Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయవ్యవస్థను నిందించొద్దు..
- బిల్కిస్‌బానో కేసులో దోషుల విడుదలపై జస్టిస్ మృదులా భట్కర్
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో సామూహిక లైంగికదాడి కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న దోషులను జైలు నుంచి విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బిల్కిస్ బానో కేసులో దోషులకు శిక్ష విధించిన న్యాయమూర్తి జస్టిస్ మదులా భట్కర్ స్పందించారు. అత్యాచార దోషులను విడుదల చేయడం పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమే అని, ఇందుకు న్యాయవ్యవస్థను నిందించొద్దని కోరారు. ''ఈ విషయంలో ప్రజలు న్యాయవ్యవస్థను ఎందుకు తప్పుబడుతున్నారో అర్థం కావట్లేదు. అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ప్రజల హక్కులను పరిరక్షించేందుకు న్యాయవ్యవస్థ శాయశక్తులా ప్రయత్నిస్తుంటుంది. బిల్కిస్ బానో కేసులోనూ మేం అదే చేశాం. సెషన్స్ కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకూ మేమంతా ప్రజలకు న్యాయం దక్కేందుకే పనిచేస్తాం. కానీ, ఈ రోజు మమ్మల్ని విమర్శించడం బాధ కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మమ్మల్ని మేమే రక్షించుకోలేకపోతున్నాం'' అని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. 2002లో బిల్కిస్ బానో కేసులో 11 మందికి జీవిత ఖైదు విధించిన డివిజన్ బెంచ్‌లో జస్టిస్ మృదుల భట్కర్ ఒకరు. ప్రస్తుతం ఆమె మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యూనల్‌కు ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో జరిగిన అల్లర్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఈ కేసులో 11 మందికి జీవితఖైదు పడింది. ఇటీవల ఈ దోషుల్లో ఒకరు తనను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు.
ఆ రేపిస్టులు 'బ్రాహ్మణులు... సంస్కారులు' : బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
బిల్కిస్ బానోపై లైంగికదాడి చేసిన రేపిస్టులు బ్రాహ్మణులు సంస్కారం కల్గిన వారు' అని గోద్రా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సికె రౌల్జి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ అల్లర్ల సమయంలో అఘాయిత్యానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను ఇటీవ గుజరాత్ ప్రభుత్వం విడుద చేయగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, దోషులకు మద్దతుగా ఎమ్మెల్యే మాట్లాడటం గమనార్హం.