Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆబ్కారీ విధానంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు
- ఇదంతా కక్షసాధింపు..తప్ప మరోటి కాదు : ఆప్ నాయకులు
న్యూఢిల్లీ : రాజకీయ ప్రత్యర్థులపై మోడీ సర్కార్ సీబీఐని ఉసిగొల్పింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్‌లో కీలక వ్యక్తి, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో శుక్రవారం సీబీఐ అధికారులు సోదాలు జరిగాయి. మద్యం విధానంపై దాఖలైన కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నారని వార్తా కథనాలు వెలువడ్డాయి. సిసోడియా నివాసంతోపాటు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని 21చోట్ల ఈ సోదాలు జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో గతేడాది నవంబర్‌లో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతోపాటు విధానపరమైన లోపాలున్నట్టు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా..కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్రను అందులో ప్రస్తావించారు.
ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ...దర్యాప్తులో భాగంగా నేడు సోదాలు చేపట్టింది. సిసోడియా నివాసం, కార్యాలయంతో పాటు మాజీ ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ తదితరుల ఇండ్లలో తనిఖీలు జరుపుతోంది.
కేంద్రం ఇస్తోన్న బహుమానం : సీఎం అరవింద్ కేజ్రీవాల్
సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. తాము చేస్తున్న మంచి పనులకు కేంద్రం ఇస్తోన్న బహుమానం ఇదేనంటూ దుయ్యబట్టారు. గతంలో ఆప్ నేతలపై దాడులు జరిగాయని, అప్పుడు దర్యాప్తు సంస్థలకు ఏమీ దొరకలేదని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని కేజ్రీవాల్ ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. సీబీఐ దాడుల విషయాన్ని మనీశ్ సిసోడియా ట్విటర్‌గా వేదికగా ధ్రువీకరించారు. ''మా ఇంట్లో సీబీఐ అధికారులకు స్వాగతం పలికాం. దర్యాప్తునకు మా వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తాం. అప్పుడే నిజానిజాలు త్వరగా బయటకు వస్తాయి. అప్పటిదాకా నా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏమీ జరగదు. ఉత్తమ విద్య కోసం చేస్తున్న కృషిని ఎవరూ ఆపలేరు. అయితే దేశం కోసం మంచి పను లు చేస్తోన్నవారిని ఇలా వేధించడం దురదృష్ట కర'' మని సిసోడియా మండిపడ్డారు. కొంతమంది కావాలనే ఢిల్లీలో విద్య, వైద్య శాఖలపై ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి దుయ్యబట్టారు.