Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ఆర్థిక వృద్ధి, సంక్షేమం..ప్రభుత్వ బ్యాంకులతోనే సాధ్యం..
- కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తిరేపిన ఆర్బీఐ తాజా నివేదిక
న్యూఢిల్లీ : ప్రభుత్వ బ్యాంకులను గంపగుత్తగా ప్రయివేటీకరణ చేయటానికి మోడీ సర్కార్ ఉబలాటపడుతోంది. అయితే ఇది ఎంతమాత్రమూ సరైన విధానం కాదని, మేలు కన్నా కీడే ఎక్కువ..అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 'ఎకనామిక్ రీసెర్చ్' నివేదిక హెచ్చరించింది. మోడీ సర్కార్‌కు సూటిగా చెప్పే పరిస్థితులులేక..బులిటెన్ విడుదల చేస్తూ..ఇందులో అనేక అంశాలు ప్రస్తావించింది. బ్యాంకుల ప్రయివేటీకరణ వద్దుగాక..వద్దు అని స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆర్బీఐ ఆర్థిక అంశాల పరిశోధనా సంఘం ఈ నివేదికను రూపొందించింది. ఇందులో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి. రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రయివేటీకరణ చేయనున్నామని గత బడ్జెట్ (2021-22)లో మోడీ సర్కార్ ప్రకటించింది. ఒక్క ఎస్బీఐ తప్ప, మిగతా ప్రభుత్వ బ్యాంకులన్నీ ప్రయివేటీకరణ చేయాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్, ఎకనామిక్ రీసెర్చ్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ పూనమ్ గుప్త, నిటి ఆయోగ్ మాజీ వైస్ చైర్మెన్ అరవింద్ పనగారియా ఈ ఏడాది జులైలో కేంద్రానికి సిఫారసు చేశారు. ఈనేపథ్యంలో ఆర్బీఐ నుంచి ఈ నివేదిక వెలువడింది.
ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వ బ్యాంకులు పనిచేస్తుంటే, లాభాపేక్ష, లాభాల పెంపుకోసం ప్రయివేటు బ్యాంకులు పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొన్నది. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవటం కోసం బ్రిటన్, వెనెజులా, కజకిస్తాన్, ఐస్లాండ్..తదితర దేశాల్లో బ్యాంకుల జాతీయీకరణ, ప్రభుత్వ వాటా పెంపు వంటి చర్యలు చేపట్టాయని ఆర్బీఐ విశ్లేషణా పత్రం ప్రస్తావించింది. అనేక దేశాల్లో ఆర్థిక వృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వ బ్యాంకులు తోడ్పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆర్థిక సాధికారతకు బ్యాంకుల గ్రామీణ శాఖల విస్తరణ దోహదపడుతోంది. జన్‌ధన్ ఖాతాలు ప్రభుత్వ బ్యాంకుల్లో 44.65 కోట్ల ఖాతాలున్నాయి. ప్రయివేటు బ్యాంకులు..కేవలం 1.30 కోట్ల ఖాతాలను మాత్రమే తెరిచాయి. బ్యాంకుల ప్రయివేటీకరణ ప్రమాదకరమని ఆర్బీఐ 'ఎకనామిక్ రీసెర్చ్' గ్రూప్ అనేక అంశాల్ని కేంద్రం ముందుకు తీసుకొచ్చింది.