Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 రోజులుగా పునరావాస కేంద్రాల్లోనే.. శ్రీ గోదావరి వరద బాధితుల కన్నీటి గాధ
ఏలూరు : ఇది ఏపీలో గోదావరి వరద బాధితుల దీన గాధ! ఉప్పొంగిన గోదావరి వారి కలలను కల్లలు చేసింది. అప్పటిదాకా ఉంటున్న ఇళ్లు గోదావరి పాలు కావడంతో, తలదాచుకోవడానికి ఏ దారీ కనిపించక ఇంకా పునరావాస కేంద్రాల్లోనే మగ్గుతున్నారు. వారం, రెండు వారాలు కాదు... వారు ఈ శిబిరాలకు చేరి ఇప్పటికే 40రోజులు దాటాయి. ఆదుకుంటా మంటూ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు ఆచరణలోకి రాకపోవడంతో ఇంకెన్ని రోజులు ఈ శిబిరాల్లో ఉండాల్సి వస్తుందో అర్థం కాని పరిస్థితి. వందలాది కుటుంబాలు ఇలా గూడు కూలి... గుండె పగిలి శిబిరాల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం సాయం చేస్తే సొంత ఊళ్లకు వెడతామని వీరు చెబుతున్నారు. మరోవైపు శిబిరాలు ఏర్పాటు చేసి రోజులు గడిచి పోవడంతో ప్రభుత్వంనుండి నిత్యావసరాల సరఫరా కూడా తగ్గిపోతోంది. దీంతో తినడానికి తిండిలేని పరిస్థితి కూడా ఏర్పడుతోంది. గత నెల రెండో వారంలో గోదావరి వరద విరుచుకుపడింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 70 అడుగులు, పోలవరం స్పిల్ వే వద్ద 38 మీటర్లకు చేరింది. దీంతో, గతంలో ఎన్నడూ చూడని విధంగా ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 125 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఇళ్ల పైకప్పుల మీదుగా వరద నీరు పారింది. వరద బాధితులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గత నెల 12న పునరావాస కేంద్రాలకు తరలిపోయారు. వేలేరుపాడు మండలం రుద్రమ్మకోట గ్రామస్తులు కొండ గుట్టలపై తలదాచుకున్నారు. వరదలకు ఇళ్లన్నీ కుప్పకూలిపోవడంతో ఇప్పటికీ కుక్కునూరు మండలం ఎ-బ్లాక్‌కు చెందిన 650 కుటుంబాలు కివ్వాక పునరావాస కేంద్రంలోనే ఉన్నాయి. గొమ్ముగూడెం గ్రామానికి చెందిన 213 కుటుంబాలు, వేలేరుపాడు మండలం రేపాకగొమ్ముకు చెందిన 250 కుటుంబాలు రావికుంట పునరావాస కేంద్రంలో నేటికీ తలదాచు కుంటున్నాయి. రుద్రమకోట గ్రామానికి చెందిన 125 కుటుంబాలు కొండగుట్టపై కాలం వెళ్లదీస్తున్నాయి. తొలిసారి వరదలకు రెండు మండలాల్లో దాదాపు ఎనిమిది వేల ఇళ్లు కుప్పకూలిపోయాయి. దీంతో గ్రామాలకు వెళ్లి ఉండే పరిస్థితి లేకుండాపోయింది. వెంటనే మరోసారి వరద రావడంతో, గ్రామాలను నీరు మళ్లీ చుట్టుముట్టింది. రోడ్లన్నీ మునిగిపోవడం తో రాకపోకలు నిలిచిపోయాయి. 40 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లో దాదాపు 1100కుపైగా కుటుంబాలు ఉన్నాయి. మొదటిసారి వరదల సమయంలో 25 కిలోల బియ్యం, నాలుగు రకాల కూరగాయలు, ఒక నూనె ప్యాకెట్, రూ.రెండు వేల ఆర్థిక సాయం అందించి చేతులు దులుపుకుందని తెలిపారు. ఈ సాయం పది రోజులకు కూడా సరిపోలేదని చెప్పారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ మళ్లీ తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో విద్యుత్తు, తాగునీటి కొరత వంటి సమస్యలు వెంటాడుతున్నాయని తెలిపారు. వరదలకు పంట పొలాలన్నీ మునిగిపోవడంతో 40 రోజులుగా ఏ ఒక్కరికీ పని లేకుండాపోయిందన్నారు. కొండగుట్టపై ఉన్న రుద్రమ్మకోట గ్రామస్తులకు మాత్రం రెండోసారి వరదల సమయంలో నాలుగు రకాల కూరగాయలు ఇచ్చారు. తమకు పనైనా చూపండి. లేకపోతే తిండైనా పెట్టండి అంటూ బెస్తగూడెం ఎస్సి కాలనీకి చెందిన వరద బాధితులు ఆందోళనకు సైతం దిగారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వందలాది వరద బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. దాతలు చేసిన సాయంతోనే కడుపునింపుకుంటూ రోజులు నెట్టుకొస్తున్నారు. తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వరద బాధితులంతా కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
వరదలకు రావికుంట పునరావాస కేంద్రానికి తరలించి 40 రోజులైంది. ఇళ్లన్నీ పడిపోవడంతో గ్రామానికి వెళ్లే పరిస్థితి లేదు. పునరావాస కేంద్రంలో తాగునీరు కూడా సరిగా అందడం లేదు. చుట్టూ వరద నీరు చేరడంతో ఏపనీ లేకుండాపోయింది. తొలుత చేసిన సాయం తప్ప, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అంద లేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
-గుమ్మల వెంకటనర్సయ్య, రేపాకగొమ్ము
పనిలేదు... చేతిలో చిల్లిగవ్వలేదు
జులైలో వచ్చిన వరదలకు కుక్కునూరు ఎ-బ్లాక్ మొత్తం మునిగిపోవడంతో కివ్వాక పునరా వాస కేంద్రానికి వెళ్లాం. రెండోసారి వరదకు సైతం మా ప్రాంతం ముంపునకు గురైంది. ఇల్లు ఒరిగి పోవడంతో ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. తొలుత బియ్యం, కూరగాయలు ఇవ్వడం మినహా మళ్లీ పట్టించుకోలేదు. పనిలేక, డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నాం. పరిహారమైనా ఇస్తే వెళ్లిపోతాం.
-షేక్ ఇమామ్బి, కుక్కునూరు, ఎ-బ్లాక్