Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఎ.బేబీ, బి.వి.రాఘవులు పిలుపు
అమరావతి: లౌకికతత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సమానత్వాన్ని దెబ్బతీస్తున్న మతోన్మాదుల పీడ దేశానికి వదలాలంటే మరో సంగ్రామం చేయాలని సీపీఐ(ఎం)పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, బివి రాఘవులు పిలుపునిచ్చారు. 'జాతీయోద్యమం కమ్యూనిస్టుల పాత్ర - నేటి పరిస్థితులు' అనే అంశంపై విజయవాడలో సీపీఐ(ఎం) ఏపీ ఆధ్వర్యాన శుక్రవారం సాయంత్రం ఎంబివికెలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబీ, బి.వి.రాఘవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బేబీ మాట్లాడుతూ దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని మొట్టమొదటగా కోరింది కమ్యూనిస్టులేనని చెప్పారు. పేద ప్రజలు కూడా కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా బతికినప్పుడే నిజమైన స్వాతంత్య్రమని మహాత్మాగాంధీ అన్నారని, కమ్యూనిస్టులు కోరేది కూడా అదేనని చెప్పారు. అటువంటి స్వాతంత్య్ర ఫలాలు నేటికీ ప్రజలకు అందలేదని అన్నారు. స్వాతంత్ర ఉద్యమకాలంలో మౌలానా హజరత్ మోహాని తొలిసారి ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పిలుపు ఇచ్చారని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన ముజఫర్ అహ్మద్ ఒత్తిడి మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా కోల్కత్తా సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేసిందన్నారు. దీన్ని జవహర్లాల్ నెహ్రూ కూడా బలపరిచారని చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు తిరుగులేని పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణా సాయుధ పోరాటం, తెభాగ, వర్లీ, కయ్యూరు, పున్నప్రవాయలార్ వంటి అనేక పోరాటాల్లో కీలక పాత్ర పోషించారని వివరించారు. బ్రిటీషు ప్రభుత్వం కూడా కమ్యూనిస్టులపై పెషావర్, కాన్పూర్, మీరట్ వంటి కుట్ర కేసులు పెట్టి అణచివేత చర్యలకు దిగిందని వివరించారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ నాయకులు సావర్కర్ బ్రిటీషు ప్రభుత్వానికి లొంగిపోయి, తొత్తుగా ఉంటానని లేఖ రాశారని గుర్తు చేశారు. మొట్టమొదటి నావికా తిరుగుబాటులోనూ నావికులు జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టు, ముస్లింలీగు జెండాలు ఎగురవేశారని గుర్తు చేశారు. ఉద్యమకాలంలో వచ్చిన అనేక ఆలోచనలను స్వాతంత్య్రం అనంతరం ప్రజాస్వామ్య, లౌకిక రాజ్యాంగంగా రూపొందించుకున్నారని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ కూడా 1949లో జరిగిన రాజ్యాంగపరిషత్ చివరి సమావేశంలోనూ అణగారిన ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక సమాన హక్కులు లేవని, ఈ వైరుద్యాన్ని పరిష్కరించాలని కోరారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దానికి భిన్నంగా మతోన్మాదాన్ని పెంచుతోందని, ప్రజలను చీలుస్తూ కార్పొరేట్లకు లబ్ది చేకూరుస్తోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలను కదిలించి మతోన్మాదుల పీడ దేశానికి వదిలించి, సమానత్వం సాధించేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. మరో పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు మాట్లా డుతూ దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసేందుకు కేంద్రం అనేక సంస్థలను వాడుకుం టోందని తెలిపారు. ఎలక్టోరల్ ఫాసిజం దేశంలో నడుస్తోందని అన్నారు. ఒకవైపు కోట్లాది రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలును కొంటూ, ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన ప్రభుత్వాలను కూలగొడుతూ అవినీతి గురించి బీజేపీ మాట్లాడుతోందని విమర్శించారు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో పూర్తిగా నాశనం చేసిందని వివరించారు. పార్లమెంటుకు విలువ లేకుండా చేసిందని, స్వతంత్రంగా నడవాల్సిన వ్యవస్థలను అధికారపార్టీ చెబితే నడిచే సంస్థలుగా మార్చిందని అన్నారు. రాష్ట్రాలకు హక్కులు లేకుండా చేస్తూ, లౌకికతత్వాన్ని పూర్తిగా దెబ్బతీస్తూ ఫెడరల్ వ్యవస్థలను నాశనం చేస్తోందని చెప్పారు. కేంద్రంలో ఉచిత పథకాలూ ఇస్తూ రాష్ట్రాలు ఇవ్వొద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేదలకు సంక్షేమ పథకాలు వద్దని చెబుతున్న బీజేపీ పాలకులు రూ.16 లక్షల కోట్లను పెద్దలకు పన్నుల రూపంలో రాయితీ ఇచ్చారన్నారు.