్శన్ పాల్, జోగిందర్ సింగ్‌తోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు. కేంద్రమంత్రి అజరు మిశ్రాను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనీ, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న రైతులపై కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో అఖింపుర్ఖేరీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటనకు కారకుడైన కేంద్రమంత్రి అజరు మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మలి దశ ఉద్యమానికి రైతులు సిద్ధమైయ్యారు. ఈ ఏడాది జులైలో ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. సాగు చట్టాల విషయంలో సాధించిన విజయం స్ఫూర్తితో ఆందోళనలు కొనసాగిస్తామని రైతు సంఘ నాయకులు తెలిపారు. దాదాపు సంవత్సరంపాటు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేశామని గుర్తు చేశారు. తమ రాస్తారోకోలు, ధర్నాలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందనీ.. సాగు చట్టాలను రద్దు చేసిందన్నారు. ఇప్పుడు లఖింపుర్ ఖేరీ బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ముందుకు వెళ్తామంటున్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని.. బాధితులకు న్యాయం చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు.