Authorization
Mon Jan 19, 2015 06:51 pm
* విద్యాసంస్థల తీరుపై సీజేఐ ఎన్వీ రమణ విచారం
• భావ స్వేచ్ఛ, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని పిలుపు
న్యూఢిల్లీ : దేశంలోని విద్యాసంస్థలు విద్యార్థులను వారి సామాజిక, సాంస్కృతిక మూలాల నుంచి వేరు చేసే విద్యా కర్మాగారాలుగా మారాయని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు వినూత్న ఆలోచనలు, మార్గనిర్దేశం పరిశోధనలకు కేంద్రాలుగా మారుతూ.. వాక్ స్వేచ్ఛ (భావ ప్రకటన స్వేచ్ఛ), సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని అన్నారు. వృత్తిపరమైన కోర్సులపై దృష్టి అనేది కావాల్సిన అవుట్ పుటను ఉత్పత్తి చేసే అధిక వేతనంతో కూడిన విధేయులైన కార్మిక శక్తిని సృష్టించటం అని చెప్పారు. మానవ శాస్త్రాలు, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, భాషల వంటి సమానమైన ముఖ్యమైన సబ్జెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్నత విద్యాసంస్థలు సామాజిక ఔచిత్యాన్ని కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. "పుటగొడుగుల్లా పుట్టుకొచ్చిన విద్యా కర్మాగారాలను మనం చూస్తున్నాం. ఇవి డిగ్రీలు, మానవ వనరుల విలువ తగ్గింపునకు దారి తీస్తున్నాయి. ఎవరిని నిందించాలో నాకు ఖచ్చితంగా తెలియదు” అని రమణ అన్నారు.