Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు బీకేయూ నేత రాకేశ్ టికాయత్ పిలుపు
- సమయం, స్థలాన్ని ఎస్కేఎం నాయకులు తెలుపుతారని వెల్లడి
న్యూఢిల్లీ : డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధంగా ఉండాలని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ రైతులకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అజరు మిశ్రాను తొలగించాలనీ, కనీస మద్ధతు ధర (ఎంఎస్పీ) చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) 75 గంటల నిరాహార దీక్షను చేపట్టింది. యూపీలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని రాజాపూర్ మండి సమితి ధర్నా స్థలానికి అనేక రాష్ట్రాలకు చెందిన రైతులు చేరుకున్నారు. ఈ తరుణంలో దేశవ్యాప్త ఆందోళనకు రాకేశ్ టికాయత్ పిలుపుని చ్చారు. దేశవ్యాప్త ఆందోళన, సమయం, స్థలం, స్వభావాన్ని సరైన సమయంలో ఎస్కేఎం నాయకులు తెలుపుతారని టికాయత్ అన్నారు. ఎస్కేఎం ను బలోపేతం చేయాలని రైతులను కోరారు. లఖింపూర్ ఖేరీ లోక్సభ స్థానానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మిశ్రా నాయకత్వం వహి స్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రా గతేడాది అక్టోబర్ 3న జరిగిన లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ హింసా కాండలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు సహా ఎనిమిది మంది చనిపోయారు. లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటన గురించి దేశం మొత్తానికీ తెలుసనీ రాకేశ్ టికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇప్పటికీ మంత్రి పదవిలో కొనసాగటం హాస్యాస్పదం గా ఉన్నదన్నారు. రైతులు డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి అజరు మిశ్రాను తొలగించటమే కాకుండా జైళ్లలో ఉన్న అమాయక రైతులను విడుదల చేయటం, ఎంఎస్పీ హామీ చట్టం, విద్యుత్ సవరణ బిల్లు 2022 ఉపసంహరణ, రైతులకు భూముల హక్కులు వంటి ఇతర డిమాండ్లు ఉన్నాయని టికాయత్ చెప్పారు. ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ సింగ్ పాల్, స్వరాజ్ ఇండియా జాతీయ కన్వినర్ యోగేంద్ర యాదవ్, సామాజిక కార్యకర్త మేధా పాల్కర్ సహా ప్రముఖ నాయకులు ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, యూపీలకు చెందిన ప్రముఖ రైతు నాయకులు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.