Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటరు నమోదుకు ధ్రువీకరణ పత్రాలేవీ అవసరం లేదు
- ఆందోళన రేపుతున్న ఎన్నికల సంఘం ప్రకటన
- తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష పార్టీలు
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే కుట్రలకు తెర లేపింది. భారత ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని వివాదస్పద ఎత్తుగడలతో కాశ్మీర్లో పాగా వేసేందుకు పడరానీపాట్లూ పడుతోంది. జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ నియోజక వర్గాల పునరవ్యవస్థీకరణపై వివాదాలు సద్దు మణగముందే ..ఇప్పుడు ఓటర్ల జాబితా విషయంలో తీసుకున్న నిర్ణయాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జమ్ముకాశ్మీర్‌లో నివాసం ఉంటే చాలు 18 ఏండ్లు వయస్సున్న వారెవ్వరైనా సరే ఓటు హక్కు పొంద వచ్చునంటూ ఇటీవల ఎన్నికల సంఘం చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రజాస్వామ్యానికి మోడీ సర్కార్ పాడి కడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ ఓటర్ల జాబితాకు సంబంధించిన పూర్వపరాలేమిటో చూద్దాం..
ఇప్పటి వరకు ఏం జరిగింది?
జమ్ముకాశ్మీర్ ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) హిర్దేష్ కుమార్ ఈ నెల 17న ఒక ప్రకటన చేశారు. జమ్ముకాశ్మీర్‌లో సాధారణంగా నివసిస్తున్న వారందరూ ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం.. కేంద్ర పాలిత ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు నని ఆయన పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ముకాశ్మీర్, లడఖ్‌గా ముక్కలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి పూర్వం అంటే జమ్ముకాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నికల ఓటర్ల జాబితాలో పేర్లు లేనివాళ్లు సైతం ఇప్పుడు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చునని సిఇఒ తెలిపారు. ఈ నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ తుది ఎన్నికల ఓటర్ల జాబితాలో దాదాపు 20-25 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదు అయ్యే అవకాశముం దని భారత ఎన్నికల సంఘం అంచనా వేస్తోందని ఆయన చెప్పారు.
భద్రతా బలగాలకూ ఓటు !
దేశంలో అతిచిన్న వయస్సున్న (ఏర్పాటు పరంగా) కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకాశ్మీర్‌లో తొలిసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికల కోసం ఇదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైనిక బలగాలు ఓటర్లగా నమోదు చేసుకొని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావచ్చునని సిఇఒ కుమార్ ప్రకటించారు. ఈ ఏడాది మే 20 నుంచి కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ అమల్లోకి తీసుకొచ్చిన డీలిమిటేషన్ కమిషన్ తుది ఉత్తర్వులను అనుసరించి పునరువ్యవస్థీక రించిన అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారంగా పాత ఓటర్ల జాబితాను సరిచేయనున్నట్లు సిఇఒ తెలిపారు.
ఓటర్ల జాబితాను సవరించాల్సిన అవసరమేమిటి?
జమ్ముకాశ్మీర్ పునర్వ్యస్థీకరణ చట్టం -2019 ప్రకారం..జమ్ముకాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ఏడు కొత్త అసెంబ్లీ నియోజక వర్గాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఆరు జమ్ము డివిజన్‌లోనూ, ఒకటి కాశ్మీర్‌లోనూ ఉంది. వీటి ఆధారంగా జమ్ముకాశ్మీర్‌లో ఇప్పుడు ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సవరిస్తోంది. జమ్ముకాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పు డు చివరిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. కేంద్ర ప్రభుత్వం ఏ క్షణాన ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన అందుకు సిద్ధంగా ఉండేవిధంగా డీలిమిటేషన్ ఈ ఎన్నికల జాబితాలను సంసిద్ధం చేస్తోందని సిఇఒ తెలిపారు. 2022 అక్టోబరు 1వ తేదీ నాటికి 18వ సంవత్సరంలోకి ప్రవేశించే వారికి నూతన ఓటర్ల జాబితాలో చోటు కల్పించి వారికి కూడా ఓటు హక్కు కల్పించాలని భారత ఎన్నికల సంఘం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నవంబరు 25న తుది ఓటర్ల జాబితాను ప్రచురించే వీలుంది.
నివాస ధ్రువీకరణ అవసరం లేదు!
జమ్ముకాశ్మీర్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడానికి నివాస ధ్రువీకరణ పత్రమేదీ సమర్పించాల్సిన అవసరం లేదని ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) తెలిపారు. ఉద్యోగు లైనా, విద్యార్థులైనా, కూలీలైనా, వేరే ఎవరైనా సరే సాధారణంగా జమ్ముకాశ్మీర్‌లో నివసి స్తుంటే చాలు..వారందరూ వెలుపలివారైనా సరే ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చునని ఆయన ప్రకటించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భద్రత బలగాలు ఇక్కడ వుంటే వాళ్లు కూడా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకొని ఓటింగ్‌లో పాల్గొనవచ్చు అని ఆయన వివరించారు. దాదాపు 76 లక్షల మంది ఓటర్లతో ఉండే కొత్త జాబితాలో తాజాగా పేర్లు నమోదు చేసుకునే కొత్తవారు సుమారు 25 లక్షల మంది వరకు ఉండేవీలుందని ఆయన పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్‌లో 18 సంవత్సరాలు వయస్సు పైబడినవారు 98 లక్షల మంది వరకు ఉండవచ్చునని ఆయన అంచానా వేశారు.
2019 నాటికి ముందున్న విధానం ఏమిటి?
2019 ఆగస్టు 5వరకు జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగ అధికారాలుండేవి. జమ్ముకాశ్మీర్ ప్రజా ప్రాతినిధ్య చట్టం -1957 నిబంధనల ప్రకారంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ల జాబితా రూపొందించేవారు. ఆ చట్టం ప్రకారం..జమ్ముకాశ్మీర్‌లో శాశ్విత నివాసితులకు మాత్రమే ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుంది. ఓటు హక్కు పొందేందుకు కోసం శాశ్విత నివాస ధ్రువీకరణ పత్రం, ప్రస్తుతమున్న నివాస ధ్రువపత్రం తప్పనిసరిగా సమర్పించాల్సి వుండేది. పశ్చిమ పాకిస్తాన్‌లోనూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ వలస వచ్చినవారు, ఇతర కారణాలతో ఆ ప్రాంతంలో నివాస ముంటున్నా కూడా వారికి ఓటు హక్కుకు వీలుండేది కాదు. అయితే 2019 ఆగస్టు 5 తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు వీలు కల్పించారు. బహుశా చొరబా టుదారులు కూడా ఓటు వేసివుండవచ్చు.
స్థానిక రాజకీయ పార్టీలేమంటున్నాయి?
ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను ఒక్క బిజెపి మినహా జమ్ముకాశ్మీర్‌లోని రాజకీయ పార్టీలన్నీ ముక్తకఠంతో ఖండించాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, సిపిఎం, పీపుల్స్కాన్ఫరెన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అందరికీ ఓటు హక్కు కల్పించేలా తలుపులు బార్లా తెరిచేస్తే..స్థానికులు ఎన్నికల పరంగా మైనార్టీలుగా మారిపోయే ప్రమాద ముందని ఆ పార్టీలన్నీ హెచ్చరించాయి. వచ్చే జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికల కోసం దాదాపు 25 లక్షల మంది స్థానికేతరులకు ఇక్కడకు తీసుకొచ్చి ఓటు హక్కు కల్పించడం ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు బీజేపీ కుట్ర సాగిస్తోందని పీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తీ ఆందోళన వ్యక్తం చేశారు.
'ప్రజాస్వామ్యాన్ని పాడేక్కించేం దుకు మోడీ సర్కార్ చివరి ఎత్తు ఇది' అని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1990లలో కాశ్మీర్లో తీవ్రవాద కార్యాకలాపాలు పెద్ద ఎత్తున పెరగడానికి దారితీసిన 1987 నాటి జమ్ముకాశ్మీర్ ఎన్నికల రిగ్గింగ్ ఉదంతాన్ని ప్రస్తుత మోడీ సర్కార్ చర్య పోలివుందని పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ లోన్ అభివర్ణించారు. 'దయచేసి 1987ని గుర్తుంచుకోండి. మేము ఇంకా దాని నుండి బయటపడలేదు. 1987ని మళ్లీ పునరావృతం చేయవద్దు. ఇది వినాశకరమైనది' అని లోన్ హెచ్చరించారు.