Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సానుకూల మార్పులు రాలే
- భారత విద్యా విధానాల తీరుపై విద్యావేత్తలు, నిపుణుల ఆందోళన
- 75 ఏండ్లుగా ఆశించిన ఫలితాలు కనబడని వైనం
న్యూఢిల్లీ: పరాయి పాలన నుంచి భారత్‌కు స్వాతం త్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడించింది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో కేంద్రం ఉత్సవాలకు పిలుపునిచ్చింది. 'హర్ ఘర్ తిరంగా' అంటూ జెండాలు ఎగరవేయాలన్నది. అంతా బాగానే ఉన్నా.. 75 ఏండ్ల కాలంలో దేశం సాధించిన అభివృద్ధి ఏమిటీ? సాధించాల్సి నది ఏమున్నది? అనే ఆత్మపరిశీలనకు మాత్రం మోడీ సర్కా రు చోటు ఇవ్వలేదని విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా, దేశంలోని విద్యా విధానం నిరాశజనకంగా ఉన్నది. ఈ 75 ఏండ్ల కాలంలో భారత్‌లోని విద్యా విధానం ప్రగతిశీల మార్పులను తీసుకు రాలేకపోయిందని విద్యావేత్తలు, నిపుణు లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ప్రభుత్వాలు తీసుకొచ్చి న పలు విద్యా విధానాలు దేశ ప్రజల్లో అసమానతలను నిర్మూలించలేక పోయిందన్నారు. దేశంలో సానుకూల మార్పులను తీసుకురాలేదన్నారు. ప్రభుత్వాలు అనుసరిం చిన పలు విద్యా విధానాలు విఫలమయ్యాయని నిపుణులు చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశంలో విద్యారంగం దుర్భర స్థితి గురించి భారతీయ నాయకులకు తెలుసు. అవిభక్త భారత్‌లో క్రూడ్ అక్షరాస్యత 16 శాతమే ఉన్నది. కారణం, ప్రాథమిక విద్యలో తక్కువ ప్రవేశం, భారతీయుల అభివృద్ధి పట్ల బ్రిటీషు ప్రభుత్వ ఉదాసీనత, మహిళలతో పాటు వెనకబడిన వర్గాలకు విద్యను నిరాకరించే సంస్కృతి ఉండటం. ఈ కారణాలతో భారత రాజ్యాంగాన్ని రూపొంది ంచే సమయంలో విద్యాభ్యాసానికి అనుకూలమైన, కుల వ్యతిరేక సంఘాలు.. విద్యను ప్రాథమిక హక్కుగా చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో పదేండ్లలోలోపు పిల్లలందరికీ పద్నాలుగు ఏండ్లు వచ్చే వరకు ఉచిత, నిర్బంధ విద్యను అందించాలనే నిబంధన వచ్చి చేరింది.
అనంతరం దేశంలో అక్షరాస్యత పదేండ్లలో 24 శాతానికి పెరిగింది. పరిస్థితిని చక్క దిద్దేందుకు ప్రభుత్వం కొఠారీ కమిషన్‌ను (1964)లో నియమించింది. ఇతర విషయాలతో పాటు, 1985-86 నాటికి ఉమ్మడి ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టాలనీ, విద్యపై ప్రభుత్వ పెట్టుబడిని అప్పటి జీడీపీలో 2.9 శాతం నుంచి ఆరు శాతానికి క్రమంగా పెంచాలని కమిషన్ సిఫారసు చేసింది. అయితే, 55 ఏండ్లు గడిచినప్పటికీ.. కొఠారీ కమిషన్ సిఫారసులు మాత్రం అమలుకు నోచుకోలేదని నిపుణులు గుర్తు చేశారు. దీంతో దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా విద్య సమూల పునర్నిర్మాణానికి కట్టుబడి లేదని ఈ కమిషన్ సభ్య కార్యదర్శి, ప్రఖ్యాత విద్యావేత్త జె.పి నాయక్ తీవ్రంగా విమర్శించారు.
ఆ తర్వాత 1976లో రాజ్యాంగాన్ని సవరించి విద్యను ''ఉమ్మడి జాబితా'' అంశంగా మార్చారు. 1986లో, కేంద్రం విద్యా సమస్యలను పరిష్కరించటానికి కొత్త జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) జారీ చేసింది. 1988లో ప్రారంభించబడిన ఆపరేషన్ బ్లాక్‌బోర్డు అనేది పాఠశాలల్లో ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు, బోధన, అభ్యస సామాగ్రి వంటి కనీస అవసరాలను అందించటానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమం. అయితే, నిర్దేశిత లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోయిందని విద్యావేత్తలు, నిపుణులు చెప్పారు. వికేంద్రీకరణ ప్రణాళిక నమూనాను ఉపయోగించి పిల్లల నమోదును పెంచటానికీ, డ్రాపౌట్లను తగ్గించటానికి, అభ్యాస ఫలితాలను మెరుగుపర్చటానికి కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో ప్రపంచ బ్యాంకు నిధులతో జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమాన్ని (డీపీఈపీ) ప్రారంభించింది. ఎన్సీఈఆర్టీ మాజీ అధిపతి కృష్ణ కుమార్ ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా విమర్శించారు. తాత్కాలికంగా ఉపాధ్యాయులను నియమించటం, నాసిరకం ప్రత్యామ్నాయ పాఠశాలలను ప్రోత్సహించటం ద్వారా ఉపాధ్యాయుల నాణ్యత, స్థాయిని తగ్గించటం ద్వారా డీఈపీ భారత విద్యను దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2000లో కేంద్రం సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)ను తీసుకొచ్చింది. ఇటు ఎస్ఎస్ఏ అమలు, సాధించిన ఫలితాలూ అంత ఆశాజనకంగా లేవని నిపుణులు చెప్పారు.
విద్య వ్యాపారంగా..
75 ఏండ్ల తర్వాత.. భారత విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. అయితే, ఇవన్నీ దేశంలోని పేదలు, అట్టడుగుస్థాయి ప్రజలకు పనికొచ్చే రీతిలో కాదని విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో తక్కువ-నాణ్యత, ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అవి విద్యను వ్యాపారంగా మార్చాయనీ, ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ వాటిని నియంత్రించకుండా చోద్యం చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మోడీ పాలనలో కాషాయీకరణ
ఇక కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య కాషాయీకరణ ప్రయత్నాలు విస్తృతంగా కొనసాగాయని ఆరోపించారు. ఒక మతానికి చెందిన ప్రముఖుల చరిత్రలను, పాఠ్యాంశాలను పాఠశాలల పుస్తకాల నుంచి ఆయా రాష్ట్రాల్లో అక్కడి బీజేపీ ప్రభుత్వాలు తొలగించాయన్నారు. వీటి స్థానంలో హిందూత్వ అనుకూల అంశాలను చేర్చటం బీజేపీ పాలనలో జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య అనేది సామాజికంగా సానుకూలమై, ప్రగతిశీల మార్పును తీసుకొచ్చే విధంగా ఉండాలని విద్యావేత్తలు, నిపుణులు చెప్పారు. ఇలా కులాలు, మతాల, ప్రాంతాల పేరుతో విద్యా వ్యవస్థలో విష బీజాలు నాటి రాబోయే తరాన్ని నాశనం చేయకూడదని సూచించారు. అది దేశ అభివృద్ధికే ప్రమాదాన్ని తీసుకొస్తుందని హెచ్చరించారు.