Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కదంతొక్కిన రైతాంగం
- ఎంఎస్పీ చట్టంతో సహా ఆరు డిమాండ్లు పరిష్కరించాలి : జంతర్ మంతర్‌లో కిసాన్ మహా పంచాయత్ డిమాండ్
న్యూఢిల్లీ :ఢిల్లీ వేదికగా మరోసారి అన్నదాత జై కిసాన్ అంటూ నినదించాడు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. రైతాంగం కదం తొక్కింది. వేలాది మంది రైతులు దేశరాజధాని హస్తినలో ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) ఆధ్వర్యంలో సోమవారం జంతర్ మంతర్ వద్ద కిసాన్ మహా పంచాయత్ జరిగింది. ఈ మహా పంచాయత్‌లో ఆరు తీర్మానాలు ఆమోదించారు. అనంతరం ''కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టం చేయాలి. రైతుల రుణాలు మాఫీ చేసి, రైతు ఆత్మహత్యలు ఆపాలి. విద్యుత్ బిల్లుపై ఎస్కేఎంతో సంప్రదింపులు జరపాలి. లఖింపూర్ ఖేరీ నిందితుడు కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రాను తొలగించాలి. ఈ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయొద్దు. అలాగే స్వేచ్ఛా వాణిజ్యం సంప్రదింపులు ఆపాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి నిష్క్రమించాలి'' వంటి ఆరు డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వినతిపత్రం పంపించారు. రైతులు ఆందోళనలో భాగస్వామ్యం కాకుండా ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకున్నారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద వందలాది మంది రైతులను అడ్డుకున్నారు. అక్కడ వందలాది మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. వారిని మధు విహార్‌తో పాటు ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు. భద్రతా చర్యలు వంటి కారణాలతో రైతులను నిలిపివేశామని డీసీపీ (తూర్పు) ప్రియాంక కశ్యప్ తెలిపారు. 2021 డిసెంబర్ 9న ఎస్‌కేఎంకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో తాము ఆందోళన చేశామని బీకేయూ ఎక్తా నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ అన్నారు. రైతులు ఢిల్లీలోకి రాకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ''కర్నాల్ బైపాస్ వద్ద వాహనాలను నిలిపివేశారు. మేం ఇది శాంతియుతంగా చేస్తున్నాం. మా కార్యక్రమం ఒక రోజు మాత్రమే. రైతులు చాలా దూరం నుంచి వచ్చారు'' అని తెలిపారు. ఈ ఆందోళనలో రైతు నేత అభిమన్యు కోహర్, పంజాబ్, హర్యానా, యూపీతోపాటు పలు రాష్ట్రాల రైతులు పాల్గొన్నారు.