Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్కిస్ బానో కేసుపై యూఎస్ ప్యానెల్
- న్యాయాన్ని అపహాస్యం చేయటమేనని వెల్లడి
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భారత్లోని రాజకీయపార్టీలు, మానవ హక్కుల కార్యకర్తలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, మైనారిటీ గ్రూపులు.. ఇలా ప్రతి ఒక్కరూ దోషుల విడుద లపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు అంతర్జా తీయ సమాజం కూడా గుజరాత్ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబడుతున్నది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యునైటెడ్ స్టేట్స్ కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్).. బిల్కిస్ బానో కేసులో లైంగికదాడి, హత్యకు పాల్పడిన ఆ 11 మంది దోషుల శిక్షలను తగ్గిస్తూ వారిని విడుదల చేయటాన్ని ఖండించింది. ఈ నిర్ణయం ''అన్యాయమైనది'' అని వివరిం చింది. దోషుల శిక్షలను తగ్గించటం న్యాయాన్ని అపహాస్యం చేయటమే అని యూఎస్సీఐఆర్ఎఫ్ కమిషనర్ స్టీఫెన్ ష్నెక్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసిన గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం.. లైంగికదాడి నిందితుల విడుదలపై ఉన్న మార్గదర్శకాలను పాటించకుండా ఆ 11 మంది దోషులకు భారత 75 స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా రెమిషన్ కల్పించిన విషయం తెలిసిందే.
విడుదల నిర్ణయం తప్పు
- బిల్కిస్ బానో నిందితులను దోషులగా తేల్చిన జడ్జి యు.డి సాల్వి వ్యాఖ్య
- ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేసిన చర్యను బాంబే హైకోర్టు మాజీ జడ్జి యు.డి సాల్వి ఖండించారు. ఇది చాలా చెడ్డ ఉదాహరణ అన్నారు. వీరి విడుదలతో ఇప్పుడు ఇతర లైంగికదాడి కేసుల్లో నిందితులుగా ఉన్న దోషులు కూడా ఇలాంటి ఉపశమనాలను కోరుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం విస్తృత పరిణామాలను కలిగిస్తుందని చెప్పారు. మహిళలను గౌరవించాలనీ, వారిని కించపర్చటం మానుకోవాలని ప్రధాని మోడీ భారతీయులను కోరుతున్న తరుణంలో గుజరాత్ రాష్ట్రం 11 మంది దోషులను జైలు నుంచి విడుదల చేయటం ఆశ్చర్యకరంగా ఉన్నదని సాల్వి చెప్పారు. మన ప్రధాని మహిళా సాధికారత గురించి మాట్లాడారనీ, అయితే, ఆయన (ప్రధాని) ఏ రాష్ట్రం నుంచి వచ్చారో అదే రాష్ట్రంలో ఒక నిస్సహాయురాలైన మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన నిందితులను విడుదల చేశారని గుర్తు చేశారు. కాగా, జస్టిస్ సాల్వి 2008లో ఈ 11 మందిని దోషులుగా నిర్ధారించి వారికి యావజ్జీవ కారాగార శిక్షను విధించారు. సాక్ష్యాలు లేని కారణంగా మరో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేశారు.
1992 రెమిషన్ పాలసీని దోషుల విడుదలకు వినియోగించటాన్ని ఆయన ప్రశ్నించారు. '' ఈ పాలసీ ప్రకారం దోషుల అభ్యర్థనలను పరిగణ లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని నాకర్థమైంది. అయినా.. మన దేశ అత్యున్నత న్యాయస్థానం అలాంటి నిర్ణయాన్ని ఎలా అనుమతించగలదు'' అని సాల్వి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ''నిందితుడు తప్పు చేశాడని నిర్ధారించటానికి శిక్ష విధించబడుతుంది. నిందితుడు పశ్చాత్తాపం చెందాలి. దానిని వ్యక్తం చేయాలి. ప్రస్తుత సందర్భంలో అలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేశారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. వారు పశ్చాత్తాపపడుతున్నారనీ, నేరాన్ని గ్రహించారని వారు వ్యక్తం చేశారా?'' అని ప్రశ్నించారు. ఖైదీలు విడుదలైన తర్వాత జైలు వెలుపల వారికి మిఠాయిలు, పూలమాలలతో స్వాగతం పలకటాన్ని ఆయన ఖండించారు.